ఫ్రీ బస్సుపై మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఆర్టీసీ బస్సుల్లో రాయితీలు, ఉచితాలపై మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఉచిత ఆర్టీసీ బస్సు పథకంపై మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రీ బస్సు ఇచ్చుకుంటూ వెళితే ఆర్టీసీని భారం అవుతుందని మంత్రి అన్నారు. మహారాష్ట్రలోని ధారాశివ్‌లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, 75 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇస్తోన్న రాయితీతో సంస్థకు రోజూ రూ.3 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ నూతన రాయితీలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇప్పటికే, ఆర్టీసీల్లో మహిళలకు 50 శాతం రాయితీ, 75 ఏళ్లు పైబడిన వారికి రాయితీ ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ పథకాలతోనే ఆర్టీసీకి నష్టం వస్తోందని వెల్లడించారు. ఇలా అన్నింటా రాయితీలు ఇచ్చుకుంటూ వెళితే సంస్థను నడపలేమని మంత్రి ప్రతాప్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా జీరో టికెట్ ద్వారా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు