ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూత
ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. శ్యామ్ బెనగల్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు
ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. సోమవారం సాయంత్రం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. కాగా, శ్యామ్ బెనగల్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్, దాదా సాహేబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది. అంతేకాదు.. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను శ్యామ్ బెనగల్ దక్కించుకున్నారు.1934 డిసెంబర్ 14న హైదరాబాద్ సమీపంలోని తిరుమలగిరిలో శ్యామ్ బెనగల్ జన్మించారు.
సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజీ డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదివారు. 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం అందుకున్నారు. 2013లో ఏఎన్నార్ జాతీయ అవార్డు అందుకున్నారు. అంకుర్, నిశాంత్, మంథన్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తీసిన సినిమాలకు 18 జాతీయ అవార్డులు దక్కాయి. శ్యామ్ బెనగల్‌కు పేరు తెచ్చిన సినిమాలు.. అంకూర్(1974), నిషాంత్ (1975), మంతన్(1976), భూమిక(1977), జునూన్(1978). ఇక జబర్‌దస్త్ డాక్యుమెంటరీని రూపొందించారు. పద్మశ్రీ(1976), పద్మభూషణ్(1991), దాదాసాహెబ్ ఫాల్కే(2005) అవార్డులు వరించాయి.