పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అంబేద్కర్‌పై కేంద్రమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తుండగానే లోక్ సభ స్పీకర్ ఓం బీర్లా, లోక్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నాట్లు ప్రకటించారు. అలాగే అమిత్‌షా వ్యాఖ్యలపై రాజ్యసభలో కూడా విపక్ష ఎంపీలు నిరసనకు దిగడంతో రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో పార్లమెంట్ సమావేశాలు ఇవాళ్టితో ముగిసింది. నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబరు 20తో ముగిశాయి. అదానీ అంశం, అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు తదితర అంశాలతో పార్లమెంట్ ఉభయ సభలు శీతాకాల సమావేశాల్లో అట్టుడికిపోయాయి. విపక్షాల నిరసనల మధ్యే శుక్రవారం రాజ్యసభ సమావేశాన్ని మధ్యాహ్నం 12గంటలకు ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ వాయిదా చేశారు.
సభలో ప్రతిష్టంభనను ముగించే ప్రయత్నంలో భాగంగా సభా నాయకుడు జేపీ నడ్డా, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే సహా ప్రతిపక్ష పార్టీల నాయకులతో ధన్‌ఖడ్ భేటీ అయ్యారు. సభను సజావుగా సాగేలా చూడాలని వారిని కోరారు. ఈ సెషన్లోనే ‘ఒక దేశం, ఒకే ఎన్నికల’ బిల్లుపై చర్చ జరిగింది. జమిలి ఎన్నికలపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో జమిలి ఎన్నికల కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.