క్యాన్సర్ కు కారణమయ్యే వాటికి దూరంగా ఉండండి
రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్యాన్సర్ డేకేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్న ప్రధాని

ప్రజలు క్యాన్సర్‌కు కారణమయ్యే సిగరేట్, బీడీ, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌లో భాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ...దేశం తనకు ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిందన్న ప్రధాని.. సబ్ కా సాథ్ సబ్‌కా వికాస్ మంత్రంపై దృష్టి సారించానన్నారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహాకుంభమేళా దేశ ఐక్యతకు చిహ్నంగా భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. కోట్లాదిమంది తరలివస్తున్న మహాకుంభమేళాలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు.
భారతదేశ మత, సాంస్కృతిక సంప్రదాయాలను వ్యతిరేకిస్తున్న వారిపై ప్రధాని విమర్శలు గుప్పించారు. ఇటీవల కాలంలో ప్రజలను విభజించే నేతల గుంపును చూస్తున్నాం. అనేకసార్లు విదేశీశక్తులు కూడా ఈ వ్యక్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశాన్ని బలహీనపరచడానికి యత్నిస్తున్నారు. హిందూ విశ్వాసాన్ని ద్వేషించే వ్యక్తులు శతాబ్దాలుగా ఏదో ఒక దశలో ఉంటున్నారు. బానిస మనస్తత్వం కలిగిన వ్యక్తులు మన విశ్వాసాలు, నమ్మకాలు, ఆలయాలు, మతం, సంస్కృతి, సూత్రాలపై దాడి కొనసాగిస్తున్నారు. వీరు మన పండుగలు, సంప్రదాయాలు, ఆచారాలను దుర్వినియోగం చేస్తారు. మన సమాజాన్ని విభజించడం, తద్వారా ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే వారి అజెండా. ఇలాంటి సమయంలో ఎంతోకాలంగా ఐక్యతా మంత్రం గురించి అవగాహన కల్పిస్తున్న ధీరేంద్ర శాస్త్రి... ప్రజల ప్రయోజనాల కోసం పదెకరాల్లో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించడం గొప్ప విషయం. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్యాన్సర్ నియంత్రణకు పలు ప్రకటనలు చేశాం. క్యాన్సర్ ఔషధాలు మరింత చౌకగా లభించేలా నిర్ణయం తీసుకున్నాం. రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్యాన్సర్ డేకేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం అని మోడీ అన్నారు.