టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు. తమ కులం వాళ్లను తన సినిమా చూడమంటే… ఒక్కడు కూడా చూడడని అన్నారు. కలెక్షన్ కింగ్ నటుడిగా 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జన్మనిచ్చిన తన తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువు దాసరి నారాయణరావు దీవెనలు తనపై ఎప్పుడూ ఉంటాయని మోహన్ బాబు తెలిపారు.
తనను ఈ స్థాయికి ఫ్యాన్స్ తీసుకొచ్చారని ఆయన తెలిపారు. లైఫ్‌లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని…అన్నం కూడా దొరకక ఇబ్బంది పడిన రోజులు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఈరోజు ‘మా’ అసోసియేషన్ లో ఉన్న మీ అందరితో కలిసి భోజనం చేయాలనుకున్నానని… అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని తన కుమారుడు విష్ణుని అడిగానని చెప్పారు. తనకు కులమతాలతో సంబంధం లేదని… అందరూ తనకు సమానమేనని చెప్పారు. అన్ని కులాలు ఒక్కటేనని అన్నారు. తాను ఎన్నో మంచి పనులు చేశానని… అయితే వేదికలపై వాటి గురించి చెప్పడం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. ఎంతో మంది పిల్లలను తాను చదివించానని మోహన్ బాబు తెలిపారు.