Telugu Global
Sports

బంగ్లాతో ఫస్ట్‌ టెస్ట్‌.. 308 పరుగుల ఆదిక్యంలో టీమిండియా

ముగిసిన రెండో రోజు ఆట.. క్రీజ్‌ లో గిల్‌, పంత్‌

బంగ్లాతో ఫస్ట్‌ టెస్ట్‌.. 308 పరుగుల ఆదిక్యంలో టీమిండియా
X

బంగ్లాదేశ్‌ తో చెన్నైలో జరుగుతోన్న ఫస్ట్‌ టెస్ట్‌ లో టీమిండియా 308 పరుగుల ఆదిక్యంలో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌ లో భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. శుభ్‌ మన్‌ గిల్‌ 64 బంతుల్లో నాలుగు ఫోర్లతో 33 పరుగులు, రిషబ్‌ పంత్‌ 13 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్స్‌ తో 12 పరుగులు చేసి క్రీజ్‌ లో ఉన్నారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో టస్కిన్‌ అహ్మద్‌, నహీద్‌ రాణా, హసన్‌ మిరాజ్‌ ఒక్కో వికెట్‌ పగడగొట్టారు. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 339/6 తో రెండో రోజు (శుక్రవారం ఉదయం) బ్యాటింగ్‌ మొదలు పెట్టిన భారత్‌ మరో 37 పరుగులు మాత్రమే చేసి మిగతా నాలుగు వికెట్లు చేజార్చుకుంది. సెంచరీ చేస్తాడని అందరూ ఆశలు పెట్టుకున్న రవీంద్ర జడేజా ఈ రోజు అదనంగా ఒక్క పరుగు చేయకుండానే ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాత ఆకాశ్‌ దీప్‌, అశ్విన్‌, బూమ్రా వికెట్లు పడటంతో 376 పరుగులకు టీమిండియా ఆల్‌ ఔట్‌ అయ్యింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో హసన్‌ హమద్‌ ఐదు, టస్కిన్‌ అహ్మద్‌ మూడు వికెట్లు పడగొట్టారు. నహీద్‌ రాణా, హసన్‌ మిరాజ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. బంగ్లాదేశ్‌ జట్టు ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ లో టపటపా వికెట్లు కోల్పోయింది. కేవలం 149 పరుగలకే ఆల్‌ ఔట్‌ అయ్యింది. బంగ్లా జట్టులో షకీబ్‌ ఉల్‌ హసన్‌ 32, లిటన్‌ దాస్‌ 22, కెప్టెన్‌ సాంటో 20 పరుగులు చేశారు. హసన్‌ మిరాజ్‌ 27 పరుగులు, టస్కిన్‌ అహ్మద్‌, నహీద్‌ రాణా 11 పరుగుల చొప్పున చేశారు. భారత బౌలర్లలో బూమ్రా నాలుగు, సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌ లో యశస్వీ జైస్వాల్‌ పది పరుగులు, రోహిత్‌ శర్మ ఐదు, విరాట్‌ కోహ్లీ 17 పరుగులు చేసి ఔట్‌ అయ్యారు. శుక్రవారం ఒక్కరోజే బౌలర్లు 17 వికెట్లు నేలకూల్చారు. ఫస్ట్‌ టెస్ట్‌ మూడో రోజు (ఆదివారం) భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ లో ఎన్ని పరుగులు చేస్తుంది.. ఎంత సేపు వికెట్లను కాపాడుకుంటుంది అనే దానిపైనే బంగ్లా టార్గెట్‌ ఎంత అనేది తేలనుంది.

First Published:  20 Sept 2024 5:47 PM IST
Next Story