Telugu Global
Sports

పీవోకేలో చాంపియన్స్‌ ట్రోఫీని ప్రదర్శించొద్దు

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు తేల్చిచెప్పిన ఐసీసీ

పీవోకేలో చాంపియన్స్‌ ట్రోఫీని ప్రదర్శించొద్దు
X

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ లో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీని ప్రదర్శించొద్దని, ట్రోఫీ టూర్‌ లో భాగంగా పీవోకేకు ట్రోఫీని తీసుకెళ్లొద్దని ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ తేల్చిచెప్పింది. వివాదాస్పద ప్రాంతాల్లో చాంపియన్స్‌ ట్రోఫీని ప్రదర్శించడం ద్వారా భారత్‌ పై కవ్వింపు చర్యలకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రయత్నించింది. ఐసీసీ ట్రోఫీ తమ గడ్డపైకి చేరగానే టోర్నీ ప్రచారంలో భాగంగా ట్రోఫీ టూర్‌ చేపట్టనున్నట్టు పీసీబీ ప్రకటించింది. చాంపియన్స్‌ ట్రోఫీ అధికారిక షెడ్యూల్‌ ను ఇంకా ఐసీసీ ప్రకటించలేదు. పాకిస్థాన్‌ వేదికగా ఈ టోర్నీ నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు టోర్నీ నిర్వహణకు పీసీబీ సంసిద్ధత వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌ లోని లాహోర్‌, కరాచీ, రావల్పిండి వేదకల్లో మ్యాచ్‌ లు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. చాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు పాక్‌ గడ్డపై అడుగు పెట్టబోమని, తాము ఆడే మ్యాచ్‌ లు తటస్థ వేదికపై హైబ్రిడ్‌ మోడ్‌లో నిర్వహించాలని భారత్‌ డిమాండ్‌ చేస్తోంది. పాకిస్థాన్‌ మాత్రం అందుకు నిరాకరిస్తోంది. రేపు (నవంబర్‌ 16న) ఇస్లామాబాద్‌ నుంచి చాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌ ను ప్రారంభిస్తున్నామని పీసీబీ ప్రకటించింది. ఈ ట్రోఫీని స్కర్దు, హుంజా, ముజఫరాబాద్‌లో కూడా ప్రదర్శిస్తామని పీసీబీ ప్రకటించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భూభాగంలోని ఈ నగరాల్లో ట్రోఫీ టూర్‌ ను బీసీసీఐ వ్యతిరేకించింది. బీసీసీఐ అభ్యంతరాలతో ఆ పట్టణాల్లో ట్రోఫీ టూర్‌ కు ఐసీసీ నిరాకరించింది.

First Published:  15 Nov 2024 4:41 PM IST
Next Story