కెన్యాలో అప్రమత్తంగా ఉండండి - భారతీయులకు కేంద్రం కీలక సూచన
నైరోబీలో నిరసనకారులు, పోలీసులతో జరిగిన ఘర్షణల్లో 10 మంది చనిపోయారు. ఈ కాల్పుల్లో 50 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మంగళవారం అడ్వైజరీని జారీ చేసింది.
పన్నుల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా కెన్యాలో తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వేలాది మంది ప్రజలు మంగళవారం పార్లమెంటు సముదాయంలోకి ప్రవేశించారు. దేశవ్యాప్త నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో కెన్యాలోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేకుంటే బయటకు రావొద్దని సూచించింది.
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన కెన్యాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొనివున్నాయి. పన్నుల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా కెన్యాలో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. ప్రజల దాడుల్లో పార్లమెంటు భవనంలోని కొన్ని విభాగాలు ధ్వంసమయ్యాయి. దీంతో కెన్యా పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు నిరసనకారులు మరణించగా, డజన్ల కొద్దీ గాయపడ్డారు. మరోవైపు నైరోబీలో నిరసనకారులు, పోలీసులతో జరిగిన ఘర్షణల్లో 10 మంది చనిపోయారు. ఈ కాల్పుల్లో 50 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మంగళవారం అడ్వైజరీని జారీ చేసింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, కెన్యాలోని భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు పని ఉంటేనే బయటకు రావాలని సూచించారు. కెన్యాలో నివసిస్తున్న భారత పౌరులు స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని సూచించింది. ఇక అప్‌డేట్స్ కోసం భారత కాన్సులేట్ మిషన్ వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఫాలో కావాలని పేర్కొంది.
కెన్యాలో ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు మొదటి నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పన్ను సంస్కరణల పేరుతో బ్యాంకు అకౌంట్ లలో నగదు లావాదేవీలపై, డిజిటల్ అకౌంట్ చెల్లింపులపై, వంట నూనె, ఉద్యోగుల వేతనాలు, మోటారు వాహనాలపై పన్నులు పెంచుతూ కెన్యా ప్రభుత్వం మనీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఆ బిల్లును ఆమోదించవద్దని చట్టసభ్యుల్ని కోరుతూ నిరసనకారులు పార్లమెంటును చుట్టుముట్టారు. ఈ ఆందోళనలు ఇప్పుడు ఉధృత రూపం దాల్చి.. దేశమంతటా విస్తరించాయి. ఇంత ఆందోళనలో కూడా పార్లమెంట్‌లో పన్నుల పెంపు బిల్లుకు ఆమోదం లభించింది.