ప్రతి అంశంలో రాష్ట్రాలను పోల్చిచూడటం సరికాదు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ప్రతి అంశంలోనూ ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో పోల్చిచూడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం కేరళలోని కొచ్చిలో నిర్వహించిన టైకాన్ కేరళ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుందని.. దానికి అనుగుణంగా ప్రాధాన్యతలు గుర్తించి వాటి ఆధారంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో అద్భుతంగా పురోగమిస్తున్నాయని, వాటి అనుభవాల నుంచి తగిన పాఠాలు నేర్చుకుంటే మరింత ప్రగతి సాధ్యమవుతుందన్నారు. కేరళ సాధించిన సామాజిక, ఆర్థిక ప్రగతిని ఆధారంగా తీసుకొని అనేక అంశాలను నేర్చుకోవచ్చని తెలిపారు. కేరళలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ కోసం తన వ్యక్తిగత హోదాలో మద్దతిస్తానని తెలిపారు. హైదరాబాద్‌లోని దిగ్గజ పారిశ్రామిక సంస్థలు, యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో తనకున్న పరిచయాలను కేరళ వృద్ధికి దోహద పడేలా ఉపయోగిస్తానని తెలిపారు. మలయాళీలది స్వతహాగా కష్టపడే తత్వమని.. ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా కనిపించే కేరళ పారిశ్రామికవేత్తలను చూస్తే అది అర్థమవుతుందన్నారు.