Telugu Global
Sports

1983లో 1700 రూపాయలు...2024 లో 5 కోట్లు!

టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టు సభ్యుల రొట్టెవిరిగి నేతిలో పడింది. ఒక్కొక్క ఆటగాడి జేబులోకి 5 కోట్ల రూపాయలు నజరానాగా వచ్చి పడ్డాయి.

1983లో 1700 రూపాయలు...2024 లో 5 కోట్లు!
X

టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టు సభ్యుల రొట్టెవిరిగి నేతిలో పడింది. ఒక్కొక్క ఆటగాడి జేబులోకి 5 కోట్ల రూపాయలు నజరానాగా వచ్చి పడ్డాయి.

దేనికైనా ప్రాప్తం ఉండాలి, పెట్టిపుట్టి ఉండాలని మన పెద్దలు ఊరికి అనలేదు. 2024 టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టు సభ్యులను కనీవినీ ఎరుగని ప్రోత్సాహక నగదు బహుమతితో బీసీసీఐ ఘనంగా సత్కరించింది. భారత, ప్రపంచ క్రీడాచరిత్రలోనే రోహిత్ శర్మ నాయకత్వంలోని ఒక్కో భారత ఆటగాడు అతిపెద్ద మొత్తం 5 కోట్ల రూపాయలు చొప్పున నజరానా అందుకొన్నారు.

కరీబియన్ ద్వీపాలలోని బార్బడోస్ వేదికగా ఇటీవలే ముగిసిన ప్రపంచకప్ ఫైనల్స్ లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో నెగ్గడం ద్వారా భారతజట్టు 11 సంవత్సరాల విరామం తరువాత ఐసీసీ ప్రపంచ ట్రోఫీని అందుకొంది. అంతేకాదు..2007 తరువాత రెండోసారి టీ-20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. భారత్ కు అరుదైన విజయం, ప్రపంచకప్ ట్రోఫీని అందించిన రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టు సభ్యులను బీసీసీఐ అపూర్వ రీతిలో సత్కరించింది.

ముంబై విమానాశ్రయం నుంచి వాంఖడే స్టేడియం వరకూ నిర్వహించిన ఓపెన్ టాప్ బస్ పరేడ్ కు..అభిమానులు తండోపతండాలుగా హాజరయ్యారు. భారత వాణిజ్య రాజధాని నగరం జనసంద్రంగా మారిపోయింది. వాంఖడే స్టేడియంలో జరిగిన సత్కార సభలో బీసీసీఐ కార్యదర్శి జే షా..కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ల బృందానికి 125 కోట్ల రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతిని అంద చేశారు.

ఒక్కో ఆటగాడికి 5 కోట్ల రూపాయలు...

భారత ప్రధానజట్టులోని మొత్తం 15 మంది ఆటగాళ్లకు తలో 5 కోట్ల రూపాయలు, ముగ్గురు స్టాండ్ బై ఆటగాళ్లకు కోటి రూపాయలు చొప్పున నజరానా ప్రకటించారు.

అంతేకాదు..చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, మరో ముగ్గురు సహాయ శిక్షకులతో పాటు ట్రెయినర్, ఫిజియో, మసాజ్ నిపుణులు, మీడియా, లాజిస్టిక్స్ మేనేజర్, ఇతర సహాయక సిబ్బందికి సైతం కోటి రూపాయలు ప్రోత్సాహంగా అందచేశారు.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ గతంలో ఎన్నడూలేని విధంగా 125 కోట్ల రూపాయలు ప్రోత్సాహక బహుమతిగా ఇచ్చి వారేవ్వా అనిపించుకొంది.

శతాబ్దాల చరిత్ర కలిగిన క్రికెట్ చరిత్రలో ఇంత పెద్దమొత్తంలో నగదు బహుమతి ఇచ్చిన తొలి, ఏకైక క్రీడాసంస్థగా భారత క్రికెట్ నియంత్రణమండలి రికార్డుల్లో చేరింది.

పాపం!.1983 ప్రపంచకప్ విజేతలు....

భారత క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి ప్రపంచకప్ సాధించిన కపిల్ దేవ్ నాయకత్వంలోని నాటి భారతజట్టు సభ్యులను నిజంగా దురదృష్టవంతులనే చెప్పాలి. 1980 దశకంలో బీసీసీఐ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. జట్లను విదేశీ టోర్నీలకు పంపడానికి అవసరమైన నిధుల కోసం భారత క్రికెట్ బోర్డు ఆరోజుల్లో నానాపాట్లూ పడుతూ ఉండేది. పైగా నాటితరం ఆటగాళ్లకు క్రికెట్ ద్వారా డబ్బులు సంపాదించాలన్న యావ ఉండేది కాదు. క్రికెట్ మ్యాచ్ లు, టెస్టులు ఆడితే చాలు తమ జీవితం ధన్యమైనట్లుగా భావించేవారు.

ఇంగ్లండ్ వేదికగా 1983 లో జరిగిన ప్రుడెన్షియల్ ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన భారతజట్టుకు హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నాయకత్వం వహించాడు. భారత మాజీ కెప్టెన్ బిషిన్ సింగ్ బేడీ శిక్షకుడిగా ఉన్న ఈ జట్టులో కేవలం 14 మంది ఆటగాళ్లు మాత్రమే ఉండటం విశేషం. సునీల్ గవాస్కర్, కృష్ణమాచారీ శ్రీకాంత్, సయ్యద్ కిర్మానీ, రోజర్ బిన్నీ, మదన్ లాల్, సునీల్ వాల్సన్, బల్విందర్ సింగ్ సంధూ, సందీప్ పాటిల్, యజువేంద్ర సింగ్ లాంటి ఆటగాళ్లున్నారు. మాన్ సింగ్ టీమ్ మేనేజర్ గా వ్యవహరించారు.

అయితే..భారతజట్టు ప్రపంచకప్ బరిలోకి దిగిన సమయంలో మ్యాచ్ ఫీజుగా 1500 రూపాయలు, దినసరి భత్యంగా రోజుకు 200 రూపాయలు..మొత్తం కలపి మ్యాచ్ కు 1700 రూపాయలు చొప్పున బీసీసీఐ చెల్లించింది. భారత తొలి ప్రపంచకప్ విజేత జట్టులోని సభ్యులు మ్యాచ్ కు 1700 రూపాయల చొప్పున మాత్రమే అందుకొన్నారంటే..

పాపం! దురదృష్టవంతులు అనుకోక తప్పదు.

2011 ప్రపంచకప్ విజేతలకు .....

మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో 2011 ప్రపంచకప్ నెగ్గిన భారతజట్టు సభ్యులకు 2 కోట్ల రూపాయలు చొప్పున నజరానాగా బీసీసీఐ అందచేసింది. జట్టు సహాయక సిబ్బందికి 50 లక్షల రూపాయలు, సెలెక్టర్లకు 25 లక్షల రూపాయల వంతున చెల్లించింది. కృష్ణమాచారీ శ్రీకాంత్ చైర్మన్ గా ఉన్న ఎంపిక సంఘం ఐదుగురు సభ్యులకు 25 లక్షల రూపాయలు చొప్పున బీసీసీఐ బోనస్ గా అందచేసింది.

వాస్తవానికి 2011 ప్రపంచకప్ విజేత ఆటగాళ్లకు కోటి రూపాయల చొప్పున బీసీసీఐ నజరానాగా ప్రకటించడంతో ఆటగాళ్ల నుంచి తీవ్రనిరసన వ్యక్తం కావడంతో ఆ మొత్తాన్ని 2 కోట్ల రూపాయలకు పెంచారు.

2011 ప్రపంచకప్ విజేతల కోసం 39 కోట్ల రూపాయలు నజరానాగా అందచేసిన బీసీసీఐ..ప్రస్తుత 2024 టీ-20 ప్రపంచకప్ నాటికి ఆ మొత్తాన్ని 3.2 రెట్లు ( 125 కోట్ల రూపాయలకు ) పేంచడం విశేషం.

పిండికొద్ది రొట్టె అన్నట్లుగా 2011 నాటికి బీసీసీఐ ఖజానాలో 189 కోట్ల 72 లక్షల రూపాయలు మిగులు ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ వార్షిక బడ్జెట్ లో ఖర్చుకంటే మిగులు ఆదాయమే ఉండటంతో 39 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రోత్సాహక నగదు బహుమతిగా ఇవ్వగలిగింది.

2022 మార్చి 31 నాటికి బీసీసీఐ బ్యాలెన్స్ షీటు ప్రకారం 868 కోట్ల 14 లక్షల రూపాయలు మిగులుగా ఉండటం విశేషం.

First Published:  5 July 2024 3:26 PM IST
Next Story