ఎల్‌నినో ఎఫెక్ట్.. ఈ వేసవి మరీ హాట్ గురూ!
ఉత్తర, మధ్య భారతంలో వడగాలుల తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర వెల్లడించారు.
ఎల్‌నినో ఎఫెక్ట్ ఈ ఏడాదీ దక్షిణాది రాష్ట్రాలను వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి చేయబోతోంది. ఈ వేసవి భానుడి మంటలతోనే మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది.
తెలంగాణ, ఏపీలో వడగాలులు
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలతో మహారాష్ట్ర, ఒడిశాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, ఒడిశాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
వేసవి పూర్తయ్యే వరకు ఎల్‌నినో
ఉత్తర, మధ్య భారతంలో వడగాలుల తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర వెల్లడించారు. మార్చి నుంచి మే వరకు దేశంలో చాలాచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఎల్‌నినో ఎఫెక్ట్ ఈ వేసవి పూర్తయ్యే వరకు ఉంటుందని, ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆయన చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో గత సంవత్సరం వర్షాకాలం, శీతాకాలంలోనూ ఎండలు మండిపోయాయి. ఈ నేపథ్యంలో వేసవి తర్వాత పరిస్థితులు సాధారణంలోకి రావచ్చన్న మాటలే కాస్త ఊరట.