మహారాష్ట్రలో 25 మందితో బీజేపీ మూడో జాబితా విడుదల
మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలకు థర్డ్ లిస్ట్‌ను బీజేపీ విడుదల చేసింది. 25 మంది అభ్యర్థుల లిస్ట్‌ను సోమవారం ప్రకటించింది.
మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలకు థర్డ్ లిస్ట్‌ను బీజేపీ విడుదల చేసింది. 25 మంది అభ్యర్థుల లిస్ట్‌ను సోమవారం ప్రకటించింది. ముంబైలోని మూడు సీట్లలో పోటీ చేసే వారి పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఘట్‌కోపర్ ఈస్ట్ నుంచి పరాగ్ షా, వెర్సోనా నుంచి భారతి లవేకర్, బోరివాలి నుంచి సంజయ్ ఉపాధ్యాయ్‌ను ముంబై నుంచి పోటీకి నిలిపింది.కాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేపై స్థానిక నేత అవినాష్ బ్రహ్మాంకర్‌ను కమలం పార్టీ బరిలోకి దించింది. అస్తి స్థానం నుంచి సురేష్ ధాస్, మల్షిరాస్ నుంచి సత్పుటే, లాతూర్ సిటీ నుంచి అర్చన చకుర్కర్, వాసాయి నుంచి స్నేహ దుబే, డెగ్లూర్ నుంచి జితేష్ అంతపుర్కర్, సావ్నర్ నుంచి ఆశిష్ దేశ్ ముఖ్ వంటి ప్రముఖ నేతలు బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు.
ఆర్వీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నేత, దేవేంద్ర ఫడ్నవీస్ వ్యక్తిగత సహాయకుడిగా అనేక సంవత్సరాలు పనిచేసిన సుమిత్ వాంఖడే బరిలోకి దిన్నారు. 2019లోనూ ఫడ్నవీస్ మాజీ పీఏ అభిమన్యు పవార్‌కు అవుసా నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వగా.. ఆయన గెలుపొందారు.మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాలను విడుదల చేయడంలో బీజేపీ ముందున్నది. గత వారం విడుదల చేసిన తొలి జాబితాలో అత్యధికంగా 99 మంది అభ్యర్థులున్నారు. శనివారం రిలీజ్ చేసిన రెండో జాబితాలో 22 మంది అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరుగనున్నది. నవంబర్ 23న జార్ఖండ్‌తోపాటు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.