Telugu Global
National

హరీశ్‌కు హైకోర్టులో ఊరట

పంజాగుట్ట పీఎస్‌లో ఆయనపై నమోదైన కేసులో అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశం

హరీశ్‌కు హైకోర్టులో ఊరట
X

మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. హరీశ్‌ను అరెస్టు చేయవద్దని హైకోర్దు ఆదేశాలు జారీ చేసింది. పంజాగుట్ట పీఎస్‌లో ఆయనపై నమోదైన కేసు విషయంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసులో పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని పేర్కొన్నది. దర్యాప్తునకు హరీశ్‌ సహకరించాలని సూచించింది. హరీశ్‌రావుపై ఫిర్యాదు చేసిన చక్రధర్‌గౌడ్‌కు నోటీసులు జారీ చేస్తూ.. విచారణను వాయిదా వేసింది.

హైదరాబాద్‌ పంజగుట్ట పీఎస్‌లో స్థిరాస్థి వ్యాపారి జి. చక్రధర్‌గౌడ్‌ రాజకీయ కక్షతో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమైదన కేసును కొట్టివేయాలని కోరుతూ హరీశ్‌రావు బుధవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారంటూ తనతోపాటు రాధాకిషన్‌రావు తదితరులపై చక్రధర్‌గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలపై పోలీసులు ప్రాథమిక విచారణ జరపకుండానే కేసు నమోదు చేశారన్నారు. ఫిర్యాదులో తనకు వ్యతిరేకంగా ఏమీ లేదని, దాన్ని కట్టుకథలో దాఖలు చేశారన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అరెస్టు చేస్తే తన రాజకీయ జీవితంతో పాటు ప్రతిష్ఠ దెబ్బతింటాయన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అనేది ఎప్పుడో జరిగిన సంఘటన అని, ఇంతవరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. ఆయన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది.

First Published:  5 Dec 2024 11:42 AM IST
Next Story