Telugu Global
Editor's Choice

రైతుభరోసాపై మరోసారి పీచేమూడ్‌!

మెజార్టీ రైతులకు ఎగ్గొట్టే ప్రయత్నాల్లో రేవంత్‌ రెడ్డి సర్కారు

రైతుభరోసాపై మరోసారి పీచేమూడ్‌!
X

రైతుభరోసాపై రేవంత్‌ రెడ్డి సర్కారు మరోసారి పీచేమూడ్‌ అన్నది. యాసంగి సీజన్‌లో మెజార్టీ రైతులకు ఎగవేయడమే లక్ష్యంగా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. వానాకాలం పంట సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేకపోయామని.. యాసంగి సీజన్‌ రైతుభరోసాను సంక్రాంతి పండుగకు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నమ్మబలికింది. పంట సాగు చేసిన భూములకు మాత్రమే రైతుభరోసా ఇస్తామని.. దానికోసం సర్వే చేసి ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి జనవరి 26 నుంచి అమలు చేస్తామని మరోసారి చెప్పింది. జనవరి 26 బ్యాంకుల సెలవు కాబట్టి 27వ తేదీన అంటే అర్ధరాత్రి నుంచే 70 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రైతుభరోసా డబ్బు జమ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా చెప్పారు. క్యాలెండర్‌లో జనవరి 27వ తేదీ వచ్చింది.. మరికొన్ని గంటల్లోనే డేట్‌ మారి 28వ తేదీ రాబోతుంది. కానీ ఇప్పటి వరకు మండలానికి ఒక్క గ్రామంలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ చేశారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా 577 గ్రామాల్లోని రైతులకే రైతుభరోసా అందింది. ఈ పథకం కింద జరిగిన లబ్ధి ఎంతో తెలుసా.. కేవలం రూ.569 కోట్లు మాత్రమే. తెల్లవారుతూనే మీ బ్యాంకు ఖాతాల్లో రైతుభరోసా పైసలు పడతాయని సీఎం హోదాలో రేవంత్‌ రెడ్డి చెప్పిన మాటను నమ్మి సోమవారం ఉదయం నుంచి సెల్‌ ఫోన్లలో మెసేజ్‌ల కోసం ఎదురుచూసిన వారు కొందరైతే.. కొందరు రైతులు ఏకంగా బ్యాంకులకు వెళ్లి తమకు డబ్బులు పడితే నగదు రూపంలో ఇవ్వాలని అడిగినోళ్లు ఇంకొందరు. కానీ వాళ్లెవరికీ రైతుభరోసా రాలేదు. ఎప్పటికి వస్తుందో ప్రభుత్వ పెద్దలకే క్లారిటీ లేదు.

దేశంలో రైతులకు పెట్టుబడి సాయం అందజేసి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. 2018 వానాకాలం పంట సీజన్‌కు ఒక్కో ఎకరానికి ఒక్కో సీజన్‌కు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అప్పటి సీఎం కేసీఆర్‌ అందజేశారు. మొదటి విడతలో చెక్కుల రూపంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేశారు. ఆ తర్వాత సీజన్‌ నుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం ప్రారంభించారు. ఏడాది తర్వాత పెట్టుబడి సాయాన్ని ఎకరానికి ఏడాదికి రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. 2023 వానాకాలం పంట సీజన్‌ వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం కొనసాగింది. అదే ఏడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడంతో రైతుబంధు పంపిణీకి బ్రేక్‌ పడింది. ఇప్పుడు రైతుబంధు తీసుకుంటే రూ.10 వేలే వస్తాయి.. డిసెంబర్‌ 9న ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది.. అప్పుడు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ హామీలను నమ్మి ప్రజలు ఆ పార్టీని ఎన్నికల్లో గెలిపించారు. అయినా రైతుబంధు సాయాన్ని పెంచలేదు. అప్పటికే కేసీఆర్‌ ప్రభుత్వం రైతుబంధు కోసం సమీకరించి పెట్టిన రూ.7,500 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసుకొని చేతులు దులుపుకుంది.

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన రైతుభరోసా సాయం ఎకరానికి ఏడాదికి రూ.15 వేలకు పెంచడంతో పాటు ఎవరికి రైతుభరోసా ఇవ్వాలనేది నిర్దారించేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ నియమించింది. ఈ కమిటీ పేరుతో వానాకాలం పంట సీజన్‌కు రైతుభరోసా ఎగవేశారు. ఇక ఆ డబ్బు వేసేది కూడా లేదని చెప్పేశారు. యాసంగి పంట సీజన్‌ కు జనవరి 26 నుంచి అమలు చేస్తామని చెప్పి నాలుక మడతేశారు. మార్చి నెలాఖరు వరకు ఈ స్కీం కొనసాగిస్తామని మరో బాంబు పేల్చేశారు. అంటే యాసంగి పంట సీజన్‌ పూర్తయ్యే సమయానికి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్న చావు కబురును రేవంత్‌ ప్రభుత్వం చల్లగా చెప్పింది. సాగు యోగ్యమైన అన్ని భూములకు రైతుభరోసా ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పింది. రైతుభరోసా పెంపును రూ.15 వేలకు కాకుండా రూ.12 వేలకు పరిమితం చేస్తున్నామని కూడా ప్రకటించింది. రైతుభరోసాకు ఎవరు అర్హులో ఆ వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. గతంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు మొదటి రోజు రైతుబంధు సాయం జమ చేసేవారు. అలా ఒక్కో ఎకరం పరిమితిని పెంచుతూ చివరి రైతు వరకు సాయం అందజేసేవారు. పది ఎకరాల వరకు భూములన్న రైతులకు పంట సాగుకు ముందే రైతుబంధు సాయం జమ చేసేవారు. ఆ తర్వాత వెసులుబాటును బట్టి 54 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేవారు. పది ఎకరాలకు పైగా భూములున్న రైతులు తెలంగాణలో లక్షలోపే ఉన్నారు. అంటే 99 శాతం మంది రైతుల ఖాతాల్లో పంట సీజన్‌ కు ముందే రైతుబంధు ఇచ్చేవారు. కానీ కాంగ్రెస్‌ ఇస్తామన్న రైతుభరోసా సీజన్‌ పూర్తయ్యాకగానీ అందే పరిస్థితి కనిపించడం లేదు.

రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు పథకాలను ఎంపిక చేసిన గ్రామాలతో ప్రారంభిస్తున్నారంటే సమర్థించుకోవచ్చు.. రైతుబంధు పథకం గతంలో అమలు చేసిందే.. ఈ స్కీం పేరు మార్చి రైతుభరోసా పేరుతో ఈ సీజన్‌లో అమలు చేస్తున్నారు. పేరు మాత్రమే మారింది తప్ప ఇందులో పెద్దగా మార్పులు లేవు. వ్యవసాయ యోగ్యంకాని భూములు పేరుతో కొన్నింటికి మాత్రమే సాయం నిలిపివేస్తున్నారు. లబ్ధిదారులెవరో క్లారిటీ ఉన్నప్పుడు ఎంపిక చేసిన గ్రామాలకే రైతుభరోసా ఇస్తామనడం అంటే ఈ స్కీంను వీలైనంత ఎక్కువ మందికి ఎగవేసే ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఈ స్కీం అమలు మార్చి నెలాఖరు వరకు కొనసాగుతుంది అంటే మిగతా వాళ్లందరికీ అప్పుడే పంట సాయం చేస్తారా అనే దానిపై ప్రభుత్వ పెద్దలకే స్పష్టత లేదు. ఇప్పటికే ఒక సీజన్‌కు రైతుబంధు ఎగవేశారు.. ఇప్పుడు ఎంపిక చేసిన గ్రామాల పేరుతో నాలుక మడతేశారు.. అసలు రైతుబంధు ఇస్తారా లేదా అని అనేక చోట్ల అధికార పార్టీ నేతలను రైతులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా స్కీం అమలు చేసినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని.. ఇప్పుడు ఈ ప్రభుత్వం మండలానికి ఒక ఊరికి మాత్రమే సాయం చేస్తామంటే తాము వ్యవసాయం చేయడం లేదా అని మిగతా గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు. అసలు రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి నిరసన.. ప్రతిపక్షాల విమర్శల తర్వాత నింపాదిగా ప్రభుత్వ పెద్దలు మేల్కొని.. మిగతా గ్రామాల రైతులకు భరోసా సాయం చేస్తామని చెప్పారు. కానీ ఎప్పటిలోగా ఇస్తారనే దానిపై మాత్రం సౌండ్‌ లేదు. అంటే వీలైనన్ని రోజులు సాగదీయడం.. వీలైనంత ఎక్కువ మందికి ఎగవేయడం అనేది తమ విధానమని కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పష్టత ఇస్తున్నట్టే అనిపిస్తోంది.

First Published:  27 Jan 2025 5:59 PM IST
Next Story