Telugu Global
National

మేం తలచుకుంటే రాజీవ్‌ పేర్లు.. ఇందిరా విగ్రహాలు ఉండేవా

పదేళ్లలో పేదల బతుకులు మార్చామే తప్ప పేర్లు మార్చలేదు : రాహుల్‌ గాంధీకి కేటీఆర్‌ లేఖ

మేం తలచుకుంటే రాజీవ్‌ పేర్లు.. ఇందిరా విగ్రహాలు ఉండేవా
X

బీఆర్‌ఎస్‌ తలచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్‌ గాంధీ పేర్లు, ఇందిరాగాంధీ విగ్రహాలు ఉండేవా అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. పదేళ్ల తమ పార్టీ పాలనలో పేదల బతుకులు మార్చామే తప్ప పేర్లను కాదని గుర్తు చేశారు. బుధవారం రాహుల్‌ గాంధీకి కేటీఆర్‌ లేఖ రాశారు. విగ్రహాలను మార్చే నీచ సంస్కృతికి పుల్‌ స్టాప్‌ పెట్టకపోతే భవిష్యత్‌లో జరగబోయేది అదేనని తేల్చిచెప్పారు. ''సరిగ్గా ఏడాది క్రితం కొలువుదీరిన మీ కాంగ్రెస్ సర్కారు తెలంగాణను ఆగం చేయడమే కాకుండా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తోంది. చేతకాని, మతిలేని ముఖ్యమంత్రిని తెలంగాణ నెత్తిన రుద్ది మీరు చేతులు దులుపుకోవడంతో అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా ప్రతివర్గం అరిగోస పడుతోంది. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక వర్గం దాకా సంక్షోభంలో కూరుకుపోతోంది. ఎన్నికల టైంలో మీరు ఊరురా తిరిగి ఊదరగొట్టిన గ్యారెంటీలన్నీ గారడీలేనని ఏడాది పాలన చూస్తే అర్థమైపోయింది. మీరు చేసిన డిక్లరేషన్ల పట్ల మీకే డెడికేషన్ లేదని అక్షరాలా రుజువైపోయింది. మేనిఫెస్టోలో మీరిచ్చిన 420 హామీలు.. కాంగ్రెస్ చీటింగ్ చాప్టర్ లో భాగమేనని తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది. గాలి మోటర్లో వచ్చి గాలిమాటలు చెప్పి ఏడాదిపాటు పత్తా లేకుండా పోయిన మీకు, మీ పార్టీకి తెలంగాణ పట్ల రవ్వంత కూడా బాధ్యత లేదని తేలిపోయింది. ప్రగతిపథంలో పరుగులు పెట్టిన రాష్ట్రం అధోగతి పాలవుతుంటే తెలంగాణ వైపు కనీసం కన్నెత్తి చూడని మీ తీరును చూసి నాలుగు కోట్ల ప్రజలు నిత్యం రగిలిపోతున్నారు. సీఎం ఢిల్లీకి పంపే మూటలపై మీకున్న శ్రద్ధ, మీరు ప్రజలకు మీరిచ్చిన మాటపై లేకపోవడం నయవంచన, ద్రోహం కాక మరేంటి..'' అని ప్రశ్నించారు.

ఏడాది పాలనలో ఏ పేజీ తిప్పి చూసినా.. మోసం మీ నైజం.. అవినీతి మీ ఎజెండా, నియంతృత్వం మీ విధానమని తేల్చిచెప్పారన్నారు. మనసులో విషం తప్ప మెదడులో విషయం లేని సీఎం చేతిలో తెలంగాణ బతుకుచిత్రం ఛిద్రమవుతుంటే మీరు ప్రేక్షకపాత్రకే పరిమితమైన వ్యవహారంపై ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ ప్రజాగ్రహం వెల్లువెత్తుతోందన్నారు. ''దేశానికే వెన్నుముక అయిన రైతన్నకు వెన్నుపోటు పొడిచిన దుర్మార్గపు పాలన మీది. కాంగ్రెస్ కు అధికారమిస్తే ఏకకాలంలో రైతులందరికీ డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట నీటిమూటే అయ్యింది. రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరమైతే తూతూమంత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. అది కూడా నాలుగు విడతలుగా ఊరించి ఊరించి ఉసూరుమనిపించడంతో.. ఇప్పటికే దాదాపు 620 మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రిలో చలనం లేదు.. కాంగ్రెస్ సర్కారులో కనీస మానవత్వం లేదు. బీఆర్ఎస్ హయాంలో అప్రతిహతంగా కొనసాగిన పెట్టుబడి సాయానికి కాంగ్రెస్ బ్రేకులు వేశారు. బీఆర్ఎస్ సిద్ధం చేసిన రైతుబంధు నిధులు ఒకసారి విడుదల చేశారే తప్ప.. ఏడాదైనా మీరు చెప్పిన రైతుభరోసాను మొదలే పెట్టలేదు. వానాకాలం సీజన్‌లో పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి రైతులను నిలువునా ముంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేల చొప్పున ఇస్తామన్న హామీకి ఏడాదైనా అతీ గతీ లేదు. వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ మాట దేవుడెరుగు కనీసం పంట కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధర లేక సాగు మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయింది. విత్తనాలు, ఎరువుల కోసం మళ్లీ క్యూలైన్లో చెప్పులు, పాసు పుస్తకాలు పెట్టే దుస్థితి తెచ్చిన కాంగ్రెస్ సర్కారును చూసి అన్నదాతలు అసహ్యించుకుంటున్నారు..'' అని వివరించారు.

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ గంగలో కలిసిపోయిందని, ఏడాది పాలనలో 12,527 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఇంకా 1,87,473 ఉద్యోగాలు మీ ప్రభుత్వం బాకీ ఉందన్నారు. అశోక్‌ నగర్‌లో ఫొటోలకు ఫోజులు కొట్టి అడ్రస్‌ లేకుండా పోయారని, తమను కాంగ్రెస్‌ మోసం చేసిందని యువత గ్రహించిందన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 సాయం ఇవ్వడం లేదని, కళ్యాణలక్ష్మీకి తోడు తులం బంగారం ఇవ్వడం లేదని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం ఉత్తదేనని తేలిపోయిందన్నారు. వృద్ధులు, వితంతువుల పింఛన్లు నెలకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలకు పెంచుతామన్న హామీ నెరవేర్చకపోగా ఉన్న పింఛన్లనే రెండు నెలలు ఎగ్గొట్టారని తెలిపారు. ''హైడ్రా పేరిట హంగామా సృష్టించి నిరుపేదలకు నిలువ లేకుండా చేసిన పాపం కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లక్షన్నర కోట్ల లూటిఫికేషన్ ప్లాన్ కూడా బట్టబయలైంది. బీఆర్ఎస్ హయాంలోనే ఎస్టీపీల నిర్మాణం పూర్తయినా, ఈ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు టార్గెట్ పెట్టడం మూసీలో మీ మూటల వేటకేనని తెలంగాణలో ఎవరిని అడిగినా చెబుతారు. కనికరం లేని ముఖ్యమంత్రి ఆదేశాలతో కాంగ్రెస్ సర్కారు కూల్చివేతలకు కేరాఫ్ గా మారితే, ఉద్యమానికి కేంద్రబిందువుగా ఉన్న తెలంగాణ భవన్‌ జనతా గ్యారేజీగా మారింది. కాంగ్రెస్ నిరంకుశ పాలనలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. కన్నీళ్లొచ్చినా బాధితులు తలుపుతట్టే ఏకైక గడపగా తెలంగాణ భవన్ నిలిచింది. కాంగ్రెస్ చేతిలో దగాపడ్డ ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకుని హైడ్రా, మూసీ బాధితుల వరకూ అందరినీ కడుపులో పెట్టుకుని కాపాడే రక్షణ కవచం.. తెలంగాణ భవన్ అనే విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది..'' అని తేల్చిచెప్పారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తెలంగాణలో బూటకపు ఎన్‌కౌంటర్లు మళ్లీ మొదలయ్యాయని తెలిపారు. ఏడాది కాంగ్రెస్‌ పాలన ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందన్నారు. ''అల్లుడి ఫార్మా కంపెనీ కోసం, అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం కొడంగల్‌లో సీఎం బలంవంతంగా భూములు లాక్కునే కుట్రను దళిత, గిరిజన ఆడబిడ్డలు ఢిల్లీ వేదికగా ఎండగట్టారు.. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిరాలేదు. ఫార్మా విలేజీ ప్లాన్ బెడిసికొట్టిందనే కక్షతో ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట మీ ప్రభుత్వం మరో కుతంత్రాన్ని తెరపైకి తెచ్చి పచ్చని భూముల్లో చిచ్చుపెట్టే పన్నాగాలను ప్రజలు మరోసారి తిప్పికొట్టడం ఖాయం. అతి తక్కువ కాలంలో అత్యధిక ప్రజాధనాన్ని లూటీ చేసిన సర్కారుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ చీకటి చరిత్రను లిఖించింది. సీఎం బావమరిదికి కట్టబెట్టిన అమృత్ టెండర్ నుంచి మొదలుకుంటే.. రూ.1,100 కోట్ల సివిల్‌ సప్లయీస్‌ స్కామ్, మంత్రి పొంగులేటి కుమారిడికి అప్పజెప్పిన కొడంగల్ లిప్ట్ పనుల దాకా.. అడుగడుగునా వేల కోట్ల అవినీతే తాండవిచ్చింది. గోదావరి జలాలను మూసీకి తరలించే అంచనాలను రూ.1,100 కోట్ల నుంచి రూ.5,500 కోట్లకు అమాంతం పెంచేయడం మీ దోపిడీకి పరాకాష్ట. ఈ స్కాములే తాచుపాములై మీ కాంగ్రెస్ ను వెంటాడటం ఖాయమని ఘంటాపథంగా చెబుతున్నాను..'' అని పేర్కొన్నారు.

ప్రతి సందర్భంలో రాజ్యాంగ విలువలు వల్లెవేసే మీకు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి తన బావమరిదికి లబ్ది చేకూర్చిన సీఎంను తప్పించే దమ్ముందా అని ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న మీకు రాజ్యాంగాన్ని తాకే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ కు అధికారమిస్తే తెలంగాణకు అంధకారమేనని నిరూపించారన్నారు. ''ఉద్యమంలో కోట్లాది మందిలో స్ఫూర్తినింపిన తెలంగాణ తల్లి దివ్య, భవ్య స్వరూపాన్ని అవమానించి, ప్రజలపై కాంగ్రెస్ తల్లిని బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఒకప్పుడు బలిదేవత అని సోనియాగాంధీని తిట్టిపోసి, ఇప్పుడు చిల్లర పన్నాగాలకు తెరలేపాడు. తలరాతలు మారుస్తానని గద్దెనెక్కి తెలంగాణ తల్లిని, తెలంగాణ అస్తిత్వ ఆనవాళ్లను మార్చే కుటిల యత్నాలకు పాల్పడుతున్నాడు. ఈ నీచమైన, భావదారిద్య్ర చర్యలు భవిష్యత్తులో మీ పార్టీ మెడకే చుట్టుకోవడం ఖాయం. గత పదేళ్లు మేము తెలంగాణ పునర్నిర్మాణంపై దృష్టిపెట్టాం తప్ప.. పనికి మాలిన ఆలోచనలు చేయలేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పేర్లు మార్చలేదు, ఇందిరాగాంధీ విగ్రహాల జోలికి వెళ్లలేదు. కానీ మనసులో విషం తప్ప మెదడులో విషయం లేని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వ ఆనవాళ్లను చెరిపేసే దారుణ కుట్రకు తెరలేపాడు..'' అని వివరించారు.

తెలంగాణ అస్తిత్వ ఆనవాళ్లు చెరిపేసే కుట్రలో భాగంగా రేవంత్‌ రెడ్డి అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ తొలగించారని తెలిపారు. సెక్రటేరియట్‌ - అమరజ్యోతి మధ్య తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారని తెలిపారు. రేవంత్‌ తెరలేపిన వికృత రాజకీయ క్రీడకు ప్రతి స్పందనగా అసలైన తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై, తెలంగాణ సమాజంపైన ఉందన్నారు. ''ప్రజల ఆశీస్సులతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి సంస్థ పేరును మార్చడంతో పాటు సెక్రటేరియట్‌ ముందు ఏర్పాటుచేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీభవన్ కు సకల మర్యాదలతో సాగనంపుతామని నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా స్పష్టం చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ను మీ ముఖ్యమంత్రి ఇకనైనా మానుకుంటే మీకే మంచిది. చేతనైతే హామీలు అమలు చేయండి, లేదంటే తెలంగాణ ప్రజల ముందు లెంపలేసుకుని క్షమాపణలు కోరండి. అంతేకానీ, మేము పదేళ్లలో పెంచిన రాష్ట్ర సంపదను దోచుకుని, ఘనమైన తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను చెరిపేస్తామంటే సహించేది లేదు. మళ్లీ తెలంగాణను దశాబ్దాల సంక్షోభంలోకి నెట్టివేసి చేతులు దులుపుకుంటామంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు..'' అని స్పష్టం చేశారు.

First Published:  11 Dec 2024 6:58 PM IST
Next Story