Telugu Global
Family

ఎవరికైనా సలహా ఇచ్చేముందు.. ఇవి గుర్తుంచుకోవాలట!

ప్రపంచంలో సులువుగా లభించేది ఏదైనా ఉంటే అది సలహానే! కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా ఉచిత సలహాలు పడేస్తూ ఉంటారు. కానీ మరికొంత మంది మాత్రం ఆచితూచి ఉపయోగపడే సలహాలిస్తుంటారు.

ఎవరికైనా సలహా ఇచ్చేముందు.. ఇవి గుర్తుంచుకోవాలట!
X

ప్రపంచంలో సులువుగా లభించేది ఏదైనా ఉంటే అది సలహానే! కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా ఉచిత సలహాలు పడేస్తూ ఉంటారు. కానీ మరికొంత మంది మాత్రం ఆచితూచి ఉపయోగపడే సలహాలిస్తుంటారు. ఇచ్చే సలహా సరైనది అయితే.. అది మరొకరి జీవితాన్ని కాపాడుతుంది. సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తుంది. అందుకే సలహా ఇచ్చేముందు కొన్ని విషయాలు ఆలోచించాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..

-అవతలివారి సమస్య మనకు మామూలుగా అనిపించినా, దానికి సొల్యూషన్ మన దగ్గర ఉందనిపించినా.. అడగకుండా ఇచ్చే సలహాకి వాల్యూ ఉండదు కాబట్టి.. అడిగే దాకా సలహాలు ఇవ్వకూడదు. ముఖ్యంగా అవతలి వ్యక్తితో అంత చనువు లేనప్పుడూ, నలుగురిలో ఉన్నప్పుడు అస్సలు ఇవ్వకూడదు. తొందరపడి ఇచ్చే సలహా వాళ్లని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకే ఒకవేళ ఆ సమస్యకు మీ దగ్గరే సొల్యూషన్ ఉందనిపిస్తే ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి సలహాను వివరంచి చెప్పాలి.

కొంతమంది వచ్చిన ప్రాబ్లెమ్ గురించి పదేపదే, ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు. పక్కవారికి చెప్పుకుని కాస్త రిలాక్స్ అవడం కోసం అలా చేస్తుంటారు. అలాంటప్పుడు ఆ మాటలు ఓపిగ్గా వినాలి. మనకి విసుగు అనిపించినా, వారిని అడ్డుకోకుండా డిస్కషన్ కొనసాగించాలి. వీలైతే ఇంకా ప్రశ్నలు అడిగి, సమస్యలోని అన్ని కోణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.

-సమస్య మనది కాకపోయినా... సలహా ఇచ్చేది మనమైనప్పుడు.. ఆ సమస్యను మనదిలానే చూడాలి. సమస్యని కాసేపు మనదిగా భావిస్తేనే, అందులోని లోటుపాట్లు తెలుస్తాయి. అలా కాకుండా జస్ట్ ఒక మూడో వ్యక్తిగా చూస్తే.. సమస్య చాలా తేలికగా కనిపిస్తుంది. పరిష్కారం కూడా అలాగే ఉంటుంది.

సలహా కోసం వచ్చారు కదా అని చాలామంది అవతలి వారిని చులకనగా చూస్తుంటారు. కానీ అవతలివారు తమమీద నమ్మకంతో వచ్చారన్న సంగతి గుర్తుంచుకోరు. అందుకే ఎవరైనా సలహా అడిగినప్పుడడు, సమస్యను విని, నిజాయితీగా తోచిన సలహాను ఇవ్వాలి.

సలహా అడిగారు కదా అని అవతలివారిని తక్కువ చేసి ‘అంతా నాకే తెలుసు’ అన్నట్టు వ్వవహరించకూడదు. సమస్య గురించి మనకు తోచిన అభిప్రాయాలు, పరిష్కారాలు... అన్నీ అవతలివారితో చర్చించి నిర్మొహమాటంగా తేల్చేయాలి. అప్పుడే సలహా ఇవ్వడం ఒక కాలక్షేపంగా కాకుండా ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌ను సలహాలు అడగడం సహజం. అలాగే అడక్కుండా కూడా కొన్నిసార్లు సలహాలు ఇవ్వాల్సి రావొచ్చు. సందర్భం ఏదైనా సలహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఆలోచనా సామర్థ్యం తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఎదుటివారి సలహాలనే సీరియస్‌గా పాటిస్తారు. కాబట్టి సలహాల విషయంలో రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలనేది నిపుణుల సూచన.

First Published:  4 May 2024 12:30 AM GMT
Next Story