వాట్సాప్ మన మాటలు వింటోందా..? ఆరోపణలపై విచారణకు కేంద్రం ఆదేశాలు
' ఉదయం 6 గంటలకు నిద్ర లేచా. అప్పుడు నేను ఫోన్ వాడలేదు. అయినా సరే వాట్సాప్ బ్యాక్ గ్రౌండ్ లో నా మొబైల్ మైక్రోఫోన్ ను వాడుతోంది. అసలేం జరుగుతోంది?..' అంటూ డబిరి ట్వీట్ చేశాడు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్మార్ట్ ఫోన్ లో మన మాటలు వింటోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫోన్ పక్కన పెట్టేసిన సమయంలో, నిద్రపోతున్న సమయంలో కూడా బ్యాక్ గ్రౌండ్ లో మైక్రోఫోన్ పనిచేస్తోందని వాట్సాప్ పై తాజాగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. దీనిపై విచారణ జరుపుతామని, ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
ఫోన్ వినియోగించని సమయంలో కూడా వాట్సాప్ మైక్రోఫోన్ పని చేస్తోందని ఫోడ్ డబిరి అనే ట్విట్టర్ ఉద్యోగి చేసిన ట్వీట్ వైరల్ అవడంతో వాట్సప్ పై ఆరోపణలు వచ్చాయి. ఇటీవల డబిరి ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశాడు. ' ఉదయం 6 గంటలకు నిద్ర లేచా. అప్పుడు నేను ఫోన్ వాడలేదు. అయినా సరే వాట్సాప్ బ్యాక్ గ్రౌండ్ లో నా మొబైల్ మైక్రోఫోన్ ను వాడుతోంది. అసలేం జరుగుతోంది?..' అంటూ డబిరి ట్వీట్ చేశాడు. డబిరి చేసిన ట్వీట్ కి 6.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీనిపై ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ కూడా స్పందించాడు. వాట్సప్ నమ్మదగినది కాదు.. అంటూ ట్వీట్ చేశాడు.
ఈ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఈ వ్యవహారం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇది వినియోగదారుల గోప్యతపై దాడిగా ఆయన అభివర్ణించారు. దీనిపై వెంటనే విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. వినియోగదారుల గోప్యతకు భంగం వాటిల్లినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. ఈ ఆరోపణలను వాట్సాప్ ఖండించింది. డబిరి గూగుల్ పిక్సెల్ సెల్ ఫోన్ వాడుతున్నాడని, ఆ ఫోన్ ఆండ్రాయిడ్ లో ఉన్న బగ్ కారణంగానే డ్యాష్ బోర్డులో తప్పుడు సమాచారం చూపిస్తోందని వాట్సాప్ పేర్కొంది. దీనిపై విచారణ జరపాలని గూగుల్ ని కోరినట్లు వాట్సాప్ తెలిపింది. ఇటీవల కాలంలో వాట్సాప్ లో కూడా స్పామ్ కాల్స్ అధికం అయ్యాయి. అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు భారత్ లోని వాట్సాప్ వినియోదారులను లక్ష్యంగా చేసుకొని స్పామ్ కాల్స్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఒకవైపు వేధిస్తున్న సమయంలో ఇప్పుడు వాట్సాప్ వినియోగదారుల మాటలను వింటోందని ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.