Telugu Global
NEWS

హైడ్రా పేరుతో పేదోళ్లను రేవంత్‌ రోడ్డున పడేస్తున్నరు

గరీబోళ్లకు ఒక న్యాయం.. సీఎం అన్నకు ఒక న్యాయమా : బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైడ్రా పేరుతో పేదోళ్లను రేవంత్‌ రోడ్డున పడేస్తున్నరు
X

హైడ్రా పేరుతో పేదోళ్లను సీఎం రేవంత్‌ రెడ్డి రోడ్డున పడేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. గరీబోళ్లకు ఒక న్యాయం.. సీఎం అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్‌ లో నిర్వహించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ లోని పేదలు బీఆర్‌ఎస్‌ కు అండగా నిలిచారనే వారిపై రేవంత్‌ రెడ్డి పగ బట్టిండని అన్నారు. బస్తీవాసులు, పేదలు, ఆటో డ్రైవర్లు ఇలా అందరిపై రేవంత్‌ కక్ష పెంచుకున్నారని అన్నారు. హైదరాబాద్‌ లో అక్రమ నిర్మాణాలుగా చెప్తోన్న వాటికి పర్మిషన్లు ఇచ్చిందే గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అని.. దమ్ముంటే పర్మిషన్లు ఇచ్చిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పేదోళ్ల ఇండ్లు కూల్చేస్తుంటే బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోబోదని, బాధితులకు అండగా ఉంటుందని అన్నారు. రేవంత్‌ కుటుంబం రాష్ట్రాన్ని పంచుకొని దోపిడీలతో స్వైర విహారం చేస్తోందన్నారు. తిరుపతి రెడ్డి మదాపూర్‌ లో కమీషన్ల దుఖాణం తెరిచిండని శేరిలింగంపల్లి ఎమ్మెల్యేనే చెప్పిండన్నారు. తిరుపతి రెడ్డి ఇంటిపై బీఆర్‌ఎస్‌ లీడర్లు ప్రశ్నిస్తున్నారని.. నోటీసు ఇచ్చినట్టు డ్రామా చేశారని, ఆయన కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారని గుర్తు చేశారు. సీఎం అన్నకు నోటీసులు ఇచ్చినోళ్లు గరీబోళ్లు పుస్తకాలు, సామాగ్రి తీసుకునే సమయం కూడా ఇవ్వడం లేదని, నిర్దాక్షిణ్యంగా వాళ్ల ఇండ్లు కూల్చేస్తున్నారని మండిపడ్డారు. ''మనం కన్ స్ట్రక్షన్ చేశాం.. ఈయన మాత్రం డిస్ట్రక్షన్ చేస్తుండు.. మనం డబుల్ బెడ్ రూమ్ లు, ఫ్లై ఓవర్లు, ఎస్టీపీలు కట్టినం.. ఈ ముఖ్యమంత్రి మాత్రం 9 నెలల్లో బెదిరింపులు, కూలగొట్టుడు, బ్లాక్ మెయిలు చేస్తున్నాడు.. నాగార్జునకు సంబంధించిన నిర్మాణాన్ని కూల్చేశారు మంచిదే, కానీ పర్మిషన్ ఇచ్చిందెవడు. దమ్ముంటే వాళ్లపై చర్యలు తీసుకోవాలే.. మనం ఆక్రమణలను ప్రోత్సహించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అసలు పర్మిషన్లు ఇచ్చినోళ్లను బయటకు తీయండి. అవన్నీ మీ కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన పర్మిషన్లే..'' అన్నారు.

ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఇండ్లు, ఫాం హౌస్‌ లు నిర్మించుకున్న పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇండ్లను కూల్చేయాలని డిమాండ్‌ చేశారు. పేదవాళ్లకు ఎవరు అండగా లేరని వారిపై దౌర్జన్యం చేస్తారా అని ప్రశ్నించారు. ఏ దిక్కు లేకనే పేదలు నాలాలపై ఇండ్లు కట్టుకుంటారని, మానవత్వం ఉన్న ప్రభుత్వమైతే వాళ్లకు నోటీసులు ఇచ్చి సమయం ఇవ్వాలని, లేదంటే వాళ్లకు వేరే ఇళ్లు ఇచ్చి అక్కడికి వెళ్లాలని సూచించాలని అన్నారు. ఈ ప్రభుత్వానికి నీతి ఉంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన 40 వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లు వాళ్లకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హైడ్రాకు చుట్టం లేకపోతే తిరుపతి రెడ్డికి ఎందుకు వదిలి పెట్టారు.. పేదల ఇండ్లు ఎందుకు కూల్చేస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌ లోని పేదలకు అండగా ఉండేందుకు త్వరలోనే ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మించి ప్రజలకు మంచి చేయాలని రేవంత్‌ కు సూచించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యేకు పార్టీ ఏం తక్కువ చేసిందని పార్టీ మారారో చెప్పారన్నారు. శేరిలింగంపల్లికి బరాబర్‌ ఉప ఎన్నిక వస్తుందని, ఇక్కడ ఉన్న పార్టీ నాయకుల్లో నుంచి ఒకరు ఎమ్మెల్యే అవుతారన్నారు. ''మంత్రి శ్రీధర్ బాబు అతి తెలివితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు అంటున్నరు.. మరి శేరిలింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి, దౌర్భాగ్యుడు, వెధవ ఎవరో శ్రీధర్ బాబు చెప్పాలి. మనం మనోడు కాదంటున్నాం. వాళ్లు మనోడు కాదంటాడు. వాళ్ల బతుకు ఎటు కాకుండా పోయింది. ఇంటింటికి వెళ్లి నువ్వే చేర్చుకున్నవ్ కదా ముఖ్యమంత్రి… ఇప్పుడు వాళ్ల బతుకు జూబ్లీ బస్టాండ్ అయ్యింది.. మొన్నటి హైకోర్టు తీర్పుతో వాళ్ల గుండెల్లో వణుకు మొదలైంది.. అందుకే నీతి బహ్యామైన పనులు చేస్తున్నారు.. దమ్ము, ధైర్యం ఉంటే మేము ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని చెప్పు మంచి పనులు చేస్తే ఉప ఎన్నికలు పెట్టి గెలువు.. నువ్వు చేస్తున్న గలీజ్ పనులను ప్రజలు, మీ ఢిల్లీ పెద్దలు కూడా చూస్తున్నారు..'' అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని హామీలిచ్చిందో గుర్తు చేసుకోవాలన్నారు. అవ్వ, తాతలకు నాలుగు వేలు ఫించన్ అన్నారని, ఉన్న రెండు వేలు కూడా దిక్కులేవన్నారు. డిసెంబర్‌ 9న రూ.2 లక్షల వరకు రైతులు తీసుకున్న రుణాలు రూ.49 వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పి రూ.12 వేల కోట్లతో సరిపెట్టారని, రైతులు తమ రుణాలు మాఫీ కాలేదని పొలాల్లో సెల్ఫీలు తీసుకొని నిరసన చెప్తున్నారని అన్నారు. రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చిండని.. సీఎం కుర్చీకే భరోసా లేని పరిస్థితి నెలకొందన్నారు. ''ఖమ్మం బాంబా, నల్గొండ బాంబా.. ఎటు నుంచి బాంబు పడుతుందో అర్థం కాక భయంతో ఉన్నాడు..'' అన్నారు. ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం ఇవ్వలేదని, యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ''కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారంట.. సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫ్లై ఓవర్లు ఎక్కడ చూసిన కేసీఆర్ ఆనవాళ్లే కనిపిస్తాయి.. తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ కనిపిస్తూనే ఉంటాడు చిట్టి నాయుడు.. చిట్టి నాయుడు అన్నదమ్ముళ్లు ఏడుగురు మొత్తం తెలంగాణను పంచుకున్నారు.. వాళ్లంతా తెలంగాణలో స్వైర విహారం చేస్తూ దోచుకుంటున్నారు. సీఎం బంధువులు, సీఎం చేస్తున్న దౌర్జన్యాలతో తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఢమాల్ అన్నది.. ఇప్పటి వరకు ఈ సీఎం ఢిల్లీకి 23 సార్లు పోయిండు.. రాష్ట్రంలో మాత్రం ఒక్క కొత్త పథకం కూడా పెట్టలేదు.. వంద రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తా అని చెప్పాడు కదా? మరీ ఒక్కటైనా చేసిండా?'' అని ప్రశ్నించారు. శేరిలింగంపల్లి కార్యకర్తలకు ఏ బాధ వచ్చినా తాను అండగా ఉంటానని తెలిపారు. పార్టీ మారినోళ్లు మళ్లీ తిరిగి వస్తామని అడుగుతున్నారని అన్నారు. ప్రజలు కేసీఆర్‌ రావాలని కోరుకుంటున్నారని.. చిట్టినాయుడు తీరుతో రాష్ట్రం గందరగోళం పడిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన హైదరబాద్‌ లో బీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు.

First Published:  24 Sept 2024 2:26 PM IST
Next Story