Telugu Global
Sports

భారత సంతతి ఆటగాళ్లతో అమెరికా టీ-20 క్రికెట్ జట్టు!

2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే అమెరికాజట్టుకు భారత సంతతి ఆటగాడు మోనాంక్ పటేల్ నాయకత్వం వహిస్తాడు.

భారత సంతతి ఆటగాళ్లతో అమెరికా టీ-20 క్రికెట్ జట్టు!
X

2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే అమెరికాజట్టుకు భారత సంతతి ఆటగాడు మోనాంక్ పటేల్ నాయకత్వం వహిస్తాడు. ప్రపంచకప్ కు అమెరికా తొలిసారిగా విండీస్ తో కలసి సంయుక్త ఆతిథ్యమిస్తోంది.

కరీబియన్ ద్వీపాలు, అమెరికా సంయుక్త రాష్ట్ర్రాల ఆతిథ్యంలో తొలిసారిగా జరుగనున్న 2024 -ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల అమెరికాజట్టు భారత సంతతి ఆటగాళ్లతో నిండిపోయింది.

ఆతిథ్యదేశాల హోదాలో అమెరికాజట్టుకు తొలిసారిగా టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే అవకాశం దక్కింది.

వలస ఆటగాళ్లతోనే అమెరికాజట్టు...

ప్రపంచ పెద్దన్న, ప్రపంచాన్నే శాసిస్తున్న అమెరికా అంటే వివిధ దేశాల నుంచి వలస వచ్చిన ప్రజలతో నిండిన దేశం. దానికి క్రికెట్ సైతం ఏమాత్రం మినహాయింపు కాదు.

అమెరికన్ ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ , టెన్నిస్ , ఫుట్ బాల్ లాంటి క్రీడలకే అమెరికాలో విశేష ఆదరణ ఉంది. క్రికెట్ ను మాత్రం ఆసియాఖండం నుంచి వలస వచ్చిన భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల సంతతి ఆటగాళ్లు మాత్రమే ఆడుతూ ఉంటారు.

అందుకే ..ప్రపంచకప్ లో పాల్గొనే అమెరికా టీ-20 జట్టు ఆసియాఖండ, ప్రధానంగా భారత సంతతి ఆటగాళ్లతో నిండిపోయింది. మొత్తం 15 మంది సభ్యులజట్టులో భారత సంతతికి చెందిన ఎనిమిది మంది ఆటగాళ్లకు చోటు దక్కింది.

ఉన్ముక్త్ చంద్ కు మొండిచేయి....

భారత అండర్ -19 ప్రపంచకప్ విజేత జట్టుకు నాయకత్వం వహించిన ఉన్ముక్త్ చంద్ కు అమెరికాజట్టులో చోటు దక్కలేదు. మోనాంక్ పటేల్ నాయకత్వంలోని అమెరికాజట్టులో చోటు సంపాదించిన భారత సంతతి ఆటగాళ్లలో లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ హర్మీత్ సింగ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు మిలింద్ కుమార్, నితీష్ కుమార్, గజానంద్ సింగ్, సౌరవ్ నేత్రవల్కర్, జెస్సీ సింగ్, నిసర్గ పటేల్ ఉన్నారు.

కివీ మాజీ ఆల్ రౌండర్ కు చోటు...

న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ కోరీ యాండర్సన్ కు అమెరికాజట్టులో చోటు దక్కింది. జట్టులోని ఇతర ఆటగాళ్లలో స్టీవెన్ టేలర్, నోష్టుష కెంజిగీ, ఉస్మాన్ రఫీక్, యాండ్రీస్ గౌస్, షాడ్లే వాన్ చెల్విక్ ఉన్నారు.

ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా టెక్సాస్ లోని హ్యూస్టన్ వేదికగా ఏప్రిల్ 7 నుంచి 13 వరకూ జరిగే ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో కెనడా జట్టుతో అమెరికాజట్టు తలపడనుంది.

అమెరికాజట్టులో చోటు సంపాదించిన స్పిన్ ఆల్ రౌండర్ హర్మీత్ సింగ్ కు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా పాల్గొన్న అనుభవం ఉంది.

2012లో ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగిన అండర్ -19 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన భారతజట్టులో హర్మీత్ కీలక సభ్యుడిగా ఉన్నాడు.

అమెరికా మేజర్ లీగ్ లో 2021 నుంచి పాల్గొంటూ వస్తున్న హర్మీత్ సింగ్ 87 వికెట్లు పడగొట్టడంతో పాటు 733 పరుగులు సాధించాడు. ఓ సెంచరీ సైతం నమోదు చేశాడు.

సియాటిల్ థండర్ బోల్ట్ జట్టు తరపున ఆడటానికి హర్మీత్ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకొన్నాడు.

జట్టులోని మరో భారత సంతతి ఆటగాడు మిలింద్ కుమార్ టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్నాడు. అమెరికా జట్టుకు ఆరోన్ జోన్స్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.

భారత గ్రూపులోనే అమెరికాజట్టు...

ప్రపంచకప్ లో పాల్గొనే వివిధజట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. హాట్ ఫేవరెట్ భారతజట్టు ఉన్న గ్రూపులోనే అమెరికా సైతం తన అదృష్టం పరీక్షించుకోనుంది.

జూన్ 2న ప్రపంచకప్ కు తెరలేవనుంది. జూన్ 12న న్యూయార్క్ వేదికగా జరిగే మ్యాచ్ లో భారత్ తో అమెరికాజట్టు తలపడనుంది.

కెనడాతో ఐదుమ్యాచ్ ల సన్నాహక సిరీస్ తరువాత..మే నెలలో బంగ్లాదేశ్ తో జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లోనూ అమెరికాజట్టు పోటీపడనుంది.

మొత్తం 15 మంది సభ్యుల అమెరికాజట్టులోని మోనాంక్ పటేల్, జోన్స్, కోరీ యాండర్సన్ కు మాత్రమే అంతర్జాతీయమ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. 2013, 2015 టీ-20 ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొన్న న్యూజిలాండ్ జట్టులో కోరీ యాండర్సన్ కీలక ఆల్ రౌండర్ గా ఉన్నాడు. 2015 ప్రపంచకప్ ఫైనల్లో పాల్గొన్న రికార్డు సైతం కోరీకి ఉంది. తన కెరియర్ లో కోరీ యాండర్సన్ మొత్తం 13 టెస్టులు, 49 వన్డేలు, 3 టీ-20 మ్యాచ్ లు ఆడాడు.

ప్రపంచకప్ గ్రూప్- ఏ లీగ్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తో పాటు అమెరికా, కెనడా, ఐర్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. భారత్- పాకిస్థాన్ జట్ల బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు డల్లాస్ నగరం వేదిక కానుంది.

First Published:  30 March 2024 8:19 AM IST
Next Story