Telugu Global
Sports

ప్రపంచకప్ లో నేడే భారత్- పాక్ సమరం!

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లీగ్ లో దాయాదుల సమరానికి రంగం సిద్ధమయ్యింది. న్యూయార్క్ వేదికగా మాజీ చాంపియన్లు భారత్, పాక్ జట్లు సవాలు విసురుకొంటున్నాయి.

ప్రపంచకప్ లో నేడే భారత్- పాక్ సమరం!
X

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లీగ్ లో దాయాదుల సమరానికి రంగం సిద్ధమయ్యింది. న్యూయార్క్ వేదికగా మాజీ చాంపియన్లు భారత్, పాక్ జట్లు సవాలు విసురుకొంటున్నాయి.

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లీగ్ దశలోనే అతిపెద్ద సమరానికి న్యూయార్క్ నసావు స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు జరిగే సూపర్ సండే ఫైట్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ తలపడబోతున్నాయి.

భారత బ్యాటింగ్ కు పాక్ పేస్ సవాల్...

ప్రపంచకప్ గ్రూప్- ఏ లీగ్ మ్యాచ్ లకు వేదికగా ఉన్న నసావు స్టేడియం పిచ్ పేసర్ల పాలిట స్వర్గంగా, బ్యాటర్ల పాలిట నరకంలా ఉంది. 20 ఓవర్లలో కనీసం వంద పరుగులు చేయటం కూడా కనాకష్టంగా మారింది.

పవర్ ప్లే ( మొదటి 6 ) ఓవర్లలోనే నాలుగు నుంచి ఐదు వికెట్లు పడిపోవడం మామూలు విషయంగా మారింది. ఇదే వేదికగా భారత్-ఐర్లాండ్ జట్ల మ్యాచ్ తో సహా పలు మ్యాచ్ లు లోస్కోరింగ్ తోనే ముగిశాయి.

మహ్మద్ అమీర్ , షాహీన్ ఆఫ్రిదీ, నసీమ్ షా, హారిస్ రవూఫ్ లాంటి ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్ల తో కూడిన పాక్ పేస్ బ్యాటరీ...దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా, శివం దూబే, సూర్యకుమార్ యాదవ్ లతో కూడిన భారత్ కు అసలు సిసలు సవాలు విసురుతోంది.

టాస్ నెగ్గినజట్టుకే విజయావకాశాలు....

న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్ ల్లో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న జట్లే విజేతలుగా నిలుస్తూ వస్తున్నాయి. ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లు తక్కువ స్కోర్లకే కుప్పకూలిపోడం, చేజింగ్ కు దిగిన జట్లు విజేతలుగా నిలవడం ఎక్కువ శాతం జరుగుతూ వస్తోంది. దీంతో..ఈ సూపర్ సండే ఫైట్ లో సైతం మరోసారి టాస్ కీలకం కానుంది.

టాస్ నెగ్గినజట్టు మరో ఆలోచనలేకుండా చేజింగ్ వైపే మొగ్గు చూపడం ఖాయంగా కనిపిస్తోంది. 160 నుంచి 170 పరుగుల స్కోరు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి. మ్యాచ్ నెగ్గాలంటే కనీసం 150 పరుగుల స్కోరైనా ఉండితీరాలని న్యూయార్క్ పిచ్ రికార్డులు చెబుతున్నాయి.

భారత్ కు ఓపెనింగ్ జోడీనే కీలకం...

ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్...ఈ మ్యాచ్ లో విజేతగా నిలవాలంటే ఓపెనింగ్ జోడీ విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ అత్యంత కీలకం. ఈ ఇద్దరూ నిలదొక్కుకొంటేనే రోహిత్ సేనకు విజయావకాశాలు ఉంటాయి.

అయితే..పాక్ ఎడమ చేతి వాటం పేసర్ల జోడీ మహ్మద్ అమీర్ , షాహీన్ అఫ్రిదీల చేతిలో కొత్త బంతి ఉన్నంత వరకూ భారత ఓపెనర్లకు కష్టాలు తప్పవు. పవర్ ప్లే ఓవర్లలో వికెట్ పడకుండా కాపాడుకోగలిగితేనే భారత్ మ్యాచ్ విన్నింగ్ స్కోరు సాధించే అవకాశం ఉంటుంది.

సూపర్ హిట్టర్ రిషభ్ పంత్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సైతం తమ సత్తాను చాటుకోవాల్సి ఉంది.

కుల్దీప్ యాదవ్ కు తుదిజట్టులో చోటు దక్కేనా?

పాక్ ప్రత్యర్థిగా అద్భుతమైన రికార్డు కలిగిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు భారత తుదిజట్టులో చోటు దక్కడం అనుమానంగా ఉంది. ఐదుగురు ( సిరాజ్, బుమ్రా, అర్షదీప్, పాండ్యా, పేస్ ఆల్ రౌండర్ శివం దూబే) పేసర్లతో పాటు ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్ల ( అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా)లతో భారత్ తుదిజట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే..అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ కు చోటు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరోవైపు..బౌలింగ్ విభాగంలో అత్యంత పటిష్టంగా ఉన్న పాక్ జట్టు బ్యాటింగ్ లోనే సాదాసీదాగా కనిపిస్తోంది. పైగా ప్రారంభమ్యాచ్ లో అమెరికా చేతిలో సూపర్ ఓటమి చవిచూసిన పాక్ జట్టు తీవ్రఒత్తిడి నడుమ పోటీకి దిగుతోంది. భారత్ చేతిలో సైతం ఓడితే పాక్ జట్టు సూపర్ -8 రౌండ్ చేరడం అంతతేలిక కాబోదు.

కెప్టెన్ బాబర్ అజమ్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తీకార్ ల పైనే పాక్ బ్యాటింగ్ ప్రధానంగా ఆధారపడి ఉంది.

భారత్ 6- పాక్ 1...

టీ-20 ప్రపంచకప్ గత 8 టోర్నీలలో 7సార్లు మాత్రమే తలపడిన ఈ రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డు చూస్తే భారత్ దే పైచేయిగా ఉంది. రెండుజట్లూ 7సార్లు తలపడితే భారత్ 6 విజయాలు, పాక్ 1 గెలుపు రికార్డుతో ఉన్నాయి.

ఈరోజు జరిగే సూపర్ సండే ఫైట్ లో రెండుజట్ల గత రికార్డులు, ప్రతిభతో సంబంధం లేకుండా..బ్యాటింగ్ కు అనువుకాని పిచ్ పైన సమర్థవంతంగా రాణించినజట్టుకే విజయావకాశాలు ఉంటాయి.

లక్షల రేటుకు చేరిన భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు...

భారత్- పాక్ జట్ల మ్యాచ్ టికెట్లు లక్షల రూపాయల ధర పలుకుతున్నాయి. నసావు స్టేడియం ..అమెరికాలోని భారత్, పాక్ సంతతి అభిమానులతో కిటకిటలాడిపోనుంది.

ఆన్ లైన్ లో ముందుగానే బుక్ చేసుకొన్న ప్రీమియం క్లాస్ టికెట్ల ధరలు సెకండరీ మార్కెట్లో చుక్కలంటాయి. అత్యధిక ధర టికెట్ 33 లక్షల రూపాయలు కావడం ఓ రికార్డుగా మిగిలిపోనుంది.

భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 8 గంటలకు నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ దాయాదుల సమరం..భారత్, పాక్ అభిమానుల కేరింతలతో సందడి సందడి కానుంది.

పాక్ ప్రత్యర్థిగా నాలుగుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన విరాట్ కొహ్లీ..ఐదోసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం ద్వారా భారత్ ను విజేతగా నిలపాలని అభిమానులు కోరుకొంటున్నారు. ఈమ్యాచ్ లో నెగ్గితే భారత్ సూపర్-8 రౌండ్ సునాయాసంగా చేరుకోగలుగుతుంది.

First Published:  9 Jun 2024 8:07 AM IST
Next Story