Telugu Global
Sports

ఫస్ట్‌ టెస్ట్‌ లో పట్టు బిగించిన భారత్‌

విజయానికి మరో ఆరు వికెట్ల దూరంలో టీమిండియా

ఫస్ట్‌ టెస్ట్‌ లో పట్టు బిగించిన భారత్‌
X

బంగ్లాదేశ్‌ తో జరుగుతోన్న ఫస్ట్‌ టెస్ట్‌ లో టీమిండియా పట్టు బిగించింది. మరో ఆరు వికెట్లు పడగొడితే విజయం సాధించనుంది. నాలుగు రోజు (ఆదివారం) వేగంగా వికెట్లు నేలకూల్చగలిగితే ఇండియా విజయ తీరాలకు చేరడం ఖాయంగా కనిపిస్తుంది. బంగ్లాదేశ్‌ జట్టు ఇప్పటికే నాలుగు వికెట్లు కోల్పోగా చేతిలో ఉన్న ఆరు వికెట్లతో ఇంకో 357 పరుగులు చేయగలిగితే గెలుపు దక్కుతుంది. మూడో రోజు (శనివారం) భారత్‌ జట్టు బంగ్లాదేశ్ పై పూర్తి స్థాయి ఆదిపత్యం కనబరిచింది. శుభ్‌ మన్‌ గిల్‌ (176 బంతుల్లో 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 119 పరుగులు), రిషబ్‌ పంత్‌ (128 బంతుల్లో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 109 పరుగులు) సెంచరీలతో రెండో ఇన్నింగ్స్‌ లో నాలుగు వికెట్లు కోల్పోయి 287 పనుగులు చేసి డిక్లేర్‌ చేసింది. 515 పరుగుల భారీ టార్గెట్‌ చేదించడానికి బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ నిలకడగా ఇన్నింగ్స్‌ ఆరంభించింది. ఓపెనర్లు జకీర్‌ హసన్‌, షద్మన్‌ ఇస్లామ్‌ ఫస్ట్‌ వికెట్‌ కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్లు నిలదొక్కుకుంటున్నారనే దశలో భారత స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బూమ్రా అద్బుమైన బంతితో జకీర్‌ హసన్‌ ను బోల్తా కొట్టించాడు. 47 బంతుల్లో సిక్స్‌, ఐదు ఫోర్లతో 33 పరుగులు చేసిన హసన్‌ బూమ్రా బౌలింగ్‌ లో జైస్వాల్‌ కు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యారు. తర్వాత అశ్విన్‌ మూడు వికెట్లు నేలకూల్చాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. కెప్టెన్‌ శాంటో 51 పరుగులతో, ఆల్‌ రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ఐదు పరుగులతో క్రీజ్‌ లో ఉన్నారు. మూడో రోజే టాప్‌ ఆర్డర్‌ ను కోల్పోయిన బంగ్లాదేశ్‌ భారీ పరాజయం నుంచి బయట పడాలంటే మిడిల్‌ ఆర్డర్‌, లోయర్‌ ఆర్డర్‌ పై ఆధారపడాల్సిన స్థితిలో ఉంది. ఫస్ట్‌ టెస్ట్‌ ఫలితం నాలుగో రోజు తేలిపోనుంది.

First Published:  21 Sept 2024 5:03 PM IST
Next Story