అదానీని అరెస్ట్ చేస్తే..ప్రధాని మోదీ పేరు బయటికి వస్తుంది : రాహుల్ గాంధీ
లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీని అరెస్ట్ చేసి, విచారిస్తే ప్రధాని మోదీ పేరు బయటకి వస్తుందని కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ ఫండింగ్ వ్యవహారం మొత్తం అదానీ చేతుల్లోనే ఉందని అందుకే అదానీ ప్రధాని అరెస్ట్ చేయలేదని రాహుల్ ఆరోపించారు.సెబీ చీఫ్ మాధభి పురీ బచ్‌పైనా విచారణ జరిపించాలన్నారు. శీతకాల పార్లమెంట్ ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. ఆయనను రక్షిస్తున్న సెబీ చీఫ్‌ను ఆ పదవి నుంచి తొలగించి ఆమె పైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంబంధం లేకుండా విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ కోరారు.
‘‘అదానీ అరెస్టు కాడని, ఆయనపై విచారణ జరగదని నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఆయన్ను మోదీ కాపాడుతున్నారు’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. మరోవైపు అమెరికాలో లంచం ఆరోపణలపై అదానీ గ్రూపు స్పందించింది. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ తమ సంస్థపైన చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. ఈ అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. తమ సంస్థ పూర్తి పారదర్శకతతో నిబంధనలు పాటిస్తుందని వెల్లడించింది. వాటా దారులు, ఉద్యోగులు, భాగస్వాములు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపింది. తాము చట్టాలకు కట్టుబడి ఉంటామని ప్రకటించింది. ఈ ఆరోపణలు తమ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమని పేర్కొంది.