Telugu Global
National

రేవంత్‌ దిక్కుమాలిన ఓట్ల రాజకీయం పక్కన పెట్టు

తెలంగాణలో పెరుగుతోన్న ఉన్మాదాన్ని అణచకపోతే ప్రపంచానికే ముప్పు

రేవంత్‌ దిక్కుమాలిన ఓట్ల రాజకీయం పక్కన పెట్టు
X

రేవంత్‌ రెడ్డి దిక్కుమాలిన ఓట్ల రాజకీయం పక్కన పెట్టు అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్‌ కుమ్మరగూడ ముత్యాలమ్మ గుడిని ఆయన సందర్శించి మాట్లాడారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు సిటీలో మీటింగ్‌ పెడితే ఇంటెలిజెన్స్‌ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీస్‌ ఆఫీసర్‌ కృష్ణప్రసాద్‌ బాంబు దాడిలో చనిపోయారని.. లుంబిని పార్క్‌, గోకుల్‌ చాట్‌, సాయిబాబా గుడి దగ్గర బాంబులు పేల్చితే ఎగిరి పడ్డ మాంసం ముద్దులు గుర్తుకు లేవా అని మండిపడ్డారు. అలాంటి దుర్మార్గులకు ఆశ్రయమిస్తే.. రక్తం మరిగిన పులుల లెక్క అందరిపైనా దాడి చేస్తారని హెచ్చరించారు. ఉన్మాదులకు కులం, మతంతో సంబంధం ఉండదని.. ఈ ఉన్మాదాన్ని అణచకపోతే ప్రపంచానికే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లను ఉపేక్షిస్తే చరిత్ర క్షమించదన్న సంగతి రేవంత్‌ గుర్తించాలన్నారు. తాము గోవులను పూజించే సాదువలమని.. తమ నియంత్రించాలనే ప్రయత్నాలు మాని దుర్మార్గులను నియంత్రించడంపై దృష్టి సారించాలన్నారు.

రాష్ట్రంలో ఇటీవల వరుసగా ఆలయాలపై దుర్మార్గుల దాడులు కొనసాగుతున్నాయని ఈటల అన్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనే కోణంలో వెంటనే విచారణ ప్రారంభించాలన్నారు. అమ్మవారి గుండెల మీద తన్నినవాడు హాస్పిటల్‌ బెడ్‌ పై దర్జాగా పడుకొని చాటింగ్‌ చేస్తున్నాడని, అవమానించేలా పోస్టులు పెడుతున్నాడని అన్నారు. ఆ వ్యక్తి చేతిలోకి సెల్‌ ఫోన్‌ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ దాడులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. ఏ మతం కూడా ఇలాంటి చర్యలను సమర్థించబోదన్నారు. హైదరాబాద్‌ కు ఎవరు వచ్చినా అక్కున చేర్చుకుంటామని.. మనం ఏ దేశానికి వెళ్లినా భారతీయులకు గొప్ప మర్యాద ఇస్తారని తెలిపారు. నగర సీపీ సీవీ ఆనంద్‌ కు సిటీపై సంపూర్ణమైన అవగాహన ఉందని, ఆయన హైదరాబాద్‌ క్షేమం కోరేవారని అన్నారు. ఈ ఘటనలను కేవలం విగ్రహ ధ్వంసం కోణంలోనే చూడవద్దన్నారు. ఈ ఘటనలపై ఇంటెలిజెన్స్‌ బ్యూరో నిఘా పెట్టిందన్నారు. రాజకీయాలు ముఖ్యం కాదు.. దేశ రక్షణే ముఖ్యమని.. రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకపోతే కేంద్రం జోక్యం చేసుకోక తప్పదని తేల్చిచెప్పారు. ఈ ఘటనలపై రేవంత్‌ తాత్సారం చేస్తే అమాయక ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ లో శిక్షణ పొంది ఇక్కడ పని చేస్తున్న వారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా గుడిపై చేయి వేయాలంటే గజ్జుమనేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

First Published:  18 Oct 2024 10:16 AM GMT
Next Story