Telugu Global
Sports

మ్యాచ్ కు 45 లక్షలు..టెస్ట్ క్రికెటర్లకు బీసీసీఐ బొనాంజా!

టెస్టు క్రికెటర్ల ప్రోత్సాహక పథకం కోసం సీజన్ కు 45 కోట్ల రూపాయలు అదనంగా నిధులు కేటాయించినట్లు బోర్డు ప్రకటించింది.

మ్యాచ్ కు 45 లక్షలు..టెస్ట్ క్రికెటర్లకు బీసీసీఐ బొనాంజా!
X

సాంప్రదాయ టెస్టు క్రికెట్ పరిరక్షణకు బీసీసీఐ నడుం బిగించింది. టెస్టు మ్యాచ్ కు 45 లక్షలు అదనంగా చెల్లిస్తామంటూ ప్రకటించింది.

ధూమ్ ధామ్ టీ-20 తుపానులో సాంప్రదాయ టెస్టు క్రికెట్ కొట్టుకుపోకుండా బీసీసీఐ పటిష్టమైన చర్యలు చేపట్టింది. టెస్టుమ్యాచ్ లు ఆడే ఆటగాళ్ల కోసం ' టెస్టు క్రికెట్ ప్రోత్సాహక పథకాన్ని' బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించారు.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు సాంప్రదాయ టెస్టు క్రికెట్ పరిరక్షణకు తక్షణ చర్యలు చేపట్టింది. కేవలం 8 వారాల కాలంలో కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ వైపు ఆటగాళ్లు మళ్ళకుండా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.

టెస్టు ప్లేయర్ల కోసం సరికొత్త పథకం...

టెస్టుమ్యాచ్ లు ఆడటానికి ఆసక్తి చూపడంతో పాటు ప్రాధాన్యమిచ్చే ఆటగాళ్ల కోసం బీసీసీఐ " టెస్టు క్రికెట్ ప్రోత్సాహక పథకాన్ని' 2022-23 క్రికెట్ సీజన్ నుంచే అమలు చేస్తున్నట్లు తెలిపింది.

ఇప్పటి వరకూ ఆడిన ఒక్కో టెస్టుమ్యాచ్ కు 15 లక్షల రూపాయలు మాత్రమే మ్యాచ్ ఫీజుగా చెల్లిస్తూ వస్తున్నారు. అయితే..2022-23 సీజన్ నుంచి ఒక్కో ఆటగాడు ఆడిన మ్యాచ్ లను బట్టి 45 లక్షల రూపాయల వంతున అదనంగా చెల్లించనున్నట్లు బోర్డు కార్యదర్శి వివరించారు.

ఏడాదికి 4.5 కోట్ల రూపాయలు....

ఓ సీజన్లో భారతజట్టు ఆడే మొత్తం 10 టెస్టుమ్యాచ్ ల్లో 75 శాతం మ్యాచ్ లు ఆడే ఆటగాళ్లకు ఏడాదికి 4 కోట్ల 50 లక్షల రూపాయలు చొప్పున చెల్లిస్తారు. మ్యాచ్ కు 15 లక్షల మ్యాచ్ ఫీజుతో పాటు ప్రోత్సాహకంగా మ్యాచ్ కు 45 లక్షల రూపాయలు అదనంగా అందచేయనున్నారు.

రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, జడేజా, బుమ్రా, అశ్విన్ లాంటి ప్లేయర్లు 2022-23 సీజన్ నుంచి 4 కోట్ల 50 లక్షల రూపాయల చొప్పున అందుకోనున్నారు.

భారత్ ఆడే మొత్తం టెస్టుమ్యాచ్ ల్లో పాల్గొనే ప్లేయర్లకు మ్యాచ్ ఫీజు కోటీ 50 లక్షలరూపాయలతో పాటు 4 కోట్ల 50 లక్షల రూపాయలు వంతున ప్రోత్సాహకంగా అందిస్తామని బోర్డు కార్యదర్శి వివరించారు.

భారతజట్టుకు గత సీజన్ వరకూ ప్రాతినిథ్యం వహించిన చతేశ్వర్ పూజారా, ఉమేశ్ యాదవ్ లకు సైతం ప్రోత్సాహక నగదు బహుమతి అందచేస్తామని చెప్పారు.

సీజన్ కు 45 కోట్ల బడ్జెట్....

టెస్టు క్రికెటర్ల ప్రోత్సాహక పథకం కోసం సీజన్ కు 45 కోట్ల రూపాయలు అదనంగా నిధులు కేటాయించినట్లు బోర్డు ప్రకటించింది. 2023-24 సీజన్ కు సైతం ఈ పథకాన్ని వర్తింప చేస్తారు.

భారత అగ్రశ్రేణి క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, జడేజా, బుమ్రా వార్షిక కాంట్రాక్టు కింద ఏడాదికి 7 కోట్ల రూపాయలు గ్యారెంటీమనీగా అందచేస్తూ వస్తోంది. దీనికి అదనంగా టెస్టు క్రికెటర్ల ప్రోత్సాహక పథకం కింద మ్యాచ్ ఫీజుతో కలుపుకొని మరో 6 కోట్ల రూపాయలు చొప్పున చెల్లిస్తారు. అంటే..ఐపీఎల్ కాంట్రాక్టుల ప్రమేయం లేకుండా సీజన్ కు 13 కోట్ల రూపాయలు అగ్రశ్రేణి ఆటగాళ్లకు దక్కనున్నాయి.

2023-24 సీజన్లో భారత్ ఆడిన మొత్తం 10 టెస్టుల్లో పాల్గొన్న రోహిత్ శర్మ 13 కోట్ల రూపాయలు అందుకోనున్నాడు. కేవలం టెస్టు క్రికెట్ ఆడటం ద్వారానే 6 కోట్ల రూపాయలు అందుకొనేలా బీసీసీఐ చర్యలు తీసుకొంది.

సీజన్ కు 5 నుంచి 6 టెస్టు మ్యాచ్ లు ఆడే ఆటగాళ్లకు కోటీ 80 లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తారు. ఈ పథకం కేవలం భారత పురుషుల టెస్టు జట్టుకు మాత్రమే వర్తిస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది.

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఈ తరహా పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక క్రికెట్ బోర్డు బీసీసీఐ మాత్రమే. మొత్తంమీద టెస్టు క్రికెటర్ల రొట్టె విరిగి నేతిలో పడిందనే చెప్పాలి.

First Published:  10 March 2024 2:20 PM IST
Next Story