Telugu Global
Sports

ఆఖరి టీ-20లో పరుగుల వెల్లువేనా?

భారత్-ఆస్ట్ర్రేలియాజట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ముగింపు దశకు చేరింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే సూపర్ సండే ఆఖరి పోరులో పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది.

ఆఖరి టీ-20లో పరుగుల వెల్లువేనా?
X

భారత్-ఆస్ట్ర్రేలియాజట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ముగింపు దశకు చేరింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే సూపర్ సండే ఆఖరి పోరులో పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది....

2024 టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా టాప్ ర్యాంకర్ భారత్, 4వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాజట్ల నడుమ జరుగుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్ కు ఈరోజు బెంగళూరు వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్ తో తెరపడనుంది.

నాలుగో విజయానికి భారత్ రెడీ...

ప్రస్తుత సిరీస్ లో భాగంగా విశాఖ, తిరువనంతపురం, రాయ్ పూర్ వేదికలుగా జరిగిన పోటీలలో భారత్ విజయాలు సాధించడం ద్వారా 3-1తో సిరీస్ ను ఇప్పటికే ఖాయం చేసుకొంది. ఆస్ట్ర్రేలియా మాత్రం గౌహతీ వేదికగా జరిగిన 3వ టీ-20 మ్యాచ్ లో నెగ్గడం ద్వారా భారత్ ను నిలువరించగలిగింది. జోష్ ఇంగ్లిస్, మార్కుస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్ వెల్ లాంటి పలువురు ప్రధాన ఆటగాళ్లు లేకుండానే సిరీస్ లోని ఆఖరి పోరు కోసం సైతం కంగారూజట్టు బరిలోకి దిగుతోంది. ఓపెనర్ హెడ్, కెప్టెన్ మాథ్యూ వేడ్ మినహా మిగిలిన ఆటగాళ్లంతా తగినంత అనుభవం లేనివారు కావడం ఆస్ట్ర్రేలియాకు ప్రధాన బలహీనతగా మారింది.

టాప్ గేర్ లో భారతజట్టు...

రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, జడేజా , సిరాజ్, బుమ్రా లాంటి పలువురు ప్రధాన ఆటగాళ్లు లేకుండానే ద్వితీయ శ్రేణిజట్టుతో కంగారూలతో తలపడిన భారతజట్టు సిరీస్ లోని నాలుగుమ్యాచ్ ల్లో మూడు విజయాలు సాధించడం ద్వారా సత్తా చాటుకోగలిగింది.

సూర్యకుమార్ నాయకత్వంలోని భారతజట్టు గత నాలుగుమ్యాచ్ ల్లో మూడింట 200 కు పైగా స్కోర్లు సాధించడం ద్వారా దూకుడుమీద కనిపిస్తోంది. విశాఖ మ్యాచ్ లో 209, తిరువనంతపురం పోరులో 235, గౌహతీ వేదికగా జరిగిన మూడో టీ-20లో 222 పరుగుల స్కోర్లను భారత్ నమోదు చేయడం ద్వారా తన బ్యాటింగ్ పవర్ ఏపాటిదో చెప్పకనే చెప్పింది.

ఓపెనర్ రుతురాజ్ గయక్వాడ్, మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్ నిలకడగా రాణిస్తూ భారత్ బ్యాటింగ్ ఆర్డర్ కే అండగా ఉంటూ వస్తున్నారు.

తుదిజట్టులో శివం, సుందర్....

రాయ్ పూర్ వేదికగా ముగిసిన నాలుగో మ్యాచ్ లో నాలుగు మార్పులతో బరిలోకి దిగిన భారత్..ప్రస్తుత ఆఖరిపోరులో సైతం ఒకటి లేదా రెండుమార్పులు చేసే అవకాశాలు లేకపోలేదు.

సిరీస్ లోని మొదటి నాలుగుమ్యాచ్ ల్లోనూ బెంచ్ కే పరిమితమైన పేస్ ఆల్ రౌండర్ శివం దూబే, స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ లకు తుదిజట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు తుదిజట్టులో చోటు కల్పించనున్నారు.

నాలుగో మ్యాచ్ నుంచే జట్టుకు అందుబాటులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఈ ఆఖరిపోరులో భారీస్కోరుకు గురిపెట్టాడు. జట్టులోని ఇతర యువఆటగాళ్లకు సైతం ఇదే ఆఖరి చాన్స్ కావడంతో పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు.

ఆఖరిమ్యాచ్ కంటితుడుపేనా?

ఐదుమ్యాచ్ ల సిరీస్ లో భారత్ ఇప్పటికే 3-1 ఆధిక్యంతో పైచేయి సాధించడంతో..ఈరోజు జరిగే ఆఖరిమ్యాచ్ కంటితుడుపే కానుంది. అయితే..ఇటు భారత్, అటు ఆస్ట్ర్రేలియాజట్లు విజయంతోనే సిరీస్ ను ముగించాలన్న పట్టుదలతో ఉండడంతో పోరు హోరాహోరీగా సాగే అవకాశం లేకపోలేదు. పైగా..బ్యాటర్ల స్వర్గంగా పేరున్న చిన్నస్వామి స్టేడియంలో పరుగుల మోత మోగనుంది. కురచ బౌండ్రీ లైన్లతో ఉన్న బెంగళూరులో తరచూ భారీస్కోరింగ్ తోనే మ్యాచ్ లు సాగుతూ రావడం ఆనవాయితీగా వస్తోంది.

రాత్రి 7 గంటలకు ప్రారంభంకానున్నఈ ఆఖరాటలో సైతం టాస్ కీలకంగా మారనుంది. ఆస్ట్ర్రేలియాతో స్వదేశీ సిరీస్ ముగిసిన కొద్దిరోజులకే ముగ్గురు వేర్వేరు కెప్టెన్ల నాయకత్వంలో భారత్..దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది.

దక్షిణాఫ్రికాతో మూడుమ్యాచ్ ల సిరీస్ కోసం 17 మంది సభ్యులజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ఇప్పటికే ప్రకటించింది. డిసెంబర్ 10న డర్బన్ కింగ్స్ మీడ్ స్టేడియం వేదికగా తొలి టీ-20 సమరం ప్రారంభంకానుంది.

First Published:  3 Dec 2023 11:31 AM IST
Next Story