రంగరాజన్ కు సీఎం రేవంత్ ఫోన్
దాడి గురించి ఆరా తీసి పరామర్శించిన ముఖ్యమంత్రి
చిలుకూరు బాలజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ కు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఫోన్ చేశారు. ఫోన్‌లో రంగరాజన్ ను పరామర్శించిన సీఎం ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాడి ఘటన గురించి వివరాలు అడిగారు. ఇలాంటి దాడులను తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇదివరకే పోలీసులకు ఆదేశాలు ఇచ్చానని తెలిపారు.
రామరాజ్యం పేరుతో దాడులేమిటి : మంత్రి శ్రీధర్ బాబు
రామరాజ్యం పేరుతో దాడులేమిటని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడిని ఆయన ఖండించారు. కొందరు హిందుత్వ భావాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఇలాంటి వారి విషయంలో పోలీసులు, రాజకీయ పార్టీలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాముడి పేరును బద్నాం చేస్తూ అరాచకాలకు పాల్పడటం క్షమించరాని నేరమన్నారు. దాడి చేసిన వారిపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.