Telugu Global
Sports

హైదరాబాద్ రాజీవ్ స్టేడియానికి బీసీసీఐ అవార్డు!

ఐపీఎల్-17 సీజన్ కు ఆతిథ్యమిచ్చిన క్రికెట్ వేదికలకే అత్యుత్తమ వేదికగా హైదరాబాద్ నిలిచింది. బీసీసీఐ అవార్డును మరోసారి గెలుచుకొంది.

హైదరాబాద్ రాజీవ్ స్టేడియానికి బీసీసీఐ అవార్డు!
X

ఐపీఎల్-17 సీజన్ కు ఆతిథ్యమిచ్చిన క్రికెట్ వేదికలకే అత్యుత్తమ వేదికగా హైదరాబాద్ నిలిచింది. బీసీసీఐ అవార్డును మరోసారి గెలుచుకొంది.

దేశంలోని యాభైకి పైగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలలో దేని ప్రత్యేకత దానిదే. అయితే..కోల్ కతా ఈడెన్ గార్డెన్స్, ముంబై వాంఖడే స్టేడియం, అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం, చెన్నై చెపాక్ స్టేడియం, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం..ఇలా ఎన్నో అత్యుత్తమ క్రికెట్ వేదికలున్నా.. హైదరాబాద్ రాజీవ్ స్టేడియం ముందు దిగదుడుపుగా మారిపోయాయి.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో భాగంగా జరిగిన మొత్తం 74 మ్యాచ్ లను దేశంలోని 10కి పైగా వేదికల్లో నిర్వహించారు. అయితే..అత్యుత్తమ పిచ్, అత్యుత్తమ క్రికెట్ వేదిక అవార్డును మాత్రం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మరోసారి గెలుచుకొంది.

రాజీవ్ స్టేడియానికి 50 లక్షల నజరానా...

ఐపీఎల్-17వ సీజన్లో రన్నరప్ గా నిలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ కు హోం గ్రౌండ్ గా ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పలు సరికొత్త రికార్డులకు వేదికగా నిలిచింది.

20 ఓవర్లలో 277 పరుగులకు పైగా స్కోర్లు రాజీవ్ స్టేడియం పిచ్ పైన నమోదయ్యాయి. చేజింగ్ కు దిగిన జట్లు సైతం 250కి పైగా స్కోర్లు సాధించే వికెట్ గా రాజీవ్ స్టేడియం పిచ్ కు పేరుంది.

ఐపీఎల్ ముగిసిన వెంటనే బీసీసీఐ ప్రకటించిన అవార్డులలో హైదరాబాద్ రాజీవ్ స్టేడియానికి సైతం ఓ అవార్డు దక్కింది. ఐపీఎల్ అత్యుత్తమ వేదికగా రాజీవ్ స్టేడియానికి 50 లక్షల రూపాయలు ప్రోత్సాహక నగదు బహుమతిని బీసీసీఐ కార్యదర్శి జే షా అంద చేశారు. గతంలోనూ ఇదే అవార్డు గెలుచుకొన్న బీసీసీఐ ప్రస్తుత 2024 సీజన్లోనూ అత్యుత్తమ ఐపీఎల్ వేదికగా నిలవడం విశేషం.

గ్రౌండ్ సిబ్బందికి తొలిసారిగా బీసీసీఐ ప్రోత్సాహకాలు...

రెండుమాసాలపాటు..74 మ్యాచ్ లుగా సాగిన ఐపీఎల్ -2024 విజయవంతం కావడంలో క్రికెట్ వేదికల గ్రౌండ్ సిబ్బంది పాత్ర ఎంతో ఉందని, వారికి సైతం ప్రోత్సాహకంగా నగదు బహుమతులు అందచేస్తున్నామని బీసీసీఐ ప్రకటించింది.

వారాలతరబడి మ్యాచ్ లు సాగినా..పిచ్ లలో ఎలాంటి తేడా లేకుండా తయారు చేయటం గొప్ప విషయమని, ఈ ఘనత ఆయా వేదికల గ్రౌండ్ సిబ్బందికి మాత్రమే దక్కుతుందని జే షా కోనియాడారు.

మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిన ప్రధాన వేదికల సిబ్బందికి 25 లక్షల రూపాయలు ( 30 వేల డాలర్లు ), మూడు అదనపు వేదికలకు 10 లక్షల రూపాయలు ( 12వేల డాలర్లు ) చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతులను బీసీసీఐ ప్రకటించింది.

ఐపీఎల్ కు ఆతిథ్యమిచ్చిన ప్రతి వేదికలోనూ 200కు పైగా స్కోర్లు నమోదు కావడం ఇదే మొదటిసారి.

సన్ రైజర్స్ రికార్డుల హోరు..

2008లో ప్రారంభమైన ఐపీఎల్ 17 సీజన్ల చరిత్రలో హైదరాబాద్ సన్ రైజర్‌ 3 వికెట్లకు 287 పరుగులు సాధిస్తే..చేజింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 262 పరుగులు సాధించగలగడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

లీగ్ దశ నుంచి నాకౌట్ ఫైనల్స్ వరకూ మొత్తం 1260 సిక్సర్లు నమోదు కావడం కూడా ఆల్ టైమ్ గ్రేట్ రికార్డుగా నిలిచింది. హైదరాబాద్ జట్టు మాత్రమే 277, 287 స్కోర్లతో తన రికార్డులను తానే అధిగమించుకోగలిగింది.

ఐపీఎల్ -17వ సీజన్ కు ఆతిథ్యమిచ్చిన వేదికల్లో న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం, ముంబై వాంఖడే స్టేడియం, హైదరాబాద్ రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం, చెన్నై చెపాక్ స్టేడియం, కోల్ కతా ఈడెన్ గార్డెన్స్, అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం, ముల్లాన్ పూర్ లోని మహారాజా యాదవింద్ర ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, గౌహతీ బార్సపారా స్టేడియం, లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం, ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం , జైపూర్ సవాయి మాన్ సింగ్ స్టేడియం , విశాఖ పట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం ఉన్నాయి.

First Published:  28 May 2024 12:46 PM IST
Next Story