Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Tuesday, September 23
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    కాంగ్రెస్‌ ఏడాది పాలనపై బీఆర్‌ఎస్‌ ఛార్జ్‌షీట్‌

    By Raju AsariDecember 8, 202416 Mins Read
    కాంగ్రెస్‌ ఏడాది పాలనపై బీఆర్‌ఎస్‌ ఛార్జ్‌షీట్‌
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    సీఎం రేవంత్ రెడ్డి అపరిపక్వ వైఖరితో తెలంగాణ ప్రగతి మసకబారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సీఎం నిర్వహిస్తున్న శాఖల్లోనూ పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఏడాది పాలనపై బీఆర్‌ఎస్‌ ఛార్జ్‌షీట్‌ను తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విమర్శించారు.ఏడాది పాలన చూస్తే.. ఏమున్నది గర్వకారణం..? కాంగ్రెస్ పాలన సమస్తం.. ప్రజాపీడన పరాయణత్వం. బడి పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందర్నీ నడిరోడ్డు మీదికి ఈడ్చిన కాంగ్రెస్ సర్కార్ అని హరీశ్‌ మండిపడ్డారు.

    ముగ్గురు మంత్రులున్నా.. ఖమ్మంలో వరద సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తుంటే రాళ్ల దాడి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైంది. అశాంతి, అలజడితో రాష్ట్రంలో అట్టుడుకున్నది. కాంగ్రెస్‌ హయాంలో 9 చోట్ల మతకలహాలు జరిగాయి. హైడ్రా పేరుతో కూల్చివేతలు ప్రారంభించి అరాచకం సృష్టించారని ధ్వజమెత్తారు. మద్యం అమ్మకాలు పెంచాలని మెమోలు ఇచ్చారు. గాంధీభవన్‌లో ఇచ్చే సూచనల ఆధారంగా చట్టాలు చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. 

    కాంగ్రెస్‌ ఏడాదిపై పాలనపై బీఆర్‌ఎస్‌ రిలీజ్‌ చేసిన ఛార్జ్‌షీట్‌ లింక్‌

    https://www.teluguglobal.com/pdf_upload/brs-chargesheet-congress-failures–1384298.pdf

    హరీశ్‌రావు పూర్తి ప్రసంగం

    ఏడాది పాలన – ఎడతెగని వంచన

    • ఏడాది పాలన చూస్తే.. ఏమున్నది గర్వకారణం..? కాంగ్రెస్ పాలన సమస్తం.. ప్రజాపీడన పరాయణత్వం..

    • ప్రజాస్వామ్య పాలన అని, భావ ప్రకటనా స్వేచ్ఛ అని, నిరసన తెలిపే హక్కులను కాపాడుతామని అభయహస్తం మేనిఫెస్టో మొదటి పేజీ, మొదటి లైనులో హామీ ఇచ్చిన్రు.

    • సోనియమ్మ ఆరు గ్యారెంటీలు ఇస్తే… నేను ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తాన్నడు.

    • తీరా చూస్తే ఏడాది పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది.

    • భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లింది

    • నిరసన తెలిపే హక్కు లేదు, నిరంకుశత్వమే మిగిలింది.

    • తెలంగాణ ఉద్యమంలో కూడా ఎరుగని నిర్బంధ కాండను రుచి చూపిస్తున్నడు.

    • స్కూళ్ల ముందు పోలీసు పికెట్లు, హాస్టళ్ల ముందు పోలీసు పికెట్లు ఎన్నడన్న చూసినమా?

    • ముఖ్యమంత్రి సొంతూరుకు ఎవరైనా పోవాలంటే పోలీసు స్టేషన్లో అనుమతి పత్రాలు తీసుకోవాల్సిన దుర్మార్గాన్ని ఎన్నడన్నా విన్నామా? కన్నామా?

    • పోలీసులతోనే పోలీసు కుటుంబాలను కొట్టించిన ఘనుడీ ముఖ్యమంత్రి.

    • మీడియాపై ఆంక్షలు విధించిండు, సోషల్ మీడియాపై కేసులు పెట్టించిండు

    • రాజకీయకక్షతో తప్పుడు కేసులు పెట్టడం, అవి న్యాయస్థానాల్లో వీగిపోవడం సర్వసాధారణంగా మారింది

    • చదువుకునే లైబ్రరీల్లో లాఠీఛార్జీ చేసిండు. – నిరుద్యోగుల కన్నీళ్లతో అశోక నగరాన్ని శోక నగరంగా మార్చిండు.

    • బుల్డోజర్లతో ఇండ్లు కూల్చి పేదల జీవితాలను ఛిద్రం చేసిండు.

    • లగచర్ల లంబాడీ బిడ్డల మీద థర్డ్ డిగ్రీని ప్రయోగించిండు.

    • ఎమర్జెన్సీని తలపించిండు. యమభటుల్ని మరిపించిండు.

    • రేవంత్ పాలనను క్లుప్తంగా చెప్పాలంటే తిట్లు కొట్లు, ఒట్లు నోట్లు

    • ప్రతిపక్షాలకు తిట్లు, ప్రజలకు కొట్లు, దేవుళ్ల మీద ఒట్లు, తనకు తన వారికి దోపిడీ సొమ్ము నోట్లు

    ఒక్క రోజు బాగోతంగా ప్రజాదర్బార్:

    • ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతి రోజు ప్రజా దర్బార్ అని మేనిఫెస్టోలో పెట్టిండు.

    • ఒక్క రోజు బాగోతంతోనే ఒడగొట్టిండు.

    • ముఖ్యమంత్రి కాదు కదా మంత్రులు కూడా రావడం లేదు.

    • ప్రజాదర్బార్ ను ఉత్త ప్రహసనంగా మార్చివేసిండు.

    నెగిటివ్ ఆటిట్యూడ్ తో నెగిటివ్ ఫలితాలు:

    • ఒక ప్రతికూల దృక్పథంతో, నెగటివ్ ఆటిట్యూడ్ తో రేవంత్ పాలన ప్రారంభమైంది.

    • వచ్చి రాగానే అసెంబ్లీలో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామనే హామీని తుంగలో తొక్కారు.

    • ఇచ్చిన హామీలు నెరవేర్చలేని తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు శ్వేతపత్రాల పేరిట రోత పత్రాలు విడుదల చేసారు.

    • దివాలా తీసిందనే నెగిటివ్ ఇమేజ్ ను రాష్ట్రం నెత్తిన రుద్దారు.

    • పాము మంత్రం వేసే వాడు పాము కాటుకే పోయినట్లు, తాము పన్నిన ఉచ్చులో తామే చిక్కుకున్నరు.

    • దివాలా దివాలా అనే దిక్కుమాలిన ప్రచారం వల్ల రాష్ట్ర పరపతిని దెబ్బతిన్నది.

    • ఆర్థిక వృద్ధి రేటు మందగించింది.

    • కొత్త పెట్టుబడులు రాలేదు. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి.

    • నిర్మాణ రంగం కుదేలయ్యింది. రియల్ ఎస్టేట్ ఢమాలైంది. .

    • రేవంత్ ఇమ్మెచ్యూరిటీ, ఇన్ క్యాపబులిటీ అండ్ నెగిటివ్ ఆటిట్యూడ్ వల్ల అన్ని రంగాల్లో నిస్తేజం అలుముకున్నది.

    • కేసీఆర్ పాలన పాజిటివిటీతో ప్రగతిని పరుగులెత్తించింది.

    • బడ్జెట్ 62వేల కోట్ల నుంచి మూడు లక్షల కోట్లకు పెరిగింది.

    • జీఎస్డీపీ 5లక్షల కోట్ల నుంచి పద్నాలుగున్నర లక్షల కోట్లకు పెరిగింది.

    • తలసరి ఆదాయం లక్షా 24వేల నుంచి 3లక్షల 47వేలకు పెరిగింది.

    • 27వేల కోట్ల సేల్స్ ట్యాక్స్, 73వేల కోట్లకు చేరింది.

    • రిజిస్ట్రేషన్ల ఆదాయం రెండున్నర వేల కోట్ల నుంచి సుమారు 13వేల కోట్లకు చేరింది.

    • సాగు విస్తీర్ణం కోటి 31 లక్షల ఎకరాల నుంచి రెండు కోట్ల 22 లక్షల ఎకరాలకు పెరిగింది.

    • ఐటీ ఎగుమతులు లక్షా పదివేల కోట్ల నుంచి 3లక్షల 33వేల కోట్లకు చేరింది.

    • కేసీఆర్ మార్క్ పాలన దేశానికి దిక్సూచి అయ్యింది – రేవంత్ మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది.

    వచ్చీ రాంగనే అనాలోచిత ప్రకటనలు..

    • ఎయిర్ పోర్ట్ మెట్రో రైలు రద్దు, ఫార్మా సిటీ రద్దు అన్నాడు.

    • హైదరాబాదులో వ్యాపార వాణిజ్యాలు రాత్రి 10 గంటలకు బంద్ కావాలన్నాడు.

    • హైడ్రా పేరిట కూల్చివేతల అరాచకంతో సృష్టించాడు.

    • తర్వాత నాలుక కరుచుకొని తూచ్ అన్నడు.

    • కానీ జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.

    • హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ ఆగమైపోయింది.

    • పెట్టుబడి పెట్టే సంస్థలు పునరాలోచనలో పడ్డాయి.

    • రేవంత్ అపరిపక్వ వైఖరి రాష్ట్ర ప్రగతిని మసకబార్చింది.

    పరిపాలనా వైఫల్యం

    • ఇది ఎంత తత్తరబిత్తర ప్రభుత్వమంటే… యాడాదిలో ముగ్గురు పోలీసు కమిషనర్లను మార్చారు.

    • జీ.హెచ్.ఎం.సీ కమిషనర్లు ముగ్గురు మారారు.

    • రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు ముగ్గురు మారారు.

    • ట్రాన్స్ కో సీఎండీలు నలుగురు మారారు

    • శాఖల మధ్య సమన్వయం లేదు.

    • ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న విద్య, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల్లోనే పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి.

    • పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులు విషాహారం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

    • మద్యం అమ్మకాలు పెంచలేదని 39 మంది ఉద్యోగులకు మెమోలు ఇచ్చిండు.

    • సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలనలో కన్విక్షన్ లేదు, కన్సిస్టెన్సీ లేదు, కాన్సన్ ట్రేషన్ లేదనడానికి ఇదొక సాక్ష్యం.

    వరద సహాయక చర్యల్లో ఘోర వైఫల్యం

    • ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాలో వరద ముంచెత్తితే సకాలంలో కనీస సహాయక చర్యలు అందించలేదు.

    • ప్రతి చిన్నదానికి హెలికాప్టర్ ఉపయోగించే ప్రభుత్వ పెద్దలు వరద సహాయక చర్యలకు ఒక హెలికాప్టర్ ను ఏర్పాటు చేయలేక చేతులెత్తేసారు.

    • రేవంతు ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన దుస్థితి.

    • బాధ్యత మరిచిన మంత్రి సిగ్గులేకుండా భగవంతుడి మీదే భారమని ప్రకటించిండు.

    • వరదల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని జేసీబీలతో జనమే కాపాడుకున్నారు.

    • ఆపద వేళ అక్కరకు రాని సర్కారును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.

    • బీఆర్ఎస్ పక్షాన వరద బాధితులకు సాయం చేయడానికి పోతే మా మీద అమానుషంగా దాడులు చేయించారు.

    • విపత్తు నిర్వహణలోఅట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఏడుగురి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు.

    దిగజారిన శాంతి భద్రతలు..

    • ప్రశాంతతకు చిరునామాగా ఉన్న తెలంగాణ, నేడు అశాంతితో, అలజడితో అట్టుడుకుతున్నది.

    • మత సామరస్యానికి మారుపేరైన తెలంగాణలో మత ఘర్షణలు జరుగుతున్నయి.

    • రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయకక్ష సాధింపు చర్యలు చెలరేగుతున్నయి.

    • రాష్ట్రంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది. హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యం అయిపోయాయి.

    • ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండారెడ్డి పల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి… రేవంత్ బ్రదర్స్ వేదింపుల వల్లే చనిపోతున్నా అని సుసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నడు.

    • ఇప్పటి వరకు విచారణ లేదు, చర్యలు లేవు.

    • చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం అయ్యిందా?

    • పరిపాలన మీద పట్టులేకపోవడం వల్లనే ఇదంత జరుగుతుంది.

    • శాంతిభద్రతలు క్షీణించడం కూడా పెట్టుబడుల మీద ప్రభావం చూపుతున్నది.

    ఆరు గ్యారంటీలకు అధోగతి – అటకెక్కిన సంక్షేమం

    • పదేండ్ల బీఆర్ఎస్ పాలన సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టిస్తే… ఏడాదిలోనే కాంగ్రెస్ సంక్షేమాన్ని సర్వధ్వంసం చేసింది.

    • ఆరు గ్యారెంటీల్లో మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి

    • వంద రోజుల్లో మహిళలకిస్తామన్న రూ.2,500 రూపాయలను ఢిల్లీ కాకి ఎత్తుకపోయిందో, గల్లీ కాకి ఎత్తుక పోయిందో

    • ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే.. మహాలక్ష్ములు మహాకాళులవుతారు.

    • ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు లేనివారికి ఇంటి స్థలం మరియు రూ.5 లక్షలు ఇస్తామన్నరు. ఇచ్చిందీ లేదు, సచ్చిందీ లేదు.

    • యాడాదిలో కూల్చిన ఇండ్లే తప్ప, కట్టిన ఇండ్లు లేనే లేవు.

    • విద్యా భరోసాకు కూడా రైతు భరోసాకు పట్టిన గతే పట్టింది. కార్డు లేదు, గీర్డు లేదు. 5 లక్షలు కాదు కదా, 5 పైసలైనా ఇయ్యలేదు.

    • ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్సుమెంట్ కూడా ఇప్పటికీ దిక్కులేదు.

    • కేసీఆర్ కన్నా మిన్నగా, పింఛన్లు ఇస్తామని ప్రగల్భాలు పేలింది కాంగ్రెస్.

    • ఏడాదవుతున్నా పింఛన్లు పెంచలేదు, ఎప్పుడు పెంచేదీ చెప్పడం లేదు.

    • కేసీఆర్ ఇచ్చే రెండు నెలల పింఛన్ ఎగ్గొట్టి పాపం మూటగట్టుకుంది కాంగ్రెస్.

    • ముసలోళ్లను కూడా ముంచుతున్న ముదనష్టపు ప్రభుత్వం ఇది.

    • దివ్యాంగులకు కూడా ధోఖా చేస్తున్న దిక్కుమాలిన ప్రభుత్వం ఇది.

    • కాంగ్రెస్ అమలు చేసిన ఏకైక హమీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    • అయితే, బస్సుల సంఖ్యను తగ్గించడంతో మహిళలు, పురుషులు, పిల్లలు అందరూ పడరాని పాట్లు పడుతున్నరు.

    • సోయి లేకుండా హామీలు ఇచ్చి అమలు చేయమంటే చేతులెత్తేస్తున్నాడు.

    • 4 లక్షల 26వేల కోట్ల అప్పును 7 లక్షల కోట్లని గోబెల్స్ ప్రచారం చేస్తున్నడు.

    • పదేళ్లలో మేం 4.26లక్షల కోట్ల అప్పు చేస్తే, మీరు ఏడాదిలోనే లక్ష కోట్ల అప్పు చేసిన్రు.

    • ఆర్థిక పరిస్థితి అంచనా వేసే హామీలు ఇచ్చినం అని చెప్పి, కుంటిసాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నరు.

    • ఎన్నికలప్పుడు ఏమన్నారో చూద్దాం.

    • మొత్తానికి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను నమ్మినందుకు అన్న వస్త్రాలకు పోతే, ఉన్న వస్త్రాలు ఊడినట్టయింది.

    ఇరిగేషన్ రంగం..

    • ఆదిలోనే హంసపాదులా – కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కె.ఆర్.ఎం.బి. కి అప్పగించారు.

    • పదేండ్లు కేసీఆర్ కాపాడిన హక్కుల్ని నెల తిరక్కుండానే కేంద్రానికి కట్టబెట్టారు.

    • సాగర్ ఆయకట్టుకు సరైన సమయంలో నీళ్లివ్వలేదు.

    • కేసీఆర్ ప్రశ్నిస్తేనే కళ్లు తెరిచి సాగర్ ఆయకట్టుకు నీళ్లొదిలారు.

    • సకాలంలో నీరందక వేల ఎకరాల పంట ఎండిపోయింది.

    • ఈ సీజన్ లో రాష్ట్రంలో కోటి 53 లక్షల టన్నుల ధాన్యం పండింది.

    • అదంతా తమ గొప్పతనమని అబద్దాలు చెప్పుకుంటున్నరు.

    • 2014 వరకు ఎంత పండిందో, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంత పండిందో దాచేస్తే దాగని సత్యం.

    • 2014-15 లో 68లక్షల టన్నుల వరి పండితే, 2023-24 నాటికి కోటి 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి.

    • 2014-15లో కోటి 31లక్షల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం, 2023-24 నాటికి రెండు కోట్ల 22లక్షల ఎకరాలకు పెరిగింది.

    • రికార్డు స్థాయిలో పంట పండిందని రేవంత్ రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నడు ఇదంతా ఎట్ల సాధ్యమైంది?

    • మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసింది బీఆర్ఎస్.

    • 1200 పైగా చెక్ డ్యాముల నిర్మించింది బీఆర్ఎస్.

    • నాణ్యమైన కరెంటు ను నిరంతరాయంగా ఇచ్చింది బీఆర్ఎస్

    • మీరు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చింది బీఆర్ఎస్.

    • రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా? ఆ నీళ్లతో పంటలు పెరిగిన మాట వాస్తవం కాదా?

    • ఖమ్మం జిల్లా కడుపు నింపేందుకు సీతారామా నుంచి రామదాసు దాక ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించింది కేసీఆర్ కాదా?

    • ఈ యాడాదిలో రేవంత్ సర్కారు ఊడబొడిచింది ఏమున్నది.

    • ఒక చెరువు బాగు చేసిన్రా? ఒక చెక్ డ్యామన్నా కట్టిన్రా?

    • ఒక ప్రాజెక్టు కట్టిన్రా? ఒక కెనాలైనా తవ్విన్రా?

    • ఏటా ఆరున్నర లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కల్పిస్తామని ఆర్బాటంగా ప్రకటించారు.

    • కనీసం ఈ ఏడాదిలో ఆరున్నర వేల ఎకరాల కొత్త ఆయకట్టన్నా వచ్చిందా?

    • పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పండబెట్టిన రేవంత్ కు పాలమూరు బిడ్డను అని చెప్పుకునే నైతిక అర్హత ఉందా?

    • కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగితే… రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగింది.

    రేవంత్ పాలననో రైతు సంక్షేమానికి రాహు కాలం.. వ్యవసాయానికి గ్రహణం

    రుణమాఫీ…

    • రేవంత్ పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతు సంక్షేమం నీరుగారిపోతున్నది.

    • అధికారంలోకి రాంగనే మొదటి సంతకం రుణమాఫీ మీదనే పెడుతనన్నడు.

    • తానైతే ప్రమాణస్వీకారం చేసిండు. రైతులకు చేసిన ప్రమాణం మాత్రం నిలుపుకోలేదు.

    • నేను సవాల్ చేస్తే, ఆగస్టు 15 అని కొత్త గడువు పెట్టిండు.

    • కనిపించిన దేవుడి మీదల్లా ఒట్టు పెట్టిండు.

    • నాలుగు కోట్ల ప్రజలను మోసం చేయగలిగినోడికి, మూడు కోట్ల దేవతలను మోసం చేసుడు పెద్ద ముచ్చటనా

    • నిప్పులాంటి నిజం ఏమిటంటే ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 50శాతం రైతులకు రుణమాఫీ కాలేదు. కాలేదు. కాలేదు.

    • 31 రకాల సాకులు సృష్టించి, సగం మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిన దగాకోరు ప్రభుత్వం మీది.

    • స్టేట్ లెవల్ బ్యాంకర్స్ మీటింగ్ లో 49,500 కోట్లు అన్నరు. క్యాబినెట్ మీటింగ్ లో 31వేల కోట్లు అన్నరు. తీరా 17వేల కోట్లు రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నరు.

    • అడ్డగోలు నిబంధనల వల్ల కుటుంబాల మధ్య లేని పోని పంచాయతీలు.

    • చివరకు ఆత్మహత్యలు చేసుకునే కాడికి తెచ్చిన్రు.

    • ఈ నిజాలు చెబుతున్నందుకే నామీద సీఎంకు ఎక్కడ లేని మంట.

    • వాస్తవాన్ని ఎదుర్కునే సత్తా లేక, వాదనలో గెలిచే దమ్ము లేక తిట్లకెత్తుకుంటడు.

    • వి కెన్ అండర్ స్టాండ్ హిస్ ఫ్రస్టేషన్.. బట్ వి కాంట్ ఎక్స్ క్యూజ్ హిజ్ వల్గారిటీ

    రైతు బంధుకు రాంరాం..

    • కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకం తెలంగాణ వ్యవసాయాన్ని నిలబెట్టింది.

    • రెండేళ్లు వరుసగా కరోనా వచ్చినా సరే కేసీఆర్ రైతు బంధు సాయం ఆపలేదు.

    • బీఆర్ఎస్ ప్రభుత్వం 11 విడతల్లో 72,817 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది.

    • రైతుల ఖాతాల్లో నేరుగా 72వేల కోట్లు జమచేసిన రాష్ట్రం ఏదైనా ఉందా? ముఖ్యమంత్రి ఎవరన్న ఉన్నరా? ఒకే ఒక్క కేసీఆర్ గారు తప్ప.

    • రేవంత్ రెడ్డి నీకు సవాల్ విసురుతున్నా.. ఏదన్న రాష్ట్రం గాని, ముఖ్యమంత్రి గాని ఉంటే చూపించు.

    • కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రాం రాం అంటదని. కేసీఆర్ ముందే చెప్పిండు.

    • వానాకాలం పంటకు ఎగ్గొట్టిన్రు. యాసంగిపై ఇప్పటికీ స్పష్టత లేదు.

    • పంట పెట్టుబడి 15 వేలకు పెంచింది లేదు, రైతులకు పంచింది లేదు.

    పంట కొనుగోళ్లు ఆలస్యం- రైతులకు తీరని నష్టం.

    • రాష్ట్రంలో పండిన పంటనంతా కొనే పద్ధతిని బీఆర్ఎస్ ప్రభుత్వమే మొదలు పెట్టింది.

    • వారం రోజుల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది.

    • రేవంత్ సర్కారు రాగానే పరిస్థితి తారుమారైంది.

    • కల్లాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నరు.

    • మద్దతు ధరకన్నా తక్కువకు ధాన్యం అమ్ముకునే దుస్థితిని పట్టించింది రేవంత్ సర్కారు.

    పంట బోనస్ పత్తా లేదు..

    • వరంగల్ డిక్లరేషన్ లో అన్ని పంటలకూ బోనస్ అన్నరు.

    • తర్వాత వడ్లకే అని, ఆ తర్వాత సన్నాలకే పరిమితం చేసి సన్నాయి నొక్కులు నొక్కిన్రు.

    • రైతు భరోసా కౌలు రైతుకు ఇస్తం, భూమి యజమానికిస్తం,. ఒకళ్ల పేరు చెప్పి ఇంకొకళ్లకు ఎగ్గొట్టం అని పొంకనాలు కొట్టిండు రేవంత్.

    ఇప్పుడేమో ఎవరికి ఇయ్నాల్నో వాళ్లే తేల్చుకోవాలని వ్యవసాయ మంత్రి తుమ్మల చావు కబురు చల్లగ చెప్పిండు.

    • ఉపాధి హామీ కూలీలకు యాడాదికి రూ.12 వేలు ఇస్తామని, బడ్జెట్లో రూ.1600 కోట్లు కేటాయించామని జబ్బలు చరుచుకున్నడు.

    • ఏడాది గడిచిపోతున్నా ఏకానా ఇచ్చింది లేదు. ఇవ్వాలని చూసిందీ లేదు.

    నిరుద్యోగులపై నిర్బంధం..

    • నిరుద్యోగుల బాధలు చెప్పాలంటే.. రాస్తే రామాయణమంత, చెప్తే భారతమంత

    • ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగుల రెక్కల కష్టంతో గద్దెనెక్కారు రేవంత్ రెడ్డి

    • అవసరం తీరాక నిర్దాక్షిణ్యంగా నిరుద్యోగుల రెక్కలు విరిచారు, డొక్కల్లో గుద్దారు.

    • బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలిచ్చి, ఇదంతా తన ఘనతే అని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నడు సీఎం రేవంత్

    • జాబ్ క్యాలెండర్ అని, జాదూ క్యాలెండర్ ప్రకటించాడు రేవంత్ రెడ్డి.

    • జాబ్ లెస్ క్యాలెండర్ చూసి నిరుద్యోగులు నివ్వెరపోయారు.

    • రాజుగారి దేవతా వస్త్రాల వలె ఆ క్యాలండర్లో ఉన్న ఉద్యోగాలు కాంగ్రెసోళ్లకు తప్ప మరెవరికీ కనిపించడం లేదు.

    • నిరుద్యోగులకు ప్రతినెల 4,000 భృతి అని ప్రియాంక గాంధీ గారు చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి.

    • డీఎస్సీ, గ్రూప్ – 2 వాయిదా వేయమంటే నిరుద్యోగుల మీద లాఠీలు ప్రయోగించిండు.

    • సరస్వతీ నిలయమైన చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్ ప్రాంతాలు, నిరుద్యోగుల ఆక్రందనలతో దద్దరిల్లినయి.

    • జీవో 29 రద్దు చేయమన్నందుకు వీపు విమానం మోత మోగించిండు. నిరుద్యోగుల కళ్లల్లో దుమ్ము కొట్టిండు.

    గురుకుల విద్యకు గ్రహణం

    • పదేండ్ల కేసీఆర్ పాలనలో గురుకుల విద్య గొప్పగా వర్ధిల్లింది.

    • గురుకులాల సంఖ్యను 298 నుంచి 1022 కు పెంచిండు కేసీఆర్.

    • అట్టడుగు వర్గాల పిల్లలకు అద్భుతమైన విద్య అందించిండు.

    • గతంలో పురుగులన్నం పెట్టిన హాస్టళ్లలో, సన్నబియ్యంతో చక్కని బువ్వ పెట్టిండు.

    • రేవంత్ సీఎం అయిన నాటి నుండి గురుకులాలకు గ్రహణం పట్టింది.

    • పురుగుల అన్నం, గొడ్డుకారం పెడుతున్నారని ఆడపిల్లలు సైతం రోడ్డెక్కారు.

    • పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు, విద్యుత్ షాకులతో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు.

    • విద్యార్థులు ఆస్పత్రుల పాలు – ప్రభుత్వం పరువు గంగపాలు.

    • బడిలో ఆనందంగా పాఠాలు చదువుకోవాల్సిన పిల్లలు.. ఆసుపత్రుల్లో కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు.

    • సాక్షాత్తూ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యాశాఖల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది.

    • ముఖ్యమంత్రిగా రేవంత్ సాధించిన రికార్డు ఏమిటంటే…

    తన నేరపూరిత నిర్లక్ష్యంతో 49 మంది గురుకుల విద్యార్థులను బలితీసుకున్నడు.

    • ఎంతో మంది తల్లిదండ్రులకు తీరని గుండెకోత మిగిలించిండు.

    ఆగాధమైపోయిన పల్లెలు, పట్టణాలు

    • కేసీఆర్ పాలనలో పల్లెలు, పట్టణాలు చరిత్రలో గొప్ప ప్రగతిని సాధించాయి.

    • మౌలిక వసతులు, పచ్చదనం, పారిశుద్ధ్యంతో విలసిల్లిన గ్రామాలు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు గెలుచుకున్నాయి.

    • ఏడాది కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాల పరిస్థితి పూర్తిగా దిగజారింది.

    • గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో నిర్వహణ గాలిలో దీపంగా మారింది.

    • కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులను డైవర్ట్ చేసారు.

    • చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచులు సైతం రోడ్డెక్కారు.

    • పల్లెలు, పట్టణాలు మళ్లా మురికి కూపాలు అవుతున్నాయి.

    • బీఆర్ఎస్ పెట్టిన చెట్లకు నీళ్ళు పోసే దిక్కు లేక, పచ్చదనం మటుమాయమై పోతున్నది.

    • దోమలు పెరిగి చికెన్ గున్యా, మలేరియా, డెంగీ దెబ్బకు వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల మంది విష జ్వరాల బారిన పడుతున్నారు.

    • పరిస్థితి చివరకు ఎక్కడికి వచ్చిందంటే.. ‘‘తెలంగాణలో అనారోగ్యకర పరిస్థితులున్నాయి. అక్కడికి వెళ్తే చికెన్ గున్యా బారిన పడటం ఖాయం’’ అని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం (సీడీసీ) తమ దేశ పౌరులను హెచ్చరించింది. …..ఇది మన రాష్ట్రానికే కాదు, దేశానికే అవమానం.

    ప్రభుత్వ ఉద్యోగులకూ అదే మొండి చెయ్యి…

    • ఎన్నికల సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులను తమ వైపు తిప్పుకోవడం కోసం ఇష్టానుసారం హామీలు గుప్పించారు.

    • అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న మూడు డీఏలను తక్షణం విడుదల చేస్తామని నమ్మబలికారు.

    • 5 డీఏలకు గాను ఒక్క డీఏ ఇచ్చి పండుగ చేసుకోండి అన్నాడు. .

    • అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ ప్రకటించి ఆరు నెలల్లోపు సిఫార్సులను అమలు చేస్తమని మేనిఫెస్టోలో చెప్పారు.

    • ఏడాది గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.

    • చివరకు పీఆర్సీ అనే మాట ఉచ్చరించడానికి కూడా ఉద్యోగ సంఘాలు సాహసించలేని పరిస్థితి.

    • పోలీసుల సరెండర్ లీవ్, టీఏ బిల్లుల కోసం పోరాటమే చేయాల్సి వస్తున్నది.

    • ఏడువేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెన్ఫిట్స్ ఎగవెట్టి, ఏడాది పాలన విజయోత్సవాలు చేసుకుంటున్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం.

    • ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్ వాడీలు, హోం గార్డులకు ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదు.

    హైడ్రా పేరుతో కూల్చివేతలు

    • హైడ్రా రూపంలో రేవంత్ రెడ్డి విధ్వంసం సృష్టించిండు.

    • పేదల, మధ్య తరగతి ప్రజల ఇండ్లు నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేసిండు.

    • పేదల ఇండ్లు కూల్చిన రాకాసి రాజ్యం ఈ ఇందిరమ్మ రాజ్యం

    • ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు -అనుమతులున్నాయన్నా లెక్క చేయలేదు

    • అర్ధరాత్రి, అపరాత్రి అని చూడలేదు – కాళ్లు మొక్కుతున్నా కనికరించలేదు.

    • పసిపిల్లలు తమ పుస్తకాలు తెచ్చుకుంటామని వేడుకున్నా వినిపించుకోలేదు

    • ప్రశ్నించే వాళ్ల మీద నుంచి కూడా బుల్డోజర్ నడుపుతా అని వీధి రౌడీలా బెదిరిస్తున్నాడు.

    • ఇపుడు అనుమతులుంటే ఇండ్లు కూల్చబోమని కూని రాగాలు తీస్తున్నాడు

    • ఇప్పటికే కూల్చిన ఇండ్లకు నష్టపరిహారం ఎవరిస్తరో మాత్రం చెప్పడం లేదు.

    • అన్యాయంగా బాధితులు అనుభవించిన క్షోభకు ఎవరు జవాబుదారీ?

    మూసీ పేరుతో మూటలు…

    • ప్రభుత్వమంటే లంకెబిందెలు తవ్వుకోవడంగా భావించే ముఖ్యమంత్రికి మూసీలో నిజంగానే లంకెబిందెలు కనిపిస్తున్నాయి.

    • ఇది మూసీ ప్రక్షాళన పథకం కానే కాదు, ముమ్మాటికీ ఇది మూటలు వెనకేసుకునే పథకం.

    • నదిని ప్రక్షాళన చేయడమే లక్ష్యమైతే నీళ్లు శుభ్రం చేసే దగ్గర కార్యాచరణ మొదలయ్యేది.

    • కానీ, ఇండ్లు కూల్చి భూములను ఆక్రమించుకునే దగ్గర మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిండు.

    • నిజానికి మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ హయాంలోనే ప్రారంభమైంది.

    • 16 వేల కోట్ల బృహత్ ప్రణాళికతో మూసీని జీవనదిగా మార్చేందుకు కేసీఆర్ గారు ఎప్పుడో నడుం బిగించారు.

    • 21 ఎస్టీపీల నిర్మాణం శరవేగంగా జరిగింది.

    • కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లను మూసీలో పోసేందుకు నిశ్చయించారు.

    • నిజాయితీ ఉంటే రేవంత్ సర్కారు, బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాన్ని కొనసాగించేది.

    • కేవలం 16 వేల కోట్లతో బీఆర్ఎస్ రూపొందించిన పథకాన్ని పక్కనపెట్టి, 1 లక్షా 50 వేల కోట్లు లూటీ చేసే కొత్త పథకాన్ని సిద్ధం చేసిండు.

    • ఈ పథకాన్ని”మూసీ ప్రక్షాళన పథకం” అనే కన్నా “ప్రజల సొమ్ము భక్షాళన పథకం” అనడం చాలా సబబుగా ఉంటుంది.

    • మల్లయ్య ఇల్లు కూల్చి మాల్ కడతావా అని నిలదీసినందుకు మా మీద రోత కూతలతో దాడికి దిగిండు.

    • ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని మూసీలో పడి చస్తావని శాపనార్థాలు పెట్టిన అనాగరికుడు, సంస్కారహీనుడు రేవంత్ రెడ్డి

    • మూసీ నిర్వాసితులు, హైడ్రా బాధితులు కంటికి మంటికి ఏకదారగా ఏడుస్తున్నారు.

    • ఏడాది పాలన మీద ఏడు దోసిళ్ల మన్నెత్తి పోస్తున్నారు.

    ఫార్మా సిటీ పేరుతో రియల్ దందా

    • కాంగ్రెసే తెచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతోనైతే భూములు సేకరిస్తుందో, ఆ ఉద్దేశ్యానికి ఆ భూముల్ని వాడనప్పుడు.. ఆ భూములను వాపస్ చేయాలి.

    • రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, కోదండ రెడ్డి నాడు ఫార్మాసిటీ భూముల వాపస్ ఇస్తమన్నరు. నేడు అధికారంలోకి రాగానే నిర్బందాల నడుమ 30 వేల ఎకరాల భూములు సేకరిస్తున్నరు.

    • ఇది ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా?

    • ఫార్మా సిటీ భూములను తన దోపిడీ ప్రయోజనాలకోసం, రియల్ ఎస్టేట్ దందా కు మళ్లిస్తున్నాడు.

    ఫార్మా విలేజీల పేరిట చిచ్చు..

    • బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన 14వేల ఎకరాలు కాదని, ఫార్మా కంపెనీలను పల్లెలకు మళ్లిస్తున్నాడు.

    • తొండలు గుడ్లు పెట్టని భూమి అని పొలాలు గుంజుకుంటున్నారు.

    • ఈ దోపిడీ దందాకు వ్యతిరేకంగా న్యాలకల్ రైతులు నిరసిస్తుంటే,

    లగచర్ల రైతులు తిరుగుబాటు చేశారు.

    • లగచర్ల గిరిజన బిడ్డల మీద దారుణమైన అణిచివేతను ప్రయోగిస్తూ, ఎమర్జెన్సీ కాలం నాటి పోలీసు రాజ్యాన్ని తెచ్చిండు రేవంత్.

    • ఊసరవెల్లిలా రంగులు మార్చే రేవంతు..లగచర్ల లంబాడీల దెబ్బకు జడిసి ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నడు.

    • నీకున్న 500 ఎకరాల భూమి ఇవ్వు..

    ప్రతిపక్షాలపై నెపం…

    • ఎక్కడ నిరసన చెలరేగినా, ప్రభుత్వంపై ప్రజలు తిరగబడినా ప్రతిపక్షం కుట్ర అని ప్రచారం చేయడం రేవంత్ రెడ్డికి రివాజుగా మారింది.

    • వరద బాధితుల నుంచి హైడ్రా బాధితుల దాకా

    లగచర్ల నుంచి దిలావర్ పూర్ దాకా

    • నిరుద్యోగుల నుంచి పోలీసుల దాకా ఎవరు రోడ్డెక్కినా వారి వెనుక ప్రతిపక్షమే ఉందంటడు.

    • చివరకు.. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే కూడా ప్రతిపక్షాల కుట్ర అంటడు.

    • ప్రజలు చేసిన పోరాటాలను జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు రెచ్చగొట్టాయని నిందలు వేస్తాడు.

    • వీళ్ల అసమర్థ నిర్వహణ వల్ల కరెంట్ పోతే, అది కూడా హరీశ్ రావే చేయించాడని అవాకులు చెవాకులు పేలడం రేవంత్ రెడ్డికే చెల్లింది.

    అజ్ఞాన వ్యాఖ్యలు- అబద్దాల మాటలు

    నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ అనేకమార్లు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నాడు.

    • ముఖ్యమంత్రి పదవినే నవ్వులపాలు చేస్తున్నాడు.

    • హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలున్నాయట. అందుకే నేవీ రాడార్ కేంద్రం దామగుండంలో పెడుతున్నారట.

    • రాష్ట్రం చుట్టూ మూడు సముద్రాలు లేవు గానీ, ముఖ్యమంత్రి గారికి మాత్రం సముద్రమంత అజ్ఞానం ఉందని జనం నవ్వుకుంటున్నరు.

    • తెలంగాణలో భాక్రానంగల్ ప్రాజెక్టు ఉందని ముఖ్యమంత్రి గారు నొక్కి వక్కాణించారు.

    • భాక్రా – నంగల్ అనేవి రెండు ప్రాజెక్టులు, అవి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి, అవి ఉన్న ప్రదేశాలను బట్టే వాటికి ఆ పేరు వచ్చింది.

    • హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్లో విమానాలమ్ముతారట. ఈ మాటన్నది సాక్షాత్తూ సీఎం గారే.

    • పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదట. అబద్ధమాడినా అతికినట్టుండాలి కదా?

    • జీతం పద్దులు చూస్తే లక్షా 60వేల ఉద్యోగాలు ఇచ్చారని ఎవరికైనా అర్థమవుతుంది.

    • మల్లన్న సాగర్ లో 50 వేల ఎకరాలు మునిగాయని, నిర్వాసితులకు ఒక్క ఇల్లు కట్టలేదని నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్పిండు.

    • 14వేల ఎకరాలకు మించి మునగలేదని, మూడు వేలకు పైగా ఇల్లు కట్టారని రికార్డులు చూసినా, అక్కడికి వెళ్లినా తెలుస్తుంది కదా.

    • దావోస్ కు పోయిన ముఖ్యమంత్రి గారు విదేశాల్లో కూడా తన అజ్ఞానాన్ని దాచుకోలేదు.

    • ఇండియా టుడేకు ఇంటర్ఫ్యూ ఇస్తూ ‘‘ IT and Pharma is a Nuclear Chain reaction ’’ అన్నడు.

    • అంటే ఏమిటో ఆ భగవంతునికే తెలియాలి. ఆ చైన్ రియాక్షన్ ఏమిటో రాహుల్ గాంధే వివరించాలి.

    • వారి అజ్ఞాన వ్యాఖ్యలు ఎట్లుంటయ్యో ఓ సారి చూద్దాం..

    తిక్క విధానం – తిట్ల పురాణం

    • మన సీఎం గారికి ‘‘ దుర్భాషా దురంధరుడు ’’ అనే బిరుదు ఇవ్వవచ్చు.

    • పండబెట్టి తొక్కుతా.. చీరుతా.. చింపుతా.. సంపుతా.. గుడ్లు పీకి గోటీలాడుతా.. యాప శెట్టుకు కట్టేసి లాగుల తొండలిడుస్తా.. అని శాడిస్టు భాషలో చెలరేగి పోతాడు.

    • బుల్డోజర్ తో తొక్కిస్తం.. మానవ బాంబులై చంపేస్తం.. అని టెర్రరిస్టులా రెచ్చిపోతాడు.

    • నా కొడకల్లారా.. ఒక్కొక్కన్ని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతా అని ఉన్మాదిలా వాగుతాడు.

    • బాడీ షేమింగుకు బ్రాండ్ అంబాసిడర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

    • పసిపిల్లలను సైతం బాడీ షేమింగ్ చేసిన రేవంత్ రెడ్డి, నాలాంటి వాళ్లను చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.

    • ఎప్పుడో ఒకసారి మాట తూలడం ఎవరి విషయంలోనైనా జరగొచ్చు.

    • కానీ, ఎప్పుడూ బూతులే మాట్లాడటం సీఎం రేవంత్ కు అలవాటుగా మారింది.

    • రాజకీయ పరిభాషను దిగజార్చడంలో రేవంత్ రెడ్డిది మేజర్ కంట్రిబ్యూషన్

    • ఎనుముల వారి నోటి వెంట జాలువారిన ఆణిముత్యాలను ఇప్పుడు చూద్దాం.

    • ఏడాది పాలన తెలంగాణ ప్రజలను సంపూర్ణంగా హతాశులను చేసింది. 

    • పది సంవత్సరాల అభివృద్ధిని పన్నెండు నెలల్లో పాడు చేసిన్రు.

    • పురోగమన తెలంగాణను తిరోగమన తెలంగాణగా మార్చిన్రు.

    • సంక్షేమ కునారిల్లింది. సంక్షోభం ముంచుకొస్తున్నది.

    • అభివృద్ధి జాడలేదు, అణిచివేత విరుచుకుపడుతున్నది.

    • మొత్తం మీద ఏడాది పాలన ఎడతెగని వేదననే మిగిలించింది.

    • ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో వర్ధిల్లుతున్నది రేవంత్ మార్కు ప్రజా పాలన.

    • ఏడాది పాలనలో ఏం కోల్పోయామో ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని కేసీఆర్ గారు అన్న మాట అక్షర సత్యం.

    • సత్యాన్ని జీర్ణించుకోలేని రేవంత్.. ఎగతాళిగా మాట్లాడుతున్నడు. ఎగిరెగిరి పడుతున్నాడు.

    • తెలంగాణ ప్రజలు ఏం కోల్పోలేదంటున్నడు.

    • ఏం కోల్పోయారో తెలుసా రేవంత్ రెడ్డి…

    • వ్యవసాయానికి జీవనాడిగా నిలిచిన రైతు బంధును కోల్పోయారు

    • మత్స్య కారులు చేప పిల్లల పంపిణీ కోల్పోయారు.

    • దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన దళిత బంధును కోల్పోయారు

    • బీసీలకు బాసటగా నిలిచిన బీసీ బంధును కోల్పోయారు

    • బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఓవర్సిస్ స్కాలర్ షిప్స్ కోల్పోయారు.

    • గర్బిణులు కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్టును కోల్పోయారు.

    • ఆడబిడ్డలు బతుకమ్మ చీరలు కోల్పోయారు.

    • మైనార్టీస్ కో క్యాబినెట్ మే బీ జగా నహీ మిలా

    • కం సె కం నౌ దిన్ కా జష్న్ మే బీ ఉన్ కా జికర్ నహీ

    • షాదీ ముబారక్ కే ఏక్ తులా గోల్డ్ కా కుచ్ పతా నహీ

    • ఏక్ సాల్ మే కాంగ్రెస్ నే మైనార్టీస్ కో పూరీ తరహా నజరందాస్ కర్ దియా..

    • లంబాడి బిడ్డలు మంత్రివర్గంలో స్థానం కోల్పోయారు

    • పేద బ్రాహ్మణులు ప్రభుత్వ సహాయాన్ని కోల్పోయారు.

    • ఇండ్లు కూలిన పేదలు సర్వస్వం కోల్పోయారు

    • చివరకు అమ్మ ఓడిలోనో, బడిలోనో ఆనందంగా ఉండాల్సిన పిల్లలు తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు.

    • రాష్ట్ర ప్రజలు ఉజ్వల భవిష్యత్తును కోల్పోయారు.

    • ఏడాది పాలన ఎడతెగని వేదనను మిగిల్చింది.

    జై తెలంగాణ

    BRS Release charge sheet CM Revanth reddy
    Previous Articleటీమిండియా టార్గెట్‌ 372
    Next Article రెండో టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాజయం
    Raju Asari

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.