నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈ రోజు నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశల్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉండగా, వక్ఫ్ సహా 16 బిల్లులపై చర్చించనున్నారు. సభలో చర్చించేటువంటి అంశాలను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ముందుగానే పరిశీలిస్తారని తెలియజేశారు. వారు అనుమతించిన వాటి పైననే పార్లమెంటులో చర్చలు జరుగుతాయని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మహారాష్ట్రలో గెలుపుతో అధికార పక్షం జోష్ మీద ఉంది. కాగా అన్ని అంశాలపై ఉభయసభల్లో చర్చలు జరగాలని కోరుకుంటున్నామని, ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు తెలిపారు. అదానీ అంశంలో పట్టు బిగించాలని విపక్షం పట్టుదలతో ఉంది.
దీనిపై సమావేశాల్లో చర్చించాలని తాము అఖిలపక్షంలో డిమాండు చేసినట్లు లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగొయ్ వెల్లడించారు. ఈ కుంభకోణం అమెరికాలో బయటపడినందున దానిపై ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు. ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేయకుండా మణిపుర్ హింసపైనా సమాధానమివ్వాలని సూచించారు. ఈ నెల 26న ఉభయసభలకు సెలవు ఉంటుంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆ రోజు పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు .ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.సభా వ్యవహారాల సంఘం (బీఏసీ)లో నిర్ణయించిన అంశాల ప్రకారం మిగిలిన రోజుల్లో సమావేశాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పార్లమెంటరీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 30 పార్టీలకు చెందిన 42 మంది నేతలు హాజరయ్యారు.