Telugu Global
Editor's Choice

కోమ‌టిరెడ్డికి పూర్తి క్లారిటీ ఉంది.. అయోమ‌యం అంతా కాంగ్రెస్ పార్టీదే..

సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి, ఎంపీ ఉత్తమ్ తదితర సీనియర్ల మద్దతును కూడగట్టడంలో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయవంతమయ్యారు. అయితే రేవంత్ రెడ్డికి ఢిల్లీలో పరపతి ఉండడం మిగతా నాయకులకు మింగుడు పడటం లేదు.

కోమ‌టిరెడ్డికి పూర్తి క్లారిటీ ఉంది.. అయోమ‌యం అంతా కాంగ్రెస్ పార్టీదే..
X

ఇటు తమ్ముడు, అటు పార్టీ.. ఎటు వైపు మొగ్గాలన్న అయోమయమేది కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేదు. ఆయనకు ఈ విషయంలో స్పష్టత ఉంది. అందుకే మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎంపిక వ్యవహారం తేలకుండా వీలైనంత జాప్యం జరిగేలా ఆయన ఒక వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. పార్టీలోని రెండు వర్గాల మధ్య పోరాటంతో ఢిల్లీ హైకమాండ్ కూడా తేల్చుకోలేకుండా పోతోంది. సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి, ఎంపీ ఉత్తమ్ తదితర సీనియర్ల మద్దతును కూడగట్టడంలో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయవంతమయ్యారు. అయితే రేవంత్ రెడ్డికి ఢిల్లీలో పరపతి ఉండడం మిగతా నాయకులకు మింగుడు పడటం లేదు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్‌ రేవంత్ రెడ్డి మనిషి కావడం టీకాంగ్రెస్ నాయకులకు ఇబ్బందిని కలిగిస్తోంది. ఠాగూర్ ద్వారా తన మాట నెగ్గించుకోవాలన్నది రేవంత్‌రెడ్డి ఆలోచన.

చల్లమల్ల కృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌ ప్రతిపాదిస్తున్నారు. అధికారపార్టీ టిఆర్ఎస్, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెస్ మాజీ నాయకుడు, బిజెపి తాజా నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలకు దీటుగా 'ధనబలం' ఉన్న వ్యక్తి మాత్రమే గట్టి పోటీ ఇవ్వగలరన్న అభిప్రాయం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ కార్యకర్తల దృష్టిలో కృష్ణారెడ్డి సరైన అభ్యర్థి. కానీ పాల్వాయి స్రవంతికి టికెట్టు ఇప్పించాలన్న పట్టుదలతో రేవంత్ రెడ్డి వ్యతిరేక శిబిరం పనిచేస్తోంది.

స్రవంతి తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మునుగోడు శాసనసభ్యునిగా పనిచేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ హేమాహేమీలలో ఒకరిగా పాల్వాయికి గుర్తింపు ఉండేది. అయితే అది గతం. దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి ఉన్న పాపులారిటీ ప్రస్తుతం వర్కవుట్ కాదని ఆ పార్టీ కార్యకర్తల వాదన. 60, 70 ఏండ్లు పైబడిన వృద్ధులకు తప్ప ఈ జనరేషన్ కు పాల్వాయి గురించి తెలియదు. అందువల్ల యువతలో గోవర్ధనరెడ్డి కూతురు స్రవంతికి ఆదరణ కష్టమన్న విశ్లేషణలున్నాయి. పైగా ఆమె ప్రభావం చండూరు, మర్రిగూడ మినహా మిగతా 5 మండలాల్లో ఉండదని కాంగ్రెస్ కార్యకర్తలంటున్నారు. పైగా పాల్వాయి స్రవంతికి మద్దతుదారులుగా గుర్తింపు పొందిన పలువురు సర్పంచ్ లు, ఇతర గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ లేదా బీజేపీలో వలసలు వెళ్లారు.

చల్లమల్ల కృష్ణారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాల్లో వేగంగా దూసుకువచ్చారు. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండడం ఆయనకు అనుకూల అంశం. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేసిన వెంటనే చండూరులో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించి హడావుడి చేసింది. రేవంత్ చొరవతో చండూరు సభ జరిగినా, సభ జనసమీకరణలో కృష్ణారెడ్డి కీలకపాత్ర పోషించినట్టు కొందరు నాయకులు చెబుతున్నారు.. కాగా హుజూరాబాద్‌లో వెంకట్‌ ను అభ్యర్థిగా నిలబెట్టి రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని, మునుగోడులో చల్లమల్ల కృష్ణారెడ్డిని నిలబెట్టినా అదే పరిస్థితి తలెత్తుతుందని రేవంత్ వ్యతిరేక శిబిరం చెబుతోంది. కానీ హుజూరాబాద్ ఎన్నికను మునుగోడుతో పోల్చడానికి వీలు లేదన్న వాదనలు రేవంత్ శిబిరంలో బలంగా వినిపిస్తున్నాయి.

కృష్ణారెడ్డి రాకెట్ లా వచ్చినప్పటికీ ఆయనకే పార్టీ టికెట్టు లభిస్తుందన్న విశ్వాసంతో పార్టీ క్యాడర్ చెల్లాచెదురు కాకుండా ఉందన్నది వాస్తవం. కాంగ్రెస్ పార్టీకి మునుగోడులో సంప్రదాయ ఓటుబ్యాంక్ బలంగా ఉంది. అయితే సమర్థ‌ నాయకత్వం లేకపోవడం ఆ పార్టీకి అక్కడ మైనస్. అయినప్పటికీ నాంపల్లి మండలం తుంగపాడు గ్రామంలో మంగళవారం బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగలడం, పార్టీ క్యాడర్ గట్టిగా ప్రతిఘటించడం ఆశ్ఛర్యాన్ని కలిగించిన ఘటన. సరైన నాయకత్వం లేకపోయినా, క్యాడర్ అసంఘటితంగా ఉన్నా తమ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా గెలిచి, రాజీనామా చేసి బీజేపీలో చేరడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది.

రేవంత్‌రెడ్డి బలపరుస్తున్న వ్యక్తి కాకుండా మరో వ్యక్తిని బరిలోకి దింపాలని టీపీసీసీ అధ్యక్షునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న బృందం ప్రయత్నిస్తోంది. గెలుపోటముల సంగతెలా ఉన్నా అభ్యర్ధి ఎంపిక వ్యవహారం పార్టీ హైకమాండ్ కు తలనొప్ప్పిగా మారింది. తాను ప్రతిపాదించే వ్యక్తికి టికెట్టు ఇస్తేనే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటాన‌ని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబడుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం సాగుతోంది.

ఆయన కాంగ్రెస్ కు కొరకరాని కొయ్యలా మారారన్న విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో బాధ్యత కలిగిన లోక్‌స‌భ‌ సభ్యునిగా ఉండి, పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నట్టు రేవంత్ రెడ్డి మద్దతుదారులు చెబుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పినా ఎంపీ దిగిరాకపోవడం 'ఉద్దేశపూర్వకంగా' పార్టీకి నష్టం కలిగించడంగా కొందరు నాయకులు అంటున్నారు. మునుగోడు అమిత్ షా బహిరంగసభకు జనసమీకరణలోనూ 'తమ్ముని కోసం' తన వంతు పాత్రను పోషించినట్టు ఆరోపణలు వచ్చినా ప్రియాంక గాంధీ ఎంపీ వెంక‌ట్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించి చర్చించారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముని బాటలోనే 'రాజకీయ భవిష్యత్తు'ను వెతుక్కునే అవకాశాలు లేకపోలేదంటూ మునుగోడులో ప్రచారం సాగుతోంది. అందుకే ఆయన ఇప్పటినుంచే 'రంగం'సిద్ధం చేసుకుంటున్నట్టు కొందరు పార్టీ సీనియర్లు కూడా అనుమానిస్తున్నారు.

మునుగోడులో కాంగ్రెస్ తరపున 'బలహీన'అభ్యర్థిని బరిలోకి దింపడం ఎంపీ లక్ష్యంగా చెబుతున్నారు. తద్వారా 'తమ్మునికి' ప్రయోజనం చేకూర్చాలని ఆయన అనుకుంటూ ఉండవచ్చు. చల్లమల్ల కృష్ణారెడ్డి మినహా మరెవరైనా సరే, టిఆర్ఎస్, బీజేపీలను ఢీ కొనలేరని కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం ఉంది. నిజానికి ఆగస్టు రెండోవారం వరకు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ సంస్థలు జరిపిన సర్వేలలో టిఆర్ఎస్ కు 40 శాతం, కాంగ్రెస్ కు 34 శాతం ప్రజాదరణ ఉన్నట్టు తేలింది. బీజేపీకి పెద్దగా బలం లేదని, మూడోస్థానంతో సరిపెట్టుకోక తప్పదని ఆ సర్వేలు తెలియజేశాయి. కానీ అభ్యర్థి ఖరారులో జరుగుతున్న జాప్యం, పార్టీ కార్యక్రమాల్లో పస లేకపోవడం, స్థానిక నాయకత్వం సమర్థ‌వంతంగా పని చేయకపోవడం వంటి కారణాలతో క్రమంగా నియోజకవర్గమంతటా బలాబలాల్లో తేడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో 'కోవర్టులు' తమ కార్యకలాపాలను ఉధృతం చేస్తున్నందున పోటీ టిఆర్ఎస్, బీజేపీల మధ్యనే కేంద్రీకృతమయ్యే సూచనలున్నవి.అప్పుడు కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం కావలసి వస్తుంది.

First Published:  7 Sept 2022 1:21 PM IST
Next Story