నన్ను తీసుకెళ్లండి ప్లీజ్..! (స్కెచ్)
"వీడికెంత చెప్పినా వినిపించుకోడు. నన్ను నెత్తికెక్కించుకోరా, నిన్ను ప్రేమగా చూసుకుంటానని" చాలాసార్లు చెప్పాను.ఎప్పుడైనా వినిపించు కుంటే కదా! నన్ను చూసీ,చూడనట్లు వదిలేస్తున్నాడు. నా విలువ తెలియని వాడికి నా గురుంచి ఎంత చెప్పినా తక్కువే మరి. చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే.బాధ పడితే గానీ బోధ పడదు మరి !
గతంలో నన్ను ప్రేమించి, నెత్తికెక్కించుకున్నోళ్లు. నాలుగు కాలాల పాటు పదిలంగా ఉన్న సంగతి విడికితెలియాలి. ఎక్కడికో ఎందుకు? వీడి బాబు సంగతే వీడికి తెలియాలి. వీడి బాబు పేరు బంగార్రాజు ఆరడుగుల అందగాడు. ఉంగరాల జుట్టుతో అపరిచితుడులో 'రెమో' లాగా అందంగా ఉండేవాడు. మొదట్లో నన్ను బాగా నిర్లక్ష్యం చేసేవాడు.ఒకసారి బైక్ మీద పట్నం వెళ్తున్నప్పుడు నన్ను పట్టించుకోకుండా పక్కన పెట్టాడు.
నాలుగు రోడ్ల జంక్షన్ లో ఓ పోలీసన్న చూసి "ఏమయ్యా! నీకు బుద్ధుందా? ఎంతో ప్రేమగా నెత్తినెట్టుకొని పూజించాల్సిన తనని అలా దూరంగా పెడతావా"?అంటూ కోపంగా చిరుబుర్రులాడాడు.అంతటితో ఊరుకుంటేనా! పరపరా పేపర్ మీద ఏదో గీసి బంగార్రాజు చేతిలో పెట్టాడు.అప్పుడు మా రాజు కుక్కిన పేనులా మారు మాట్లాడకుండా జేబులో గాంధీ బొమ్మ నోటు తీసి అతని చేతిలో పెట్టి అక్కడినుంచి కదిలాడు. అప్పుడు చూడాలి కదా! మా బంగార్రాజు ముఖం బాగా మాడిపోయిన మసాలా దోశలాగ అయిపోయిందంటే నమ్మండి.
ఏమనుకున్నాడో.. ఏమో మరి! నన్ను ప్రేమగా తన చేతుల్లోకి తీసుకొని నాకు సముచిత స్థానాన్నిచ్చాడు. అలా చేయడమే అతగాడికి పనికొచ్చింది మరి!ఎందుకంటారా? కాస్త ముందుకు వెళ్ళాడో లేదో? వేగంగా వస్తున్న లారీ ఒకటి వెనుక నుంచి వచ్చి బంగార్రాజు నడుపుతున్న బైక్ ని ధన్ మని గుద్దింది. సర్కస్లో ఫీట్లు చేసే కుర్రోడిలాగా గాల్లో పల్టీలు కొట్టి క్షణకాలంలో రోడ్డు మీద పడ్డాడు.
"అబ్బా! ఎంత అదృష్టమయ్యా నీది. అంత గట్టిగా రోడ్డు మీద పడ్డా తలకు చిన్నదెబ్బయినా తగల్లేదు. అన్నారు చుట్టూ చేరిన వాళ్ళందరూ..అతని అదృష్టాన్ని, నా గొప్పతనాన్ని అందరూ కీర్తిస్తుంటే, నాకు ఏనుగెక్కినంత సంబరం కలిగింది. పడి లేచిన నా యజమాని బంగార్రాజు నన్ను ప్రేమగా తన చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా ముద్దాడాడు. మీకు చెబితే నమ్మరు గాని అప్పట్నుంచి అతనెక్కడికెళ్లినా నన్ను నెత్తినెట్టుకుని పూజించేవాడు.
ఇదిగో ఇప్పుడే నాకు కాస్త బాధగా ఉంది. మా బంగార్రాజు ముద్దుల కొడుకు మురళి నన్ను నిర్లక్ష్య0 చేస్తున్నాడు. "ఒరేయ్ మురళి బైటకు వెళ్ళినప్పుడు తనని కూడా తీసుకువెళ్లరా" అనేవాడు వాళ్ళనాన్న. కుర్రకుంక వింటే కదా!" ఏం పర్వాలేదు నాన్నా" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి నన్ను వదిలివెళ్ళేవాడు.
ఇదిగో ఇప్పుడు కూడా అలానే చేసాడు. అన్నిరోజు లు ఒకేలా ఉండవు కదా!
నాక్కూడా తనతో పాటు వెళ్లాలనే ఉంది. వాడిని అంటిపెట్టుకుని తిరగాలని ఉంది.
చెబితే వినరు కదా!
నేటితరం కుర్రకారు. వీళ్లు ఎప్పుడూ ఇంతే, పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు పెడచెవిన పెడతారు. అహంతో బ్రతుకుతారు. అంతా మాకే తెలుసనే గర్వం వీళ్ళకి.
మన వాడు ఆకాశంలో రెక్కల గుర్రం పై ఎగిరినట్లు రోడ్డు పై బైక్ నడపాలనుకున్నాడు.
ఒక్క క్షణం లో జరగరానినది జరిగి పోయింది. వినరాని వార్త విన్నాడు మా బంగార్రాజు.
బైక్ అతివేగంతో నడుపుతూ ఆగి ఉన్న లారీని "ఢీ" కొట్టడంతో తలకి బలమైన గాయం కావడం వల్ల మురళి అక్కడికక్కడే మరణించాడని..ఆ వార్త సారాంశం. ఆ తల్లిదండ్రుల కడుపుకోత ఎవరు తీర్చగలరు? నేనే మనిషినైతే కొన్ని కన్నీటి బొట్లు కార్చేదానిని. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమిలాభం ?. సరే!మీరైనా ప్రయాణంలో నన్ను తీసుకెళ్లండి ప్లీజ్..! మీ కోసం మీ కుటుంబం కోసం.మర్చిపోరు కదూ...!
—కోరాడ.అప్పలరాజు.
(అనకాపల్లి)