Telugu Global
Sports

146 ఏళ్ళ క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.....

భారత క్రికెట్ నయా మాస్టర్ విరాట్ కొహ్లీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు

146 ఏళ్ళ క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.....
X

భారత క్రికెట్ నయా మాస్టర్ విరాట్ కొహ్లీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. గత 146 సంవత్సరాల చరిత్రలో మరే ఆటగాడు సాధించలేని రికార్డు నమోదు చేశాడు.....

దక్షిణాఫ్రికాతో రెండుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టులో భారత్ ఇన్నింగ్స్ ఓటమి పాలైనా...నయామాస్టర్ విరాట్ కొహ్లీ మాత్రం నిలకడగా రాణించడం ద్వారా పలు అరుదైన రికార్డులు నమోదు చేశాడు.

తొలిఇన్నింగ్స్ లో 38, రెండో ఇన్నింగ్స్ లో 76 స్కోర్లు సాధించడం ద్వారా సీజన్లో 2వేల పరుగుల మైలురాయిని ఏడోసారి చేరుకోగలిగాడు.

క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనత..

146 సంవత్సరాల క్రికెట్ చరిత్రలో ఏడు వేర్వేరు సీజన్లలో 2వేలకు పైగా పరుగులు సాధించిన తొలి, ఏకైక క్రికెటర్ గా విరాట్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

2023 సీజన్లో విరాట్ కొహ్లీ సాధించిన పరుగుల సంఖ్య 2006కి చేరింది.

విరాట్ కు 2వేల పరుగులు సాధించడం ఇదే మొదటిసారి కాదు. 2012 సీజన్లో 2186 పరుగులు, 2014లో 2286 పరుగులు, 2016లో 2595 పరుగులు,

2017లో 2818 పరుగులు, 2019లో 2455 పరుగుల చొప్పున సాధించిన తొలి, ఒకేఒక్క క్రికెటర్ విరాట్ మాత్రమే.

విరాట్ కు ముందు ఇదే రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర పేరుతో ఉంది. సంగక్కర ఆరు వేర్వేరు సీజన్లలో 2వేల పరుగుల రికార్డును నెలకొల్పితే..విరాట్ ఏడుసార్లు 2వేల పరుగుల చొప్పున సాధించడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

1877 నుంచి ప్రస్తుత 2023 వరకూ...ఈ ఘనత సాధించిన బ్యాటర్ గా విరాట్ కొహ్లీ తన పేరును ప్రపంచ రికార్డుల్లో చేర్చుకోగలిగాడు.

సచిన్ రికార్డు తెరమరుగు...

అంతేకాదు..దక్షిణాఫ్రికా గడ్డపై క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న రికార్డును సైతం విరాట్ అధిగమించగలిగాడు.

సచిన్ 38 మ్యాచ్ ల్లో 6 సెంచరీలతో సాధించిన 1724 పరుగుల రికార్డును విరాట్ 29 మ్యాచ్ ల్లోనే 5 శతకాలతో 1750 పరుగులు సాధించగలిగాడు.

రాహుల్ ద్రావిడ్ 22 మ్యాచ్ ల్లో ఒకే ఒక్క సెంచరీతో 1136 పరుగులు, సౌరవ్ గంగూలీ 17 మ్యాచ్ ల్లో సింగిల్ సెంచరీతో 897 పరుగులు, మహేంద్ర సింగ్ ధోనీ 32 మ్యాచ్ ల్లో 872 పరుగులతో ఆ తర్వాతి స్థానాలలో నిలిచారు.

దక్షిణాఫ్రికా ఫాస్ట్ , బౌన్సీ పిచ్ లపైన క్రికెట్ మొత్తం ఫార్మాట్లలో విరాట్ కు 50కి పైగా సగటు ఉంది. వన్డేలలో 898 పరుగులతో 74.83 సగటు నమోదు చేశాడు.

దక్షిణాఫ్రికాతో మూడురోజుల్లోనే ముగిసిన తొలిటెస్టులో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగులతో ఘోరపరాజయం చవిచూసింది. అయితే ..తొలి ఇన్నింగ్స్ లో రాహుల్ పోరాడితే..రెండో ఇన్నింగ్స్ లో విరాట్ తన 30 టెస్టు హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా సఫారీ బౌలర్లను నిలువరించినా ప్రయోజనం లేకపోయింది.

First Published:  29 Dec 2023 10:30 AM GMT
Next Story