బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఏర్పాటు కేసీఆర్ ప్రభుత్వ విజయమే
రీ ఆర్గనైజేషన్ యాక్ట్ లోని సెక్షన్ 89 తెచ్చిందే కాంగ్రెస్ : మాజీ మంత్రి హరీశ్ రావు
ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ -1956లోని సెక్షన్ 3 ప్రకారమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పంపకాల వాదనలు వింటామని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర ఆదేశాలు ఇవ్వడం నాటి కేసీఆర్ ప్రభుత్వ విజయమేనని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పదేళ్ల పాటు కేసీఆర్ సాగించిన నిర్విరామ పోరాట ఫలితమే బ్రిజేశ్ ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వులు అని చెప్పారు. ఇది కేసీఆర్ ప్రభుత్వం పట్టుబట్టి సాధించిన విజయమని చెప్పారు. కృష్ణా జలాల కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉండాలే తప్ప ప్రాజెక్టుల వారీగా ఉండకూడదని మొదటి నుంచి కేసీఆర్ చెప్తూ వచ్చారని.. ఇప్పుడు ట్రిబ్యునల్ ఆ వాదనతో ఏకీభవించడంతో తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపులో న్యాయం దక్కుతుందన్న ఆశాభావం కలిగిందన్నారు. కేసీఆర్ కొట్లాడి సాధించిన విజయాన్ని తమ ఘనతగా కాంగ్రెస్ చెప్పుకోవడం ఆ పార్టీ భావదారిద్య్రానికి నిదర్శనమన్నారు. అది కాంగ్రెస్ గొప్ప అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.
ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్, అందులోని సెక్షన్ 89ని నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే తెచ్చిందని గుర్తు చేశారు. కృష్ణా ప్రాజెక్టులు, నీటి కేటాయిపుల్లో నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తే దానిని సరిదిద్దడానికి పదేళ్ల కాలం పట్టిందన్నారు. నీటి వాటాల్లో తెలంగాణ హక్కులు సాధించేందుకు ఆనాడు కేసీఆర్ సీఎం హోదాలో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు హాజరై తెలంగాణ పక్షాన వాదనలు వినిపించారని, దీంతో తెలంగాణకు న్యాయం దక్కే అవకాశాలు మెరుగు పడ్డాయని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన నెల రోజులకే సీఎం కేసీఆర్ ఆదేశాలతో, ఆనాటి సాగునీటి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నదీ జలాల వివాదాల చట్టం 1956, సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ 2014 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారని గుర్తు చేశారు. కేంద్రం ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ చట్టానికి బదులుగా పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం విచారణ చేపట్టాలని ఆదేశించిందని, దానితో తెలంగాణకు న్యాయం జరగదని భావించే కేసీఆర్ ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ యాక్ట్ 1956లోని సెక్షన్ 3 ప్రకారం నీటి పంపకాల కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారని గుర్తు చేశారు.
ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ లోని సెక్షన్ 89 ప్రకారం తెలంగాణకు న్యాయం జరగదని గుర్తించే కేసీఆర్ ప్రభుత్వం 2015లోనే సుప్రీం కోర్టుకు వెళ్లిందని తెలిపారు. 2020 అక్టోబర్ లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ కేసీఆర్ ఇదే అంశంపై పట్టుబట్టారని తెలిపారు. కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గిన నాటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును విరమించుకునే షరతుపై ట్రిబ్యునల్ కు రిఫర్ చేయడానికి అంగీకరించారని గుర్తు చేశారు. తెలంగాణ కేసు విరమించుకున్న వెంటనే ట్రిబ్యునల్ కు రెఫర్ చేయాలని కేసీఆర్ పట్టుబడితే న్యాయ మంత్రిత్వ శాఖ సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని కేంద్ర మంత్రి అన్నారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి షెకావత్ ను మరోసారి ఢిల్లీలో కలిసిన తర్వాత ఆయన ఇచ్చిన హామీ మేరకే సుప్రీం కోర్టులో తెలంగాణ పిటిషన్ ను కేసీఆర్ విత్ డ్రా చేసుకునేందుకు కేసీఆర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. 2021 జూన్ లో సుప్రీం కోర్టులో తెలంగాణ పిటిషన్ వాపస్ చేసుకునేందుకు అభ్యర్థిస్తే అదే ఏడాది అక్టోబర్ లో సుప్రీం కోర్టు అందుకు సమ్మతించిందన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2023 అక్టోబర్ లో కృష్ణా జలాల పంపకాలను ట్రిబ్యునల్ కు అప్పగిస్తే కేంద్ర ప్రభుత్వం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ (టీవోఆర్) ఇచ్చిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ ఎన్నో వేదికలపై చేసిన చేసిన పోరాటంతోనే కేంద్రం ట్రిబ్యునల్ కు రెఫర్ చేసిందని.. కేసీఆర్ ప్రభుత్వం చేసిన వాదనను పరిగణలోకి తీసుకొనే బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ను కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు తేల్చే వరకు కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కావాలని పట్టుబట్టామని తెలిపారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో 575 టీఎంసీల నికర జలాల వాటా దక్కుతుందని కూడా ట్రిబ్యునల్ కు లిఖితపూర్వకంగా కేసీఆర్ ప్రభుత్వం స్టేట్‌మెంట్ ఆన్ కేస్ సమర్పించిందన్నారు. కేఆర్‌ఎంబీ సమావేశాల్లో, కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖల్లో, ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు తెలంగాణకు కృష్ణా జలాల్లో 50 శాతం వాటా ఇవ్వాలని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం డిమాండ్ చేస్తూనే వచ్చిందన్నారు. ఇప్పటికే పదేళ్ల విలువైన కాలం హరించుకుపోయిందని.. జస్టిస్ డిలైడ్.. జస్టిస్ డినైడ్ అనేది అందరికీ తెలిసిన న్యాయ సూత్రం అన్నారు.
తెలంగాణ దశాబ్దాలుగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను కోల్పోయిందని, సెక్షన్ 3 ప్రకారం విచారణ త్వరితగతిన పూర్తి చేసి న్యాయమైన వాటా వచ్చే తీర్పునివ్వాలని ట్రిబ్యునల్ ను బీఆర్ఎస్ పక్షాన కోరుతున్నామని తెలిపారు. సెక్షన్ 3 ప్రకారం కృష్ణా నదీజలాల కేటాయింపుల పై ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకటించిన నేపథ్యంలో పటిష్టమైన వాదనలు వినిపించేలా నిష్ణాతులైన న్యాయవాదులను ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నామన్నారు. సెక్షన్ 3 ప్రకారం వాదనలు వినేందుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పాక్షిక విజయమే అని, తెలంగాణకు కృష్ణా నదీ జలాల్లో న్యాయమైన వాటా దక్కితేనే అంతిమ విజయం సాధించినట్లవుతుందన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగురకతతో అంతిమ ఫలితాన్ని రాబట్టేలా కృషి చేయాలన్నారు.
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత రైతుల పాలిట శాపంలా మారిందని, కాలువలు తవ్వితే రైతుల పొలాలకు నీళ్లిచ్చే అవకాశమున్నా ఆ ప్రాజెక్టును రేవంత్ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దుర్మార్గం అన్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పజెబుతూ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తే తప్ప రేవంత్ ప్రభుత్వం మార్చుకోలేదని గుర్తు చేశారు. నీటి కేటాయింపుల కోసం కృషి చేస్తూనే ప్రాజెక్టుల కింద యాసంగిలో తగిన నీటిని ఇవ్వాలని కోరారు. గత యాసంగిలో నీళ్లు లేక పంటలు ఎండిపోయిన పరిస్థితినే రేవంత్ ప్రభుత్వం పునరావృతం చేస్తే అది రైతాంగం పాలిట చేసిన ద్రోహం లాగానే భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిరుడు యాసంగిలా పంటలు ఎండిపోతే అందుకు ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖనే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృష్టి చేయాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, నీటి వాటా కోసం రాజీలేని పోరాటం చేయడానికి బీఆర్ఎస్ సిద్దమని ప్రకటించారు.