ఢిల్లీ ప్రజల తీర్పును గౌరవిస్తాను : కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలపై మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలపై మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి స్వీకరిస్తామని ఆయన అన్నారు. విజయం సాధించిన బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నానని క్రేజీవాల్ అన్నారు. మేము కేవలం ప్రతిపక్ష పాత్రనే కాకుండా, ప్రజల కష్ట సుఖల్లో పాలుపంచుకుంటామని కేజ్రీవాల్ అన్నారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ఈ ఫలితాలతో తన స్ఫూర్తి దెబ్బతింటుందని భావించడంలేదని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా పోరాడిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కేజ్రీవాల్ వివరించారు. గత పదేళ్లలో ఢిల్లీలో తాగునీరు, విద్యుత్ సహా అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చామని వెల్లడించారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల వెంటే ఉంటామని పేర్కొన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఓ వీడియో సందేశం వెలువరించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు అధికార ఆప్ కు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి అగ్రనేతలు ఓటమిపాలయ్యారు. వారంతా కాషాయ పార్టీ హవాలో కొట్టుకుపోయారు.