ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పొత్తుల విషయంపై స్పందించిన విషయం తెలిసిందే. తమ పార్టీ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అప్పటినుంచి పవన్ కల్యాణ్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు బీజేపీ తమ అధినేతను ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలంటూ జనసైనికుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. బీజేపీ మనసులో ఏముందో తెలియడం లేదు. పవన్‌తో పొత్తుకు తాము సిద్ధమేనంటున్న బీజేపీ నేతలు.. సీఎం అభ్యర్థి ప్రకటన విషయంపై స్పందించడం లేదు.
ఇదిలా ఉంటే పవన్ పొత్తుల ప్రతిపాదనపై మంత్రి రోజా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘పవన్ కల్యాణ్ ఇంతకాలం ప్రజలకోసం పోరాటాలు చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. కానీ ఇప్పుడేమో ఆయన పొత్తుల కోసం పోరాడుతున్నారు. పవన్‌ను జనసేన, బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసైనికులు డిమాండ్ చేయడం కామెడీగా ఉంది.
ఇక గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఆయన పార్టీ గెలిచింది ఒక్కస్థానంలో .. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలు కనడం ఏమిటో అర్థం కావడం లేదు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఖాయం.
ఇక చంద్రబాబును ప్రజలెవరూ నమ్మరు. ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు ఖాయం. గతంలో బద్వేలు ఉప ఎన్నికలసమయంలో టీడీపీ, జనసేన అభ్యర్థులను పెట్టకుండా.. బీజేపీకి పరోక్షంగా సపోర్ట్ చేశాయి. ఇప్పుడు ఆత్మకూరులోనూ అదే చేయబోతున్నాయి. అయినప్పటికీ గెలుపు మాదే. గౌతమ్ రెడ్డికి ఉన్న ప్రజాదరణే మమ్మల్ని గెలిపిస్తుంది. పవన్ కల్యాణ్ ఇప్పటికైనా కాస్త నిజం తెలుసుకొని.. ఊహల్లో కాకుండా వాస్తవంలో బతికితే మేలు’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.