Telugu Global
NEWS

పోలవరం ముంపు కష్టాలు.. ఈ నెల 30 నుంచి మరో సర్వే

పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై ఈ నెల 30 నుంచి సర్వే చేపట్టబోతున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) మార్గదర్శకాల మేరకు పోలవరం ప్రాజెక్ట్ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది.

పోలవరం ముంపు కష్టాలు.. ఈ నెల 30 నుంచి మరో సర్వే
X

ఇటీవల గోదావరి వరదలతో ముంపు సమస్య గతంలో కంటే పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టంతో సంబంధం లేకుండా కొన్ని మండలాలు ముంపు బారిన పడ్డాయి. దీనికి కారణం పోలవరమేనంటూ తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పోలవరం పూర్తి కాకముందే బ్యాక్ వాటర్ ప్రభావం ఈ స్థాయిలో ఉంటే, ఇక ప్రాజెక్ట్ పూర్తై, నీటిని నిల్వ చేస్తే.. భద్రాచలం మునిగిపోవడం ఖాయమని అంటున్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు. ఈ ఆందోళనలు, అనుమానాల మధ్య తాజాగా మరో సర్వేకు రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి.

పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై ఈ నెల 30 నుంచి సర్వే చేపట్టబోతున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) మార్గదర్శకాల మేరకు పోలవరం ప్రాజెక్ట్ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది. వీరికి ఏపీ, తెలంగాణ ఇంజినీర్లు సర్వేలో సాయం చేస్తారు. పోలవరం ప్రాజెక్టు వద్ద 150 అడుగుల స్థాయిలో నీటిని నిల్వచేస్తే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ముంపు ముప్పు ఏ స్థాయిలో ఉంటుందనేది ఈ సర్వే ద్వారా తెలుసుకుంటారు.

భద్రాచలంతోపాటు ముర్రేడు, కిన్నెరసాని నదులతోపాటు ఇతర వాగుల నుంచి వచ్చే ప్రవాహాలు కూడా వరదల సమయంలో అధికంగా ఉంటాయి. వీటి ద్వారా బ్యాక్ వాటర్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్జీటీ సూచనలు, కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు రెండు రాష్ట్రాల ఇంజినీర్లు ఉమ్మడి సర్వేలో పాల్గొనబోతున్నారు.

ఈ ఏడాది జులైలో గోదావరికి వరదలు వచ్చిన సమయంలో భద్రాచలం వద్ద 71.3 అడుగుల మేర నీటి మట్టం నమోదవగా, ఆ ప్రభావంతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. గ్రామాల్లోకి కూడా వరదనీరు వచ్చింది. గతంలో ఆ స్థాయిలో వరద వచ్చినా కొన్ని గ్రామాల్లోకి నీరు రాలేదు. ఇప్పుడు పోలవరం కారణంగా గ్రామాలు కూడా ముంపు బారినపడుతున్నాయనేది ప్రధాన ఆరోపణ. దీంతో ఇప్పుడు సమగ్ర సర్వే చేపట్టబోతున్నారు. బ్యాక్ వాటర్‌పై కచ్చితమైన అంచనాలకు రాబోతున్నారు నిపుణులు.

First Published:  28 Oct 2022 2:21 AM GMT
Next Story