భారత 85వ గ్రాండ్మాస్టర్ గా శ్యామా నిఖిల్!
ప్రపంచ చదరంగ 'నయా పవర్' భారత గ్రాండ్ మాస్టర్ల సంఖ్య రికార్డుస్థాయిలో 85కు చేరింది.
ప్రపంచ చదరంగ 'నయా పవర్' భారత గ్రాండ్ మాస్టర్ల సంఖ్య రికార్డుస్థాయిలో 85కు చేరింది.
భారత చదరంగ చరిత్రలో 85వ గ్రాండ్ మాస్టర్ గా తమిళనాడుకు చెందన శ్యామా నిఖిల్ నిలిచాడు. 31 సంవత్సరాల నిఖిల్ ఈ హోదా సాధించడానికి గత 12 సంవత్సరాలుగా వేచిచూడాల్సి వచ్చింది.
అంతర్జాతీయ చదరంగ సమాఖ్య వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం భారత్ కు చెందిన శామా నిఖిల్ కు గ్రాండ్ మాస్టర్ హోదా ఇచ్చినట్లు తేలింది. గ్రాండ్ మాస్టర్ హోదాకు అవసరమైన 2500 ఎలో రేటింగ్ పాయింట్లను నిఖిల్ పుష్కరకాలం తరువాత పూర్తి చేయగలిగాడు.
8 సంవత్సరాల వయసు నుంచే....
ఎనిమిది సంవత్సరాల చిరుప్రాయం నుంచే చదరంగం ఆడుతూ వచ్చిన శ్యామా నిఖిల్..గ్రాండ్ మాస్టర్ కావడానికి 23 సంవత్సరాల పాటు శ్రమించాల్సి వచ్చింది.
గ్రాండ్ మాస్టర్ హోదాకు అవసరమైన మూడు నార్మ్స్ లో రెండు ..12 సంవత్సరాల క్రితమే సాధించిన నిఖిల్.. మూడో నార్మ్ కోసం మాత్రం ఎడతెగని పోరాటమే చేయాల్సి వచ్చింది. 2012లో మొదటి రెండునార్మ్ లు సాధించిన నిఖిల్ మూడో నార్మ్ కోసం పన్నేండేళ్లపాటు శ్రమించడంతో పాటు ఎదురుచూడక తప్పలేదు.
ఇటీవలే ముగిసిన దుబాయ్ పోలీస్ మాస్టర్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో ఓ గెలుపు, ఎనిమిది డ్రాలతో నిఖిల్..తన ఆఖరి నార్మ్ ను కైవసం చేసుకోగలిగాడు. దీనితో..
గ్రాండ్ మాస్టర్ హోదాకు అవసరమైన 2500 రేటింగ్ పాయింట్లు నిఖిల్ ఖాతాలో చేరిపోడంతో..అంతర్జాతీయ చెస్ సమాఖ్య అధికారికంగా భారత 85వ గ్రాండ్ మాస్టర్ గా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది.
విశ్వనాథన్ ఆనంద్ నుంచి శ్యామా నిఖిల్ వరకూ...
1988కి ముందు వరకూ భారత చదరంగంలో కనీసం ఒక్క గ్రాండ్ మాస్టర్ లేకపోడం విశేషం. 1988 లో విశ్వనాథన్ ఆనంద్ భారత్ తరపున తొలి గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించడంతో మొదలైన ఈ పరంపర ప్రస్తుత 2024 వరకూ అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది.
ఆనంద్ నుంచి శ్యామా నిఖిల్ వరకూ మొత్తం 85 మంది గ్రాండ్మాస్టర్లలో ముగ్గురంటే ముగ్గురు మాత్రమే మహిళలు ఉన్నారు. కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి రమేశ్ మాత్రమే అంతర్జాతీయ గ్రాండ్ మా్స్టర్ హోదా సాధించిన భారత మహిళలుగా నిలిచారు.
ఇటీవలే కెనడా వేదికగా ముగిసిన ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ మహిళల విభాగంలో సంయుక్త ద్వితీయ స్థానంలో నిలిచిన 22 సంవత్సరాల వైశాలి..కొద్దిరోజుల క్రితమే భారత 84వ గ్రాండ్ మాస్టర్ గా రికార్డుల్లో చేరిన కొద్దిరోజుల వ్యవధిలోనే తమిళనాడుకే చెందిన శ్యామా నిఖిల్ 85వ గ్రాండ్ మాస్టర్ గా నిలవడం విశేషం.
అత్యంత చిన్నవయసులో గ్రాండ్ మాస్టర్ గుకేశ్...
భారత చదరంగ చరిత్రలోనే అత్యంత చిన్నవయసులో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన రికార్డు ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ విజేత గుకేశ్ పేరుతో ఉంది. తమిళనాడు నుంచి అంతర్జాతీయ చెస్ లోకి దూసుకొచ్చిన గుకేశ్ 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసుకే గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించాడు. అంతకు ముందు వరకూ ఈ రికార్డు ప్రజ్ఞానంద్ పేరుతో ఉంది.
2018లో ప్రజ్ఞానంద్ 12 సంవత్సరాల 10 నెలల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించాడు.
గ్రాండ్ మాస్టర్ హోదా అంతతేలిక కాదు...
తమిళనాడులోని నాగర్ కోయిల్ కు చెందిన శ్యామా నిఖిల్ ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించడమే అతని పాలిట శాపంగా మారింది. ఎనిమిది సంవత్సరాల చిరుప్రాయం నుంచే చదరంగం ఆడుతూ వచ్చినా..ఆర్థిక కష్టాలతో అంతర్జాతీయ టోర్నీలలో చురుకుగా పాల్గొనలేకపోయాడు.
అండర్ -13 స్టేట్ టైటిల్ సాధించిన నిఖిల్ ఆసియా పోటీలలో పాల్గొనే అవకాశం వచ్చినా పాల్గొనలేకపోయాడు.
తన శిక్షకుడు కె. విశ్వేశరన్ సూచనతో నాగర్ కోయిల్ నుంచి చెన్నైకి తన మకాం మార్చిన నిఖిల్ 2011లో 19 సంవత్సరాల వయసుకే గ్రాండ్ మాస్టర్ హోదాకు అవసరమైన మూడు నార్మ్స్ లో మొదటి రెండు నార్మ్స్ పూర్తి చేయగలిగాడు.
2017 లో మాత్రమే యూరోప్ లో జరిగిన టోర్నీలో పాల్గొనగలిగాడు. 2022లో కామన్వెల్త్ చాంపియన్ గా నిలిచిన నిఖిల్ ను గత 12 సంవత్సరాలుగా దురదృష్టం వెంటాడుతూనే వచ్చింది. ఆఖరి నార్మ్ అందినట్లే అంది చేజారిపోతూ వచ్చింది.
తనకు మిహాయిల్ తాల్, గారీ కాస్పరోవ్ అంటే ఇష్టమని, తాను మానసిక ఉల్లాసం కోసమే చదరంగం ఆడుతూ వచ్చానని, తాను సాధించిన గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను,హోదాను తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు నిఖిల్ ప్రకటించాడు. తన ఎదుగుదలలో శిక్షకుడు విశ్వేశరన్ పాత్ర ఎంతో ఉందని, ఆయనకు జీవితకాలం రుణపడి ఉంటానని తెలిపాడు.
గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన తనకు ఇకముందు ఎలాంటి ఒత్తిడి లేకుండా జాతీయ, అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొనే వెసలుబాటు ఉంటుందని శ్యామా నిఖిల్ ధీమాగా చెప్పాడు.
ప్రస్తుత ప్రపంచ చెస్ లో రష్యా తరువాత అత్యధికంగా 85 గ్రాండ్ మాస్టర్లు కలిగిన ఏకైక దేశంగా భారత్ నిలిచింది.