Telugu Global
Arts & Literature

లవ్ వాక్సిన్ ( కవిత)

లవ్ వాక్సిన్ ( కవిత)
X

సాగరజలాల్లో తొలిసారిగా

అమినోఆమ్లాల రూపంలో

జీవం పుట్టినా

జాతుల ఉత్పత్తి

పరిణామ క్రమం అంటూ

డార్విన్ ఉటంకించినా

సహజాతాలు అనువంశికత

అంటూ మెండల్

అభివ్యక్తీకరించినా

ఉత్పరివర్తనలు

నీ జన్యువుల్లో

కలిగే ఆకస్మిక మార్పులు అంటూ

హ్హ్యూగో డివ్రీస్

నీ రహస్యాలను ఛేదించినా

గుహల్లో తిరిగే నువ్వు

హోమో ఎరెక్ట్స్ నుంచి

హోమో సెపియాన్

రెండు కాళ్ళ మనిషిగా మారినా

అడుగడుగునా నీకు తోడై నడిపించింది విజ్ఞాన శాస్త్రమే..

మనిషిలో

రక్తం ప్రవహిస్తోంది అంటే

విలియం హార్వెని రాళ్లతో కొట్టి చంపేశారు

స్వార్ధ మతాధికారులు..

చెడుగాలిలో క్రిములవల్ల

నీకు వ్యాధులు వస్తున్నాయని

మరో శాస్త్రవేత్త చెపితే

వెకిలిగా నవ్వారు మీరంతా..

ఆర్యభట్ట సున్నాని కనుగొన్నా

మేడం క్యూరీ రేడియం కోసం

జీవితం ధారపోసినా

కాంతిపుంజ విచ్చిన్నం

అంటూ సీ.వీ. రామన్

రామన్ ఎఫెక్ట్ ని కనుగొన్నా

E=MC-square అని ఐన్స్టీన్

సాపేక్ష సిద్దాంతంని కనిపెట్టినా

అంతా నీ సౌఖ్యం కోసమే

నీ మనుగడ కోసమే

నీ సంతోషం కోసమే..

ఇక్కడ స్వర్గం నరకం అంటూ

ఏమి లేవు

అంతా న్యూటన్ మూడవ సూత్రమే

చర్యకు ప్రతిచర్య

రెండు చేతులు కలిపితేనే

చప్పుడు అయినా

చప్పట్లు అయినా..

ఓ చెట్టుని పెంచితే

వందల జీవులకు ఆధారం అవుతుంది

మేఘాలు వదిలే

ఒక్కక్క నీటి బొట్టుని

ఒడిసిపట్టుకుంటే

ఎందరి దాహమో తీరుతుంది..

విద్వేషాలు మూఢనమ్మకాలు గొర్రెదాట్లు విడవకుండా

అణ్వాయుధాలు అణ్వస్త్రాలు విధ్వంసానికి

వినియోగించుకుంటూ పోతే వినాశనమే ఇక మిగిలేది నీకు..

ఎన్ని విపత్తులో జయించిన

ఓ మనిషీ !మేధావీ !

ఎదుటి మనిషిపై ద్వేషాన్ని

ఇంకా నీవెందుకు జయించలేకున్నావు..?

నీ శాస్త్ర విజ్ఞానంతో

నీ మహా మేధస్సుతో

నీ తెలివితేటలతో

ప్రతిమనిషిలో ద్వేషం అసూయ

కోపం లాంటి

దుష్ట సూక్ష్మ క్రిములను

నాశనం చేసి

మమతని పెంచే మనసు

కరుణని కురిపించే కళ్ళు

సేవ చేసే చేతులు

ప్రేమని కురిపించే

హృదయం కోసం

ఇప్పుడు నీవొక సరికొత్త

ప్రేమ వాక్సిన్ కనుక్కోవాలి..

- రోహిణి వంజారి

First Published:  16 April 2023 3:16 PM IST
Next Story