Telugu Global
Sports

ఆడితీరాలంటూ సీనియర్ క్రికెటర్లకు బీసీసీఐ హుకుం!

ఐపీఎల్ మోజులో దేశవాళీ క్రికెట్ ను నిర్లక్ష్యం చేస్తున్న సీనియర్ క్రికెటర్లపై ఎట్టకేలకు బీసీసీఐ కొరడా ఝళిపించింది.

ఆడితీరాలంటూ సీనియర్ క్రికెటర్లకు బీసీసీఐ హుకుం!
X

ఐపీఎల్ మోజులో దేశవాళీ క్రికెట్ ను నిర్లక్ష్యం చేస్తున్న సీనియర్ క్రికెటర్లపై ఎట్టకేలకు బీసీసీఐ కొరడా ఝళిపించింది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చేస్తే సహించేది లేదంటూ హుకుం జారీ చేసింది.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డుకు ఎట్టకేలకు కోపం వచ్చింది. దేశవాళీ రంజీట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లను కూరలో కరివేపాకులా తీసిపడేస్తూ..తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నసీనియర్ క్రికెటర్ల కు కనీస మ్యాచ్ ల నిబంధనతో హుకుం జారీ చేసింది.

ఇషాన్ కిషన్ పై బీసీసీఐ గరంగరం...

జార్ఖండ్ కమ్ ముంబై ఇండియన్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రవర్తనతో విసిగిపోయిన బీసీసీఐ తీవ్రమైన నిర్ణయం తీసుకొంది. ఐపీఎల్ పేరుతో రంజీట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లను నిర్లక్ష్యం చేసే క్రికెటర్లను సహించేదిలేదని, ఐపీఎల్ లో ఆడనిచ్చేది లేదంటూ తేల్చి చెప్పింది.

దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి తిరిగి వచ్చి, మానసిక పరిస్థితి బాగాలేదంటూ భారతజట్టుకు దూరంగా ఉంటూ పైలాపచ్చీసుగా తిరుగుతున్న యువవికెట్ కీపర్ బ్యాటర్ ఇషన్ కిషన్ ను దేశవాళీ క్రికెట్ ఆడాలంటూ చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కోరినా పట్టించుకోకపోడం బీసీసీఐకి ఆగ్రహాన్ని తెచ్చింది.

కనీసం 3 మ్యాచ్ లు ఆడాల్సిందే....

జార్ఖండ్ తరపున రంజీట్రోఫీ మ్యాచ్ లు ఆడకుండా బరోడాలోని రిలయన్స్ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యాతో కలసి ఇషాన్ కిషన్ ప్రాక్టీసు చేయటాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది.

ఇషాన్ 2024 సీజన్ ఐపీఎల్ ఆడాలంటే కనీసం 3 నుంచి 4 రంజీమ్యాచ్ లు ఆడితీరాల్సిందేనని, దేశవాళీ మ్యాచ్ లు ఆడితేనే ఐపీఎల్ ఆడటానికి అనుమతిస్తామంటూ హుకుం జారీ చేసింది.

ఇది భారతజట్టులో చోటులేని, భారతజట్టుకు దూరంగా ఉన్న క్రికెటర్లందరికీ వర్తిస్తుందని బోర్డు స్పష్టం చేసింది. ఐపీఎల్ తో పాటు..భారతజట్టులో చోటుదొరికే వరకూ దేశవాళీ రంజీట్రోఫీ క్రికెట్ ను పట్టుకొని వేలాడే ఆటగాళ్లంతా ఆ తరువాత రంజీట్రోఫీని చులకనగా చూడటాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది.

ఆటగాళ్లు మ్యాచ్ ఫ్రాక్టీసుతో పూర్తిస్థాయి ఫిట్ నెస్ తో ఉండాలంటే దేశవాళీ క్రికెట్లో ఆడి తీరాల్సిందేనని ప్రకటించింది.

దెబ్బకు దెయ్యం వదిలిన ఇషాన్...

ప్రస్తుతం బరోడాలో ప్రాక్టీసు చేస్తున్న ఇషాన్ కిషన్ బీసీసీఐ ఆదేశాలతో తన హోంటీమ్ జార్ఖండ్ తో వచ్చి చేరాడు. జంషెడ్ పూర్ వేదికగా రాజస్థాన్ తో జరిగే రంజీట్రోఫీ మ్యాచ్ లో పాల్గొనటానికి సిద్ధమయ్యాడు.

రాజస్థాన్ ఆల్ రౌండర్ దీపక్ చహార్, బరోడా కెప్టెన్ కృణాల్ పాండ్యా, ముంబై మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లాంటి సీనియర్ క్రికెటర్లు సైతం రంజీట్రోఫీ మ్యాచ్ ల్లో పాల్గొనబోతున్నారు.

దేశవాళీ రంజీ ట్రోఫీ క్రికెటర్లకు మ్యాచ్ఆడిన రోజున..రోజుకు 50 వేల రూపాయలు మాత్రమే మ్యాచ్ ఫీజుగా చెల్లిస్తున్నారు. అదే టెస్టుమ్యాచ్ లో రోజుకు 3 లక్షల రూపాయల చొప్పున మ్యాచ్ ఫీజు అందుతోంది. ఐపీఎల్ లో ఇది ఆటగాడిగా కాంట్రాక్టు, సత్తాను బట్టి ఉంటూ వస్తోంది.

First Published:  14 Feb 2024 9:00 AM IST
Next Story