Telugu Global
Sports

భారత్- కెనడా ప్రపంచకప్ మ్యాచ్ కు వానముప్పు!

ఫ్లారిడా వేదికగా భారత్- కెనడాజట్ల మధ్య ఈరోజు జరగాల్సిన ప్రపంచకప్ గ్రూప్- ఏ ఆఖరి లీగ్ మ్యాచ్ కు వానగండం పొంచి ఉంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉంది.

భారత్- కెనడా ప్రపంచకప్ మ్యాచ్ కు వానముప్పు!
X

ఫ్లారిడా వేదికగా భారత్- కెనడాజట్ల మధ్య ఈరోజు జరగాల్సిన ప్రపంచకప్ గ్రూప్- ఏ ఆఖరి లీగ్ మ్యాచ్ కు వానగండం పొంచి ఉంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉంది.

2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు వెస్టిండీస్ తో కలసి సంయుక్త ఆతిథ్యమిస్తున్న అమెరికా వేదికగా జరుగుతున్న గ్రూప్ లీగ్ మ్యాచ్ లను వరుణదేవుడు వెంటాడుతున్నాడు. న్యూయార్క్, ఫ్లారిడా వేదికలుగా జరుగుతున్న కొన్నిమ్యాచ్ లు వానదెబ్బతో రద్దుల పద్దులో చేరిపోడంతో పలు ప్రధానజట్ల తలరాత మారిపోయింది.

ఫ్లారిడాను ముంచెత్తుతున్న వానలు, వరదలు....

గ్రూప్- ఏ లీగ్ లో భాగంగా జరిగిన మొదటి మూడురౌండ్ల మ్యాచ్ లను న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆడి..విజయాల హ్యాట్రిక్ తో సూపర్-8 రౌండ్ బెర్త్ ఖాయం చేసుకొన్న భారత్...గ్రూపులీగ్ లోని తన ఆఖరి మ్యాచ్ ను ఆడటానికి ఫ్లారిడాలోని లాడెర్ డేల్ చేరుకొంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఆఖరిరౌండ్ మ్యాచ్ లో పసికూన కెనడాతో భారత్ పోటీపడాల్సి ఉంది.

అయితే..గత కొద్దిరోజులుగా కురుస్తున్న వానలు, ముంచెత్తుతున్న వరదలతో ఫ్లారిడా ప్రాంతం అతలాకుతలమవుతోంది. దీనికితోడు ఈరోజు సైతం ఉరుములు మెరుపులతో కూడిన భారీవానలు తప్పవని వాతావరణశాఖ హెచ్చరించింది. ఒకవేళ మ్యాచ్ జరిగినా తరచూ వానతో అంతరాయం తప్పదని భావిస్తున్నారు.

జట్టులో మార్పులు లేకుండానే...

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు ఈ మ్యాచ్ లో సైతం విన్నింగ్ ఫార్ములానే అనుసరించే అవకాశం ఉంది. మొదటి మూడుమ్యాచ్ ల్లో నెగ్గిన జట్టుతోనే..పసికూన కెనడాతో జరిగే పోటీలో సైతం భారతజట్టు పాల్గొనడం ఖాయంగా కనిపిస్తోంది.

యువఓపెనర్ యశస్వి జైశ్వాల్, డాషింగ్ వికెట్ కీపర్ -బ్యాటర్ సంజు శాంసన్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, లెగ్ స్పిన్ జాదూ యజువేంద్ర చహాల్ బెంచ్ కే పరిమితం కానున్నారు.

విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా వరుసగా మూడుమ్యాచ్ ల్లో విఫలమైనా వారినే తుదిజట్టులో కొనసాగించాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. భారత బ్యాటింగ్ ఆర్డర్లో ఐదుగురు కుడిచేతి వాటం బ్యాటర్లు, నలుగురు ( రిషభ్. శివం, జడేజా, అక్షర్ ) ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండడం వ్యూహాత్మకంగా భారతజట్టుకు అదనపు బలంగా మారింది.

భారీస్కోరుకు విరాట్ తహతహ...

మొదటి మూడుమ్యాచ్ ల్లో ఓపెనర్ గా 1, 4, 0 స్కోర్లు మాత్రమే సాధించిన విరాట్...కెనడాతో జరిగే మ్యాచ్ లో భారీస్కోరు సాధించడం ద్వారా తిరిగి గాడిలో పడాలన్న పట్టుదలతో ఉన్నాడు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మను సైతం ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇప్పటికే తన కెరియర్ లో 48 అంతర్జాతీయ శతకాలతో రాహుల్ ద్రావిడ్ సరసన నిలిచిన రోహిత్ శర్మ...ఈ రోజు కెనడాతో జరిగే పోరులో సెంచరీ చేయగలిగితే 49 శతకాలతో భారత మూడో బ్యాటర్ గా నిలువగలుగుతాడు.రోహిత్ కు వన్డేలలో 31, టెస్టుల్లో 12, టీ-20ల్లో 5 సెంచరీలు ఉన్నాయి.

భారత క్రికెట్ చరిత్రలో 100 శతకాలతో సచిన్ అగ్రస్థానంలో నిలిస్తే..విరాట్ కొహ్లీ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్, ద్రావిడ్ మాత్రం 48 శతకాల చొప్పున సాధించి సంయుక్త తృతీయస్థానంలో ఉన్నారు.

భారత్ తో పోరుకు కెనడా పడిగాపులు....

భారత్ లాంటి దిగ్గజజట్టుతో తలపడే అవకాశాన్ని జారవిడుచుకోబోమని, వరుణుడు కరుణిస్తే మ్యాచ్ పూర్తిగా జరగాలని కోరుకొంటున్నట్లు కెనడా కెప్టెన్ సాద్ బీన్ జాఫర్ చెబుతున్నాడు.

గ్రూప్ -ఏ లీగ్ లో వరుసగా మూడు పరాజయాలతో సూపర్-8 రేస్ నుంచి ఇప్పటికే నిష్క్ర్రమించిన కెనడాజట్టులో సైతం పలువురు భారత సంతతి ఆటగాళ్లున్నారు.

నవనీత్ ధాలీవాల్, పర్గత్ సింగ్, శ్రేయస్ మొవ్వ, రవీంద్రపాల్ సింగ్ కెనడాజట్టులోని కీలక ఆటగాళ్లుగా ఉన్నారు.

మ్యాచ్ కు వేదికగా ఉన్న లాడర్ హిల్ లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం గత కొద్దిరోజులుగా కురిసిన వానలతో తడిసి ముద్దయ్యింది. అవుట్ ఫీల్డ్ చిత్తడి చిత్తడి గా ఉండడంతో పాక్- ఐర్లాండ్ జట్ల నడుమ జరగాల్సిన మ్యాచ్ సైతం రద్దయ్యింది. ఈ నేపథ్యంలో భారత్- కెనడాజట్ల మ్యాచ్ జరగడం కూడా అనుమానంగా మారింది.

ఫ్లారిడా వేదికగా భారత్ 5-2 రికార్డు...

స్లో వికెట్ గా పేరుపొందిన లాడర్ హిల్ పార్క్ స్టేడియం వేదికగా భారత్ ఇంతకుముందు వరకూ ఆడిన 8 మ్యాచ్ ల్లో 5 విజయాలు, 2 పరాజయాల రికార్డుతో ఉంది.

భారత కెప్టెన్ రోహిత్ శర్మకు రెండు హాఫ్ సెంచరీలతో సహా 196 పరుగులు సాధించిన రికార్డు ఉంది. విరాట్ కొహ్లీ 63 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఫ్లారిడా వేదికగా భారత్ ఆడిన గత 4 మ్యాచ్ ల్లో 3 విజయాలు సాధించడం విశేషం.

వరుణుడు కరుణిస్తేనే అంతగా ప్రాధాన్యం లేని ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. గ్రూప్ -ఏ నుంచి భారత్, అమెరికాజట్లు సూపర్-8 రౌండ్ చేరుకోగా..మాజీ చాంపియన్ పాకిస్థాన్ తో పాటు...ఐర్లాండ్, కెనడాజట్లు ఇంటిదారి పట్టాయి.

First Published:  15 Jun 2024 12:15 PM IST
Next Story