Telugu Global
Sports

టీ-20 ప్రపంచకప్ లో ఐర్లాండ్ తో నేడు భారత్ తొలిపోరు!

ఐసీసీ-2024 టీ-20 ప్రపంచకప్ టైటిల్ వేటను భారత్ ఈరోజు ప్రారంభించనుంది.న్యూయార్క్ వేదికగా ఈరోజు జరిగే తొలిరౌండ్లో ఐర్లాండ్ తో పోటీపడనుంది.

టీ-20 ప్రపంచకప్ లో ఐర్లాండ్ తో నేడు భారత్ తొలిపోరు!
X

ఐసీసీ-2024 టీ-20 ప్రపంచకప్ టైటిల్ వేటను భారత్ ఈరోజు ప్రారంభించనుంది.న్యూయార్క్ వేదికగా ఈరోజు జరిగే తొలిరౌండ్లో ఐర్లాండ్ తో పోటీపడనుంది.

టీ-20 ప్రపంచకప్ మాజీ చాంపియన్ భారత్ 2007 తరువాత తొలి టైటిల్ కోసం తహతహలాడుతోంది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు హోదాలో 2024-ఐసీసీ ప్రపంచకప్ లీగ్ లో తొలిసమరానికి సిద్ధమయ్యింది.

న్యూయార్క్ నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే పోరులో ఐర్లాండ్ తో తలపడనుంది.

లోస్కోరింగ్ స్కోర్ల న్యూయార్క్...

తొలిసారిగా ప్రపంచకప్ క్రికెట్ కు ఆతిథ్యమిస్తున్న న్యూయార్క్ స్టేడియంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక పిచ్ బ్యాటర్ల సత్తాకు సవాలు విసురుతోంది. ప్రస్తుత ప్రపంచకప్ లో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ ల్లో బౌలర్లు చెలరేగిపోడం, లోస్కోర్లు నమోదు కావడంతో బ్యాటర్లు ఆచితూచి ఆడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఫ్లారిడా నుంచి తీసుకువచ్చి న్యూయార్క్ లో అమర్చిన పిచ్ లు మందకొడిగా, అత్యంత నిదానంగా ఉండడంతో బ్యాటింగ్ సవాలుగా మారింది. నేర్పు, ఓర్పు ఉన్న ఆటగాళ్లకు మాత్రమే పరుగులు సాధించే అవకాశం ఉంది. ఎడాపెడా షాట్లు కొడదామంటే అంతతేలిక కాదు.

ఓపెనర్ గా విరాట్ కొహ్లీ?

తన ప్రపంచకప్ కెరియర్ లో గత టోర్నీ వరకూ టాపార్డర్లో బ్యాటింగ్ కు దిగిన భారత రన్ మెషీన్ విరాట్ కొహ్లీ..ప్రస్తుత ప్రపంచకప్ లో మాత్రం ఓపెనర్ గా పరుగుల వేటకు దిగనున్నాడు.

కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి విరాట్..భారత బ్యాటింగ్ ను ప్రారంభించనున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో బెంగళూరు ఫ్రాంచైజీ ఓపెనర్ గా 708 పరుగులు సాధించడం ద్వారా ఆరెంజ్ క్యాప్ సాధించిన విరాట్..ప్రపంచకప్ లోనూ అదేజోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

ప్రపంచకప్ టోర్నీలో విరాట్ కు 81.50 సగటు ఉంది. 131.30 స్ట్ర్రయిక్ రేటు ఉంది.

వన్ డౌన్ లో రిషభ్ పంత్ లేదా సంజు శాంసన్, రెండోడౌన్లో సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజా బ్యాటింగ్ కు దిగే అవకాశాలున్నాయి.

అదనపు పేస్ బౌలర్ వైపు మొగ్గు..

న్యూయార్క్ పిచ్ తీరుతెన్నులను గమనించిన భారత టీమ్ మేనేజ్ మెంట్ తుదిజట్టులోకి అదనపు స్పిన్నర్ కు బదులు పేసర్ ను తీసుకోవాలని భావిస్తోంది. బుమ్రా, అర్షదీప్ సింగ్ లేదా సిరాజ్, పాండ్యా, దూబే పేస్ బౌలింగ్ లోనూ, కుల్దీప్, జడేజాలతో స్పిన్ బౌలింగ్ తో భారత్ పోటీకి దిగనుంది.

చిచ్చరపిడుగు లాంటి ఐర్లాండ్ ను తక్కువగా అంచనా వేస్తే భారత్ కు కష్ట్లాలు తప్పపు. అయితే..పసికూన జట్లలో ఒకటిగా పేరుపొందిన ఐర్లాండ్ ప్రత్యర్థిగా భారత్ కు అజేయరికార్డే ఉంది.

ఏడుకు ఏడుమ్యాచ్ ల్లోనూ భారత్ దే పైచేయి...

ఐర్లాండ్ ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ భారత్ ఆడిన ఏడుకు ఏడుమ్యాచ్ ల్లోనూ తిరుగులేని విజయాలు నమోదు చేసింది. 2019 ప్రపంచకప్ లో చివరిసారిగా ఐర్లాండ్ తో తలపడిన భారత్ 8 వికెట్ల విజయం నమోదు చేసింది.

మరోవైపు పాల్ స్టిర్లింగ్ నాయకత్వంలోని ఐర్లాండ్ జట్టుకు అనూహ్య విజయాలు సాధించడంలో మేటిగా పేరుపొంది. ఇటీవలే జరిగిన పోటీలలో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లపై సంచలన విజయాలు సాధించిన రికార్డు సైతం ఐర్లాండ్ కు ఉంది.

న్యూయార్క్' డ్రాప్- ఇన్- పిచ్' పైన హాట్ ఫేవరెట్ భారత్ ను ఓ పట్టు పట్టాలన్న లక్ష్యంతో ఐర్లాండ్ పోటీకి దిగుతోంది. ఈ మ్యాచ్ లో 170 నుంచి 180 స్కోరు సాధించినజట్టుకే విజయావకాశాలు ఉంటాయని పిచ్ రికార్డులే చెబుతున్నాయి.

ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్లో కెప్టెన్ స్టిర్లింగ్ తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ లార్కాన్ టక్కర్ అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లుగా కనిపిస్తున్నారు. యాండీ బాల్ బిర్నీ, హారీ టెక్టర్, కర్టిస్ కాంపెర్, జార్జి డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడెయిర్, బారీ మెకార్తీ, క్రెగ్ యంగ్, బెన్ వైట్, జోషువా లిటిల్ లతో ఐరిష్ జట్టు అత్యంత సమతూకంతో కనిపిస్తోంది.

గత టీ-20 ప్రపంచకప్ తరువాత భారత్ ఆడిన మొత్తం 28 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో విరాట్ కొహ్లీ 3 మ్యాచ్ లకు దూరం కాగా..విరాట్ కొహ్లీ, జడేజా, బుమ్రా తలో రెండుమ్యాచ్ లకూ దూరం కావాల్సి వచ్చింది.

భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ తో పాటు దూరదర్శన్ సైతం ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

First Published:  5 Jun 2024 10:35 AM IST
Next Story