Telugu Global
Sports

ప్రపంచకప్ ఫైనల్స్ కు భారత్ గురి.. నేడు ఇంగ్లండ్ తో ఢీ!

2024 టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు భారత్ గురిపెట్టింది. గయానా వేదికగా ఈరోజు జరిగే రెండోసెమీఫైనల్లో ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

ప్రపంచకప్ ఫైనల్స్ కు భారత్ గురి.. నేడు ఇంగ్లండ్ తో ఢీ!
X

2024 టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు భారత్ గురిపెట్టింది. గయానా వేదికగా ఈరోజు జరిగే రెండోసెమీఫైనల్లో ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ విజేత ఎవరో తేలడానికి మరో రెండుమ్యాచ్ లు మాత్రమే మిగిలిఉన్నాయి. తొలి సెమీఫైనల్లో అప్ఘనిస్థాన్ ను 9 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా దక్షిణాఫ్రికా ఫైనల్స్ చేరితే..ఈ రోజు..గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో మాజీ చాంపియన్ , టాప్ ర్యాంకర్ భారత్ తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యింది.

ఇది ప్రతీకార సమయం...

ఇంగ్లండ్ తో ఈరోజు జరిగే నాకౌట్ పోరును భారత్ ప్రతీకార మ్యాచ్ గా చూస్తోంది. గత ప్రపంచకప్ సెమీఫైనల్స్ లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఘోరపరాజయానికి బదులు తీర్చుకోవాలన్న కసితో పోటీకి దిగుతోంది.

గ్రూప్ లీగ్ నుంచి సూపర్-8 వరకూ వరుస విజయాలతో కదం తొక్కిన భారత్.. నాకౌట్ రౌండ్లోనూ అదే దూకుడు కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. సూపర్-8 ఆఖరిరౌండ్ పోరులో రెండోర్యాంకర్ ఆస్ట్ర్రేలియాను చిత్తు చేసిన ఆత్మవిశ్వాసంతో సెమీస్ సమరంలో రోహిత్ సేన పాల్గొనబోతోంది. గ్రూప్ లీగ్ దశ నుంచి పడుతూ లేస్తూ..సెమీస్ చేరిన ఇంగ్లండ్ పని పట్టడానికి ఎదురుచూస్తోంది.

పొంచిఉన్న వానముప్పు...

భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ను సైతం వరుణదేవుడు విడిచిపెట్టేలా కనిపించడంలేదు. మ్యాచ్ వేదిక ప్రావిడెన్స్ స్టేడియంలో ఉదయం 10-30 ( గయానా కాలమానం ప్రకారం ) నుంచి సాయంత్రం 6-30 వరకూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించడంతో అంతరాయం తప్పదని తేలిపోయింది.

భారత సంతతి ప్రజలు ఎక్కువగా ఉన్న గయానా ( జార్జిటౌన్ ) వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించడం, వేరే వేదిక నుంచి ఇక్కడికి మార్చడం కేవలం భారత్ ప్రయోజనాల కోసమేనంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఇప్పటికే విమర్శల బాణం విసిరాడు.

లోస్కోరింగ్ మ్యాచ్ తప్పదా?

మ్యాచ్ వేదిక ప్రావిడెన్స్ స్టేడియం పిచ్ పైన మరో లోస్కోరింగ్ మ్యాచ్ తప్పదని గత రికార్డులే చెబుతున్నాయి. పవర్ ప్లే ఓవర్లలో అత్యధికంగా 6.4 రన్ రేట్, మిడిల్ ఓవర్లలో 5.5 రన్ రేట్, డెత్ ఓవర్లలో 7.6 రన్ రేట్ గా ఉండడంతో భారీస్కోర్లు నమోదయ్యే అవకాశమే లేదని భావిస్తున్నారు. పైగా..బౌండ్రీల శాతం కూడా 50 మాత్రమే కావడంతో పరుగుల కోసం బ్యాటర్లు నానాపాట్లు పడకతప్పదని పై గణాంకాలే చెబుతున్నాయి.

ఇదే గ్రౌండ్ వేదికగా జరిగిన గ్రూపులీగ్ పోరులో న్యూజిలాండ్ ను అప్ఘనిస్థాన్ 84 పరుగులతో చిత్తు చేయడంతో పాటు..75 పరుగుల స్కోరుకే కట్టడి చేయగలిగింది.

ఈ నేపథ్యంలో భారత్, ఇంగ్లండ్ జట్లలో ఫేవరెట్ ఏ జట్టని ముందుగా అంచనా వేయడం సాహసమే అవుతుంది.

విరాట్ కొహ్లీ విజృంభణకు వేళాయే...!

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీకి ప్రపంచకప్ సెమీఫైనల్స్ లో భారీస్కోర్లు సాధించడంలో ఘనమైన రికార్డే ఉంది. అయితే..ప్రస్తుత ప్రపంచకప్ లో భాగంగా లీగ్ దశ నుంచి సూపర్ - 8 వరకూ ఆడిన 6 మ్యాచ్ ల్లో విరాట్ సాధించిన పరుగులు కేవలం 65 మాత్రమే. ఇందులో 2 సార్లు డకౌట్ల రికార్డు సైతం ఉంది.

తన కెరియర్ లో గతంలో ఆడిన మూడు ప్రపంచకప్ సెమీస్ లోనూ విరాట్ 72 నాటౌట్ (44 ), 89 నాటౌట్ ( 47 ), 50 ( 40) పరుగుల స్కోర్లు సాధించాడు.

ఈరోజు ఇంగ్లండ్ తో జరిగే కీలకపోరులో విరాట్ ఓ కీలక ఇన్నింగ్స్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.

మరో ఓపెనర్ రోహిత్ శర్మ..ఆస్ట్ర్రేలియా పై 92 పరుగుల స్కోరుతో మ్యాచ్ విన్నర్ గా నిలవడం భారత్ కు ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని తెచ్చి పెట్టింది. వన్ డౌన్ రిషభ్ పంత్, రెండో డౌన్ సూర్యకుమార్ యాదవ్, మిడిలార్డర్లో శివం దూబే, హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా..భారీస్కోరు సాధించడంలో భారత్ కు కీలకం కానున్నారు.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టుకే విజయావకాశం..

ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా ముగిసిన గత ఐదుమ్యాచ్ ల్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లే అత్యధికంగా విజయాలు సాధించగలిగాయి. చేజింగ్ కు దిగిన జట్లు కూప్పకూలిపోడం ఈ వేదిక ఆనవాయితీగా వస్తోంది.

టాస్ నెగ్గిన జట్టు మరో ఆలోచన లేకుండా ముందుగా బ్యాటింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. 170కి పైగా స్కోరు సాధించిన జట్టుకే విజయావకాశాలు మెండుగా ఉంటాయి.

ఇంగ్లండ్ కు బుమ్రా టెన్షన్....

ప్రస్తుత ప్రపంచకప్ లో అత్యంత పొదుపుగా బౌల్ చేస్తున్న భారత బూమ్ బూమ్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ను చూసి ఇంగ్లండ్ టాపార్డర్ భయపడిపోతోంది. గత ఆరు ప్రపంచకప్ మ్యాచ్ ల్లో బుమ్రా తన కోటా 24 ఓవర్లలో 4.08 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా వేసే 24 బంతులే మ్యాచ్ విజేతను నిర్ణయిస్తాయంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కోలింగ్ వుడ్ జోస్యం చెప్పారు. అత్యుత్తమ జట్టుతో అత్యంత నిలకడగా రాణిస్తున్న భారత్ ను అధిగమించాలంటే ఇంగ్లండ్ అసాధారణంగా రాణించక తప్పదని హెచ్చరించారు.

అయోమయంలో ఇంగ్లండ్....

గత ప్రపంచకప్ సెమీస్ లో భారత్ ను 10 వికెట్ల తేడాతో ఊదిపారేసిన ఇంగ్లండ్..ప్రస్తుత ఈ సెమీస్ పోరులో తీవ్రఒత్తిడి నడుమ పోరుకు దిగుతోంది. తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లను ఉంచుకోవాలా..లేక ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో పోటీకి దిగాలో తేల్చుకోలేక సతమతమవుతోంది.

పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ ను కట్టిడి చేయాలంటే ఎలాంటి వ్యూహం అనుసరించాలో అర్థంకాక తలపట్టుకొంది.

మోయన్ అలీ, అదిల్ రషీద్ , లివింగ్స్ టన్ స్పిన్ బాధ్యతల్ని..రీస్ టోప్లే, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, క్రిస్ జోర్డాన్, సామ్ కరెన్ పేస్ బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు.

ఓపెనర్ కమ్ కెప్టెన్ జోస్ బట్లర్ చెలరేగిపోతేనే ఇంగ్లండ్ కు విజయావకాశాలు ఉంటాయి.

బట్లర్ ను ప్రారంభ ఓవర్లలోనే పెవీలియన్ దారి పట్టించకుంటే భారత్ కు కష్టాలు తప్పపు. స్పిన్ బౌలర్లకు అనుకూలించే ఈ పిచ్ పైన..ఏ జట్టు స్పిన్నర్లు మెరుగ్గా రాణించగలరో..ఆ జట్టునే విజయం వరించే అవకాశం ఉంది.

సమఉజ్జీలుగా భారత్- ఇంగ్లండ్...

టీ-20 ఫార్మాట్లో రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ మొత్తం 23సార్లు తలపడితే భారత్ 12, ఇంగ్లండ్ 11 విజయాల రికార్డుతో ఉన్నాయి.

అదే..టీ-20 ప్రపంచకప్ టోర్నీలలో నాలుగుసార్లు తలపడితే..చెరో రెండు విజయాలతో 2-2 రికార్డుతో ఉన్నాయి. ప్రపంచకప్ సెమీఫైనల్స్ లో మూడుసార్లు నెగ్గిన ఇంగ్లండ్..2007, 2014 ప్రపంచకప్ టోర్నీలలో చేజింగ్ విజయాలు సాధించడం విశేషం.

వెస్టిండీస్ వేదికగా 2010 ప్రపంచకప్ ను నెగ్గిన ఇంగ్లండ్..ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన 2022 ప్రపంచకప్ లో సైతం విజేతగా అవతరించింది.

అడిలైడ్ వేదికగా గత ప్రపంచకప్ సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన 10 వికెట్ల ఘోరపరాజయానికి ప్రస్తుత ప్రపంచకప్ సెమీస్ లో భారత్ ప్రతీకారం తీర్చుకొంటుందా?.. తెలుసుకోవాలంటే..రాత్రి 12 గంటల వరకూ వేచిచూడక తప్పదు.

First Published:  27 Jun 2024 11:44 AM IST
Next Story