400 మార్క్ దాటిన టీమిండియా
నిలకడగా ఆడుతోన్న సర్ఫరాన్ ఖాన్, రిషబ్ పంత్
న్యూజిలాండ్ తో జరుగుతోన్న మొదటి టెస్ట్ లో సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరి బాధ్యతాయుతమైన బ్యాటింగ్ తో ఇండియా స్కోర్ 400 పరుగుల మార్క్ దాటింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లోనూ తేలిపోతుందని అందరూ అంచనా వేశారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ టెస్ట్ సెంచరీతో జట్టుకు వెన్నెముకగా నిలిచారు. తీవ్ర మోకాలి గాయంతో బాధ పడుతోన్న రిషబ్ పంత్.. గాయాన్ని పంటి భిగువున అదిమి పెట్టి క్రీజ్ లోకి దిగారు. నాలుగో రోజు (శనివారం) మరో వికెట్ పడకుండా ఈ ఇద్దరు బ్యాట్స్ మన్ జాగ్రత్త పడ్డారు. మధ్యలో వర్షం కాసేపు ఆటకు అంతరాయం కలిగించింది. వర్షం తగ్గిన తర్వాత మళ్లీ క్రీజ్ లోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ బాధ్యతయుతమైన బ్యాటింగ్ కొనసాగించారు. సర్ఫరాజ్ ఖాన్ 190 బంతుల్లో 18 ఫోర్లు, మూడు సిక్సులతో 148 పరుగులు, రిషబ్ పంత్ 92 బాల్స్ లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 88 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఓవరాల్ గా కివీస్ పై టీమిండియా 49 పరుగుల ఆదిక్యంలో ఉంది. పర్ఫర్ ఖాన్ 150 పరుగుల మార్క్ కు చేరువ అవగా, రిషబ్ పంత్ సెంచరీకి ఇంకో 12 పరుగుల దూరంలో ఉన్నారు.