సమ్మర్ హాలిడేస్ ఇలా ప్లాన్ చేసుకుంటే బెటర్!
స్టూడెంట్స్‌తో పాటు కొందరు ఉద్యోగులకు కూడా సమ్మర్ హాలిడేస్ లభిస్తుంటాయి. అయితే సమ్మర్‌లో దొరికే ఈ సమయాన్ని కేవలం వృథాగా గడిపేయకుండా పర్సనల్ ఇంప్రూవ్‌మెంట్ కోసం వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
స్టూడెంట్స్‌తో పాటు కొందరు ఉద్యోగులకు కూడా సమ్మర్ హాలిడేస్ లభిస్తుంటాయి. అయితే సమ్మర్‌లో దొరికే ఈ సమయాన్ని కేవలం వృథాగా గడిపేయకుండా పర్సనల్ ఇంప్రూవ్‌మెంట్ కోసం వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అదెలాగంటే..
సమ్మర్‌లో ఆటలు, సినిమాలతో టైం పాస్ చేస్తూనే రోజుకి కొంత టైంని పర్సనల్ ఇంప్రూవ్‌మెంట్ కోసం ఉపయోగించుకునేలా ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త స్కిల్స్ నేర్చుకునేందుకు, కొత్త విషయాలు ఎక్స్‌ప్లోర్ చేసేందుకు ఈ టైం చక్కగా పనికొస్తుంది. సమ్మర్ టైం ను ఎలా ప్లాన్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రయాణాలు చేయడానికి తీరికే దొరకదు చాలామందికి. కాబట్టి సమ్మర్ సెలవులను కొత్త ప్రదేశాలు చుట్టి రావడానికి వాడుకోవచ్చు. తద్వారా మానసిక ఆహ్లాదంతోపాటు కొత్త ప్రదేశాల గురించిన జ్ఞానం లభిస్తుంది. అలాగే కొత్త మనుషులతో పరిచయాలు, కొత్త అభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
మీకు పుస్తకాలు చదివే అలవాటు లేకపోతే దాన్ని స్టార్ట్ చేయడానికి ఇదే అనువైన సమయం. రోజులో ఏదో ఒక టైంలో బోర్‌గా అనిపించినప్పుడు పుస్తకం తెరిచి చదవడం మొదలుపెట్టండి. నచ్చకపోతే మరొక పుస్తకం ట్రై చేయండి. కొన్నాళ్లకు ఏదో ఒక పుస్తకం మీ సమయాన్ని లాగేసుకుంటుంది. అది మీలో ఓ కొత్త మార్పుని తీసుకురాగలదు.
కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకునేవాళ్లు సమ్మర్ టైంను అస్సలు వేస్ట్ చేసుకోకూడదు. మ్యూజిక్ ఇనుస్ట్రుమెంట్స్ నుంచి సాఫ్ట్‌వేర్ లాంగ్వేజెస్ వరకూ రకరకాల విషయాలను ఆన్‌లైన్‌లో నేర్చుకునే సౌలభ్యం ఇప్పుడు ఉంది. కాబట్టి నెల రోజుల వ్యవధిలో ఒక మంచి స్కిల్‌లో బేసిక్స్ నేర్చుకోవచ్చు.
కొత్త అలవాట్లు నేర్చుకోడానికి కూడా ఇదే అనువైన సమయం. ఉదాహరణకు.. వ్యాయామం మొదలుపెట్టాలి అనుకునే వాళ్లకు.. మిగతా రోజుల్లో ఏదో ఒక సాకు అడ్డొస్తుంది. కానీ, ఇప్పుడు సెలవులే కాబట్టి మెల్లగా మొదలుపెట్టొచ్చు. వ్యాయామం ఒక్కటే కాదు, ఆటలు ఆడడం, స్విమ్మింగ్ నేర్చుకోవడం.. ఇలా ఒక అలవాటుని మొదలుపెట్టడానికి ఈ సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు.
ఇకపోతే పాత స్నేహితుల్ని, బంధువులను కలిసేందుకు కూడా ఇదే సరైన సమయం. చాలా గ్యాప్ వచ్చింది అనుకున్న వ్యక్తులను, మిస్ అవుతున్న వారిని తిరిగి కలిసేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకుని రిలేషన్స్‌ను మరింత బలపరచుకోవచ్చు.