ఇండియా కూటమికి బీటలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు టీఎంసీ మద్దతు
లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమిని నిలువరించేందుకు కలిసికట్టుగా శ్రమించిన ఇండియా కూటమి కొద్ది కాలానికే బీటలువారింది. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ తప్పిదాలతో కూటమి భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యుత్సాహంతో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు ఆఫర్ ను రాహుల్ తిరస్కరించారు. ఖచ్చితంగా గెలిచి తీరుతామని లెక్కలు వేసుకున్నారు. స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో భారీ విజయం దక్కించుకున్న ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడింది. ఈ నేపథ్యంలో రాహుల్ నాయతక్వ పటిమపై కూటమి పార్టీల నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ఇండియా కూటమి విచ్ఛిన్నం దిశగా అడుగులు వేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయిన పోత్తు ధర్మంలో భాగంగా ఆప్ లోక్‌సభ సీట్లు ఇచ్చి సహకరించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తుకు నిరాకరించడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అలయన్స్ కు అర్వింద్ కేజ్రీవాల్ నో చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒంటరిపోరుకు సిద్ధమైంది. ఆ పార్టీకి ఇండియా కూటమిలోని మిగతా రాజకీయ పక్షాలు కూడా అండగా నిలిచే అవకాశాలేమి కనిపించడం లేదు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ లేకుంటే కలిసి పని చేసేందుకు తాము సిద్ధమని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇది వరకే ప్రకటించారు. దీంతో రానున్న రోజుల్లో ఇండియా కూటమి భవిత్యవం ఎలా ఉండబోతుందన్న చర్చ మొదలైంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా రెండు పర్యాయాలు ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 5న జరిగే అసెంబ్లీ పోరులో వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే ప్రయత్నాల్లో చీపురు పార్టీ ఉంది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని అర్వింద్ కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ప్రకటించినందుకు థ్యాంక్యూ దీదీ అని తన ఎక్స్ ఎకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఇండియా కూటమిలో సమాజ్‌వాదీ పార్టీ శివసేన (ఉద్దవ్ బాలాసాహెబ్) పార్టీలు కేజ్రీవాల్ కు మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు దీదీ కూడా కేజ్రీకే జై కొట్టారు. ఢిల్లీ అసెంబ్లీలో 70 నియోజకవర్గాలు ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ 2015లో 67, 2020లో 62 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఫిబ్రవరి 5న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ ఉందని చెప్తోన్నా ఆప్, బీజేపీలే ముఖాముఖి తలపడుతున్నాయి. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఖాతా తెరవలేదు. ఈ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించి పరువు నిలబెట్టుకోవాలనే ప్రయత్నాల్లో హస్తం పార్టీ ఉంది.