Telugu Global
Sports

చాంపియన్స్‌ ట్రోఫీలో అఫ్గాన్‌ సంచలనం

ఇంగ్లండ్‌ పై 8 పరుగుల తేడాతో విజయం.. టోర్నీ నుంచి ఇంగ్లిష్‌ టీమ్‌ ఔట్‌

చాంపియన్స్‌ ట్రోఫీలో అఫ్గాన్‌ సంచలనం
X

చాంపియన్స్‌ ట్రోఫీలో అఫ్గానిస్థాన్‌ సంచలనం సృష్టించింది. ఇంగ్లండ్‌ పై 8 పరుగుల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి ఇంగ్లిష్‌ టీమ్‌ ను నిష్క్రమించేలా చేసింది. లాహోర్‌ లో జరిగిన ఈ మ్యాచ్‌ లో బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ 146 బంతుల్లో ఆరు సిక్సులు, 12 ఫోర్లతో 177 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్‌ సాధించడంలో కీలకంగా నిలిచాడు. కెప్టెన్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 41, మహ్మద్‌ నబీ 40 పరుగులతో రాణించారు. అఫ్గానిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. ఇంగ్లిష్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, లివింగ్‌ స్టోన్‌ 2 వికెట్లు పడగొట్టగా ఓవర్టన్‌, ఆదిల్‌ రషీద్‌ తలా ఒక వికెట్‌ తీసుకున్నారు. 326 పరుగుల భారీ టార్గెట్‌ చేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ ఫిల్‌ సల్ట్‌, ఫస్ట్‌ డౌన్‌ లో వచ్చిన జేమి స్మిత్‌ వెంట వెంటనే ఔటయ్యారు. జో రూట్‌ బెన్‌ డకెట్‌ తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. రూట్‌ క్రీజ్‌ లో పాతుకుపోయినా ఇంకో ఎండ్‌ నుంచి వికెట్లు పడుతూ పోయాయి. జో రూట్‌ 111 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌ తో 120 పరుగులు చేశాడు. డకెట్‌ 38, కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ 38, హారీ బ్రూక్‌ 25, ఓవర్టన్‌ 32, జోఫ్రా ఆర్చర్‌ 14, లివింగ్‌ స్టోన్‌ 10 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ జట్టు ఒక బంతి మిగిలి ఉండగానే 317 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 5 వికెట్లు నేలకూల్చి ఇంగ్లండ్‌ పరాజయంలో కీలక పాత్ర పోషించాడు. మహ్మద్‌ నబీకి రెండు, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, రషీద్‌ ఖాన్‌, గుల్బదీన్‌ నయీబ్‌ తలా ఒక వికెట్‌ తీశారు. గ్రూప్‌ -బి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఒక్కో విజయం సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో రెండు టీమ్‌ లు 3 పాయింట్లతో ఉన్నాయి. వరుసగా రెండు మ్యాచుల్లో పరాజయం పాలైన ఇంగ్లండ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈనెల 28న ఆస్ట్రేలియాతో అఫ్గానిస్థాన్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ లో గెలిచిన జట్టు సెమీస్‌ లో అడుగు పెడుతుంది.

First Published:  26 Feb 2025 11:05 PM IST
Next Story