Telugu Global
International

ఉద్యోగాలయినా వదిలేస్తాం.. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాల్సిందే

మిగతా రంగాల్లో ఉద్యోగులు.. కంపెనీలకు వెళ్తున్నా ఐటీరంగంలో మాత్రం ససేమిరా అంటున్నారు. ఇంటినుంచే పనిచేస్తామని తెగేసి చెబుతున్నారు.

ఉద్యోగాలయినా వదిలేస్తాం.. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాల్సిందే
X

కరోనా కాలంలో చాలామంది ఆఫీస్ లకి వెళ్లకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో విధులు నిర్వహిస్తున్నారు. వారందర్నీ ఒక్కసారిగా తిరిగి ఆఫీస్ లకు రమ్మంటే కాస్త ఇబ్బంది పడ్డారు. హైబ్రిడ్ మోడ్ కి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. రేపు ఫుల్ టైమ్ ఆఫీస్ కి రావాలన్నా వారికి పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ, కెరీర్ ని వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో మొదలు పెట్టినవారికే ఇప్పుడు అసలు సమస్య.

కరోనా కాలంలో ఉద్యోగాలు సంపాదించిన ఫ్రెషర్స్.. ఇంటినుంచే పని మొదలు పెట్టారు, దానికే అలవాటు పడ్డారు. ఇప్పుడు వారందర్నీ ఆఫీస్ లకి రావాలని పిలిస్తే కుదరదంటున్నారు. వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే కావాలంటున్నారు.

ఇలాంటివారు ఉద్యోగాలను సైతం వదిలేసుకోడానికి సిద్దంగా ఉన్నారని, తమకి నచ్చినట్టు ఇంటినుంచి పని చేసుకునే వెసులుబాటు ఇచ్చిన కంపెనీలకు దరఖాస్తులు చేస్తున్నారని అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నివేదిక చెబుతోంది. ఈ నివేదిక ప్రకారం కరోనా కాలంలో ఉద్యోగాల్లో చేరి ఇంటినుంచి పని చేస్తున్న ఫ్రెషర్స్ కి ఆఫీస్ కి వెళ్లడం ఇష్టం లేదని తేలింది.

ఆఫీస్ లకు రండి..

కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలైనా.. కొవిడ్ కేసులు తగ్గిన తర్వాత హైబ్రిడ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి కంపెనీలు. వారంలో 2 రోజులు ఆఫీస్ కి రావాలనే నిబంధన పెట్టాయి. కానీ అది కంపల్సరీ కాదు. ఇప్పుడిక పూర్తిగా అందర్నీ ఆఫీస్ లకు రావాలని చెబుతున్నాయి.

2022 మధ్య నుంచి ఆఫీస్ విధానాన్ని అమలులోకి తెచ్చాయి. మిగతా రంగాల్లో ఉద్యోగులు.. కంపెనీలకు వెళ్తున్నా ఐటీరంగంలో మాత్రం ససేమిరా అంటున్నారు. ఇంటినుంచే పనిచేస్తామని తెగేసి చెబుతున్నారు. ఫ్రెషర్స్ మాత్రం కంపెనీలకు ఆప్షన్ కూడా ఇవ్వడంలేదు. ఆఫీస్ రావడం తప్పనిసరి అయితే ఉద్యోగం మానేస్తామంటున్నారు.

తగ్గుతున్న ఉత్పాదకత..

వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగుల పనితీరు ఎలా ఉందనే విషయం పక్కనపెడితే.. సమన్వయం కుదరక ఉత్పాదకత తగ్గిపోతుందని కొన్ని కంపెనీలు లబోదిబోమంటున్నాయి. దీనికితోడు ఇటీవల ఆర్దిక మాంద్యం ప్రభావంతో ఉన్న ఉద్యోగాల్లోనే కోతలు మొదలయ్యాయి. మిగిలిన ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు కంపెనీలు తమ సిబ్బందిని తిరిగి ఆఫీస్ లకు రావాలని కోరుతున్నాయి.

అయితే, చాలామంది ఉద్యోగులు ఇంటి దగ్గర ఉండి పనిచేసే విధానానికి అలవాటుపడి ఆఫీస్ లకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. ఈ విధానం ఇష్టం లేని ఉద్యోగులు రాజీనామా చేసినా కంపెనీలు లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులు ఆఫీస్ లకు వస్తారా లేదా ఉద్యోగం మానేస్తారా అని కొన్ని కంపెనీలు సీరియస్ గా అడేగేస్తున్నాయి.

First Published:  16 April 2023 12:55 AM GMT
Next Story