రాహుల్ గాంధీపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత రూ.100 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మహారాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే రూ.100 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపించారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ తనపై చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ , ఆ పార్టీ ప్రతినిధి సుప్రియ శ్రీనతేలకు పరువునష్టం నోటీసులు పంపారు. తావ్డే తరఫు న్యాయవాది ఈ నోటీసులు పంపారు. కాంగ్రెస్ నేతలు ముగ్గురూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే వారిపై రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తామని ఆ నోటీసు పేర్కొంది.
మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలకు కొన్ని గంటల ముందు అధికార, విపక్షాల మధ్య హైడ్రామా నడిచింది. పాల్‌ఘర్ జిల్లాలోని విరార్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్లో బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారని బహుజన్ వికాస్ అఘాడి పార్టీ ఆరోపించింది. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని వినోద్ తావ్డే, ఇతర బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నట్లు అసత్యాలు ప్రచారం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఎన్నికలను ప్రభావితం చేయడానికి బీజేపీ డబ్బులు పంచుతోందని ఆరోపించింది. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలకు వినోద్ తావ్డే పరువు నష్టం నోటీసులు ఇచ్చారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని తావ్డే డిమాండ్ చేశారు.