Telugu Global
NEWS

2 లక్షల ఉద్యోగాలిచ్చినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరదు

త్వరలో 35 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తాం : సీఎం రేవంత్‌ రెడ్డి

2 లక్షల ఉద్యోగాలిచ్చినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరదు
X

తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని తమ ప్రభుత్వం గుర్తించిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరదన్నారు. అందుకే యువతలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మాసబ్‌ ట్యాంక్‌ లోని జేఎన్‌టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) శిక్షణ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించి మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగ నియామకాలు పూర్తి చేసి నియామక పత్రాలు అందజేశామన్నారు. త్వరలోనే 35 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ లు ఇస్తామన్నారు. రాబోయే రెండు, మూడు నెలల్లోనే వీటి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో గడిచిన పదేళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించలేదన్నారు. రాష్ట్రంలో ఏటా 3 లక్షల మంది డిగ్రీలు పూర్తి చేసి పట్టాలు తీసుకొని బయటకు వస్తున్నారని, వారిలో ఇండస్ట్రీ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేవన్నారు. అందుకే యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. యువతకు గత పదేళ్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక కొంత మంది గంజాయి, డ్రగ్స్‌ కు బానిసలయ్యారని, వారిలో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ ఉండటం ఆందోళనకరమైన విషయం అన్నారు. వాటిని నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

యువతను వ్యవసనాల నుంచి బయట పడేయాలంటే వారికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 65 ఐటీఐలను టాటా టెక్నాలజీస్‌ సహకారంతో అడ్వాన్డ్స్‌ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని తెలిపారు. రానున్న రెండేళ్లలో అన్ని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తామన్నారు. కనీస ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్‌ కాలేజీల అనుమతులు రద్దు చేస్తామన్నారు. పాలిటెక్నిక్‌ లను అప్‌ గ్రేడ్‌ చేస్తామన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. హైదరాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడమే కాదు.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కు కేరాఫ్ గా మార్చుతామని, సాంకేతిక నైపుణ్యానికి హైదరాబాద్ డెస్టినేషన్ కావాలన్నదే తమ లక్ష్యమన్నారు. వచ్చే ఏడాది స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, స్పోర్ట్‌ అకాడమీలు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో చదివిన వాళ్లు ప్రపంచంలోనే పెద్ద సంస్థలకు సీఈవోలుగా పని చేస్తున్నారని తెలిపారు. వారి సహకారం తీసుకొని హైదరాబాద్‌ ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామన్నారు.

First Published:  25 Sept 2024 10:59 AM GMT
Next Story