Telugu Global
National

ఒత్తిడి లేకుండా చదివితేనే పరీక్షల్లో బాగా రాణించవచ్చు

'పరీక్షా పే చర్చా' సందర్భంగా విద్యార్థులతో ప్రధాని నరేంద్రమోడీ

ఒత్తిడి లేకుండా చదివితేనే పరీక్షల్లో బాగా రాణించవచ్చు
X

పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి ప్రధాని మోడీ ఏటా 'పరీక్షా పే చర్చా' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 8వ ఎడిషన్‌ పరీక్షా పే చర్చ వీడియోను సోమవారం ప్రధాని తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఢిల్లీలోని సుందరవనంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ప్రధాని విద్యార్థులతో మాట్లాడుతూ..ప్రశాంతంగా ఉండి పరీక్షలకు సిద్దం కావాలన్నారు. ఒత్తిడి లేకుండా చదివితేనే పరీక్షల్లో బాగా రాణించవచ్చన్నారు. విద్యార్థులు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో ఆరోగ్యకర ఆహారం అవసరమని, అనారోగ్యకర ఆహారాలు మిమ్మల్ని నీరసం చేస్తాయన్నారు. దినచర్య, అధ్యయన సమయం రూపొందించుకోవాలన్నారు. విద్యార్థులు విశ్రాంతికి తగిన సమయం కేటాయించాలన్నారు. చిరుధాన్యాల ప్రాధాన్యం గురించి ప్రధాని విద్యార్థులకు వివరించారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ప్రధాని మోడీ సూచనలు చేశారు.

ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్‌

ప్రతి విద్యార్థికి భిన్నమైన టాలెంట్‌ ఉంటుంది. కొంతమంది చదువులో ముందుంటారు. మరికొందరికి మంచి డ్రెస్సింగ్‌ స్టైల్‌ ఉంటుంది. విద్య సమగ్ర అభివృద్ధి కోసం ఉద్దేశించింది. విద్యార్థులు నాలుగు గోడలకే పరిమితం కాకూడదు. వారు తమ అభిరుచుల వైపు మళ్లేందుకు స్వేచ్ఛ అవసరం. పరీక్షలే సర్వస్వం అనే భావనలో జీవించకూడదు. పిల్లలకు సలహాలు ఇవ్వకూడదు. వారిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయో గమనించాలి. వారిలో ఉన్న విశిష్టమైన ప్రతిభను వెలికితీయాలి అని చిన్నారులు, టీచర్లకు మోడీ సూచించారు.

సమయ పాలన అన్నింటకంటే ముఖ్యం

సమయ పాలన అన్నింటకంటే ముఖ్యమన్నారు. మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో ఒక కాగితం మీద రాసుకోవాలి. ఏ పని కోసం ఎంత సమయం వెచ్చించాలో ఆలోచించుకోండి. మీకు ఇష్టమైన సబ్జెక్టుకు ఎక్కువ సమయం, ఇష్టం లేని దానికి తక్కువ సమయం కేటాయించొద్దు. దాన్ని భిన్నంగా చేయండి. కష్టమైన పాఠ్యాంశాన్ని ఒక సవాలుగా స్వీకరించండి అని సలహా ఇచ్చారు. స్నేహితుల్లో మంచి లక్షణాలు గమనించండి. దానివల్ల ప్రతి పనిలో సానుకూలతను చూసే అలవాటు పెరుగుతుంది. ఇక స్నేహితుల కష్టాలను అర్థం చేసుకోవడానికి వారితో మాట్లాడండి అన్నారు.

ఆశ్చర్యపోయిన ప్రధాని

కేరళ నుంచి వచ్చిన విద్యార్థి ఆకాంన్షా ప్రధాని మోడీని హిందీలో పలకరించారు. దాంతో ఆశ్చర్యపోయిన ఆయన ఇంత చక్కగా హిందీ ఎలా నేర్చుకున్నావంటూ ప్రశ్నించారు. నాకు హిందీ అంటే చాలా ఇష్టం.. నేనొక కవిత కూడా రాశానని దానిని చదివి వినిపించారు.

First Published:  10 Feb 2025 11:36 AM IST
Next Story